Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాధ్యతగల తల్లి తనకు లేకపోయినా పిల్లల కడుపు చూస్తుంది. అంతే బాధ్యతగల తండ్రి తాను గొడ్డు చాకిరీ చేసైనా కడుపున పుట్టినోళ్లకు బుక్కెడు బువ్వ పెట్టాలని చూస్తాడు. ఇక్కడ తల్లిదండ్రులు తమ ఆనందం కంటే కూడా పిల్లల కండ్లలో సంతోషం కోసం తహతహలాడతారు. వారి సంతోషాన్ని చూసి ప్రపంచాన్నే మరిచిపోతారు. ఇదే తరహాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధ బాంధవ్యాలను పరికించి చూస్తే... ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఒక తల్లిలా, తండ్రిలా రాష్ట్రాలను చూసుకోవాలి. వాటికి కావాల్సిన నిధులు, విధులు, అధికారాలను ఇచ్చి ఆయా రాష్ట్రాల పురోభివృద్ధికి తోడ్పడాలి. ఇదే విషయాన్ని భారత రాజ్యాంగం నొక్కి చెప్పింది. బలమైన రాష్ట్రాలుంటేనే.. బలమైన కేంద్రం సాధ్యమవుతుందని అది స్పష్టం చేసింది. దీన్నే సహకార సమాఖ్య వ్యవస్థ అంటాం.
కానీ ఎనిమిదేండ్ల హయాంలో కేంద్రంలోని మోడీ సర్కారు రాష్ట్రాల పట్ల ఏనాడూ ఈ రకమైన భావనను కలిగి లేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. ప్రత్యేకించి తెలంగాణ పట్ల అది అనుసరిస్తున్న తీరు గర్హనీయం. ముఖ్యంగా నిధుల విషయంలో బీజేపీ సర్కారు వేస్తున్న అడ్డుపుల్లలు అన్నీ ఇన్నీ కావు. ఆర్థిక పరమైన అంశాలు, నిధుల కేటాయింపు, వాటి మంజూరు, ఖర్చు విషయంలో టీఆర్ఎస్ సర్కారు వైపు నుంచి అనేక లోపాలు, లొసుగులు చోటు చేసుకున్న మాట వాస్తవం. కానీ పెద్దన్న స్థానంలో ఉండి వాటిని సరిదిద్దాల్సిన కేంద్రం... అందుకు భిన్నంగా ఆ పేరిట రాష్ట్రానికి ఉన్న హక్కులను కాలరాయటం అత్యంత నియంతృత్వం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచిన మొత్తం రూ.52,167 కోట్ల అప్పుల్లో... కేంద్రం దాదాపు రూ.19 వేల కోట్లకు కోత పెట్టటమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వివిధ కార్పొరేషన్ల పేరిట తీసుకున్న గ్యారెంటీ అప్పులకు సైతం అది దారులు మూసేయటాన్ని ఇక్కడ మనం గమనించాలి. మరోవైపు రుణాలకు సంబంధించి ఒక్కో రాష్ట్రం పట్ల ఒక్కో విధమైన విధానాన్ని మోడీ సర్కారు అనుసరించటం దారుణం. ఇందుకు పదిహేనో ఆర్థిక సంఘం నిబంధలను సాకుగా చూపటం పిల్లికి ఎలుక సాక్ష్యం లాంటిదే అవుతుంది తప్ప మరోటి కాదు. మరోవైపు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల (సీఎస్ఎస్)తో పాటు వివిధ కార్యక్రమాలు, పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను బాగా తగ్గించారు. ఇదే విషయం తాజాగా నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గంలో చర్చనీయాంశం కావటం, సీఎం కేసీఆర్ సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేయటాన్నిబట్టి కేంద్ర ప్రభుత్వ 'అష్ట దిగ్బంధన' చర్యలు తెలంగాణకు ఎలా శాపంగా మారిపోతున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.
ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని చెప్పక తప్పదు. ఫలితంగా ఉద్యోగులకు జీత భత్యాలు, పింఛన్లు నిర్ణీత సమయానికి ఇవ్వలేకపోవటం తదితర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్లపై రాష్ట్ర ప్రభుత్వం తెగించి కొట్లాడాలి. కేవలం ప్రకటనలు, విమర్శలకే పరిమితమైతే మొండికేసిన మోడీ ప్రభుత్వం వాటిని లెక్క చేయదనే విషయం అనేకసార్లు నిరూపితమైంది. రాష్ట్రం నుంచి పార్లమెంటుకు బీజేపీ తరపున నలుగురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా... వారి వైపు నుంచి అందుతున్న సహకారం శూన్యం. కేవలం ప్రచార ఆర్భాటాలు, తిట్లు, శాపనార్థాలకే ఆ నలుగురూ పనికొస్తున్నారు తప్పితే... తెలంగాణకు వెన్నుదన్నుగా నిలబడిన దాఖలాలు ఏనాడూ లేవు. వీరిలో కేంద్ర మంత్రి పదవిలో ఉన్న కిషన్రెడ్డి సైతం ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితమవుతున్నారు. రాష్ట్రానికి నిధులు, విధులు, విభజన హామీలపై నోరు మెదపటం లేదనే విమర్శలను విపరీతంగా ఎదుర్కొంటున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి లోక్సభకు ఎన్నికైన ముగ్గురు ఎంపీలు సైతం 'మూడు ముక్కలాట...'లో మునిగి తేలుతుండటం విస్మయపరిచే అంశం. ఆ త్రిమూర్తులు రాష్ట్ర సమస్యలను పట్టించుకున్న పాపాన పోవటం లేదు. పార్లమెంటులో వారు మోడీ ప్రభుత్వంపై కొట్లాడిందీ లేదు. ఇప్పుడు జార విడుచుకున్న 'మునుగోడు'ను కాపాడుకోవటమే వారి ముందున్న అతి పెద్ద సవాల్. ఈ రకంగా ఇటు అధికార పార్టీ బలహీనతలు, ప్రతిపక్షంలోని లుకలుకలను సొమ్ము చేసుకున్న బీజేపీ రాష్ట్రానికి పైసలెగ్గొట్టి బంతాట ఆడుతోంది. ఈ ఆటలకు ఇప్పటికైనా చెక్ పెట్టాలి. లేదంటే మనకు చివరకు చిప్పే గతి అవుతుంది. తస్మాత్ జాగ్రత్త.