Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరు మూడు రంగుల్ని అర్థశతాబ్దంగా నిషేధానికి గురిచేశారో, వారే నేడు కప్పుకున్న ప్రేమతో నాటకరంగ అలంకరణలో రాటుదేలుతున్నారు. ఎవరునాటి విదేశీయ పాలకులకు జీహుజూర్ అని
సలాములు చేసి క్షమాపణలు దస్తూరి పరిచారో, వారే బ్రాండెండ్ దేశభక్తికి వారసులమని వ్రాక్కుచ్చుతున్నారు. ఎవరు, మనుస్మృతి తమ
రాజ్యాంగమని ప్రకటించి, భారత రాజ్యాంగమును ఈసడించారో, వారే
ఇప్పుడు అంబేద్కరు అందించిన కుర్చీపై కూచుని ధీర్ఘాలు
పలుకుతున్నారు. చరిత్ర ముఖంపై తెరలు కడుతున్నారు.
నిన్ను నువ్వు తెలుసుకోవడమే తత్వజ్ఞానం అన్నారప్పుడు. నిన్ను నువ్వు ప్రదర్శించుకోవటమే రాజనీతిజ్ఞానం ఇప్పుడు. మార్కెట్ పద్ధతులు సరుకులకే కాదు, రాజకీయాలకూ అవసరంగా మారింది. రాజకీయ రూపికలు నాయకులు. సరుకుల ప్రమోషన్లానే వీరి ప్రమోషన్కోసం ప్రదర్శన అధికమవుతున్న మార్కెట్ సందర్భంలో స్వతంత్రదేశానికి డెబ్భయిఐదేండ్లు నిండాయి. ఇప్పుడిక ఉత్సవోద్వేగ ప్రదర్శన మొదలయింది. త్రివర్ణం ఆండ్రాయిడ్ చరవాణిలో డీపీరూపంలో దర్శనమిస్తోంది. ఆండ్రాయిడ్ లేకపోవడం అనాగరికమిప్పుడు! దేశభక్తి దిగుమతయిన పాలిస్టర్ జెండాలో కన్నుల పండుగ చేస్తున్నది. ప్రతి ఇంటికప్పుపై రెపరెపలాడుతున్న దేశభక్తి ఫుట్‌పాత్ బతుకులను భక్తిరాహిత్య జాబితాలో నమోదు చేస్తున్నది. ఈవెంట్ మేనేజర్లతో ఘనతరజన గణాన్ని కదిలిస్తున్నది. ధరాఘాత క్షత గ్రాతుల హాహాకారాలపై నిషేదాజ్ఞలు విధించబడ్డాయి. రిలయన్స్ మార్ట్, స్పెన్సర్స్‌లో క్యూలో సరుకుల కోసం నిలబడ్డ వినియోగదారుల సౌకర్యార్థం పేట్రియాటిక్ గీతాలు ఉచితంగానే డౌన్లోడ్ చేయబడతాయి. గుండెలోంచి జారిపోయిన వందేమాతర భారత చిహ్నం కోటు జేబుకు గుచ్చివేయబడింది. రచయితల స్క్రిప్టుకు నాయకుల గొంతులు శృతిచేయబడి ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. దేశచరిత్ర, త్యాగం భక్తీ, రాజకీయ మార్కెట్ ఎకానమీలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా లాభాల చూపులతో గాలాలు వేస్తోంది.
ఇవేమీ అతిశయోక్తులు కాదు. అత్యంతాధునిక వాస్తవికతలు. అప్పుడు త్యాగం, సేవ, ప్రాణార్పణ దేశభక్తి. నేడు భోగం, అధికారం ప్రచారం, ప్రాయోజిత ప్రయోజనమే దేశభక్తికి అసలైన షరతు. ఎవరు మూడు రంగుల్ని అర్థశతాబ్దంగా నిషేధానికి గురిచేశారో, వారే నేడు కప్పుకున్న ప్రేమతో నాటకరంగ అలంకరణలో రాటుదేలుతున్నారు. ఎవరునాటి విదేశీయ పాలకులకు జీహుజూర్ అని సలాములు చేసి క్షమాపణలు దస్తూరి పరిచారో, వారే బ్రాండెండ్ దేశభక్తికి వారసులమని వ్రాక్కుచ్చుతున్నారు. ఎవరు, మనుస్మృతి తమ రాజ్యాంగమని ప్రకటించి, భారత రాజ్యాంగమును ఈసడించారో, వారే ఇప్పుడు అంబేద్కరు అందించిన కుర్చీపై కూచుని దీర్ఘాలు పలుకుతున్నారు. చరిత్ర ముఖంపై తెరలు కడుతున్నారు. మభ్యపెడుతూ అసత్యానికి కొత్త నగిషీలు చెక్కుతున్నారు. చూస్తుండగానే ఓ థీమాటిక్ ఈవెంట్లో నటీనటుల పాత్రలు రక్తికడుతున్నాయి. మీడియాలో వ్యాఖ్యాతల గొంతులు కొత్త భాషారూపాలకు శ్రీకారం చుట్టాయి. సర్వభజన బృంద సమాగమం, ఉత్సవం మహౌత్సవం.
జీడీపీ తగ్గిందేమంటే, ఈడీ సమాధానం చెబుతుంది. ప్రతిపక్షం స్వపక్షంలో చేరకుంటే సీబీఐ ఆరాతీస్తుంది. అరుస్తుంది. మనుషులు ప్రశ్నలు వేస్తారు. బుల్డోజర్లు జవాబులు చెబుతాయి. ఉద్యమం గొంతు లెత్తితే జైళ్ళు నోళ్లు తెరుస్తాయి. 'బేటీ పడావ్' అనే గావుకేక, ప్రయివేటుకు విద్యావేలం పాట. బేటీ బచావ్ అంటూనే వివక్షతల సంప్రదాయపు వల. సబ్కే సాత్, సబ్ కే విశ్వాస్ ఓ తేనెపూసిన కత్తి. ఇవన్నీ అలా ఉంచుదాం. ఆకలి జాబితాలో భారత్ వెలిగిపోవడం గురించి 75ఏండ్ల నెమరువేతలో ప్రస్తావనే ఉండదు. పౌష్టికాహారలోపంతో కోట్లాది భావిపౌరులు ఈసురోమని ఏడ్వడం ఎవరికీ వినిపించదు. పెరుగుతున్న నిరుద్యోగిత గ్రాఫు ఏకండ్లకూ కనిపించదు. ఊడిపోయిన ఉపాధి అంతా బ్రహ్మరాత ఫలితంగా వొదిలేసుకోవాలి. లేదంటే అగ్నిపథాన నాలుగేండ్లకే ఆత్మాహుతిగావించుకోవాలి. ఇంకా విశ్వగురుత్వంలో ఎన్నెన్ని తలపోయాలి. దేశం కోసం, ధర్మం కోసం పసిపాపల పాలడబ్బాపై జీఎస్టీ పన్నుకు జైకోట్టాలి. అద్దెకున్న ఇంటికీ తప్పదు గోళ్లూడకొట్టుకోవటం. ఆఖరికి చచ్చాక స్మశానంలో కూడా చెల్లించాల్సిన పన్ను కోసం చేయిచాచిన ప్రభుతను చూస్తే గుండెదహించుకోవడం లేదూ! అయితే కానీ ఆశ్రిత వర్గాల ఆదాయాల పెంపుకోసం అహర్నిశలూ శ్రమిస్తున్న, కార్పొరేట్ కార్యశీలత్వం వహిస్తున్న మన ఘనపాలనాధీశుల ఉరమ్ముల పొగడతరమా!
సహనశీల నేలను, విద్వేష పూరిత ఆవరణంగా మార్చి, మతంపైన, గతంపైన కలహాల పూతలు పూసి, జ్ఞానసిద్ధిని పొందిన బుద్ధుడు నడచిన మట్టిపైన మూఢత్వాన్ని నింపేచర్యకు ప్రతిచర్యఖాయమవుతుంది. అబద్ధాలు, అసత్యాలు ఎన్నెన్ని ముంచెత్తినా జనం వందో తప్పుకు ఖడ్గమెత్తక తప్పదు. సముజ్వల జాతీయోద్యమ చైతన్య స్ఫూర్తిని పొందటమంటే, లాఠీలకు, తూటాలకు గుండెల్ని ఎదురునిల్పిన, మహామహుల చరిత్ర స్మరణ. ఉరితాళ్లను ప్రేమగా ముద్దాడిన భగత్‌సింగ్ లాంటి అమరుల జ్ఞాపకాలఝరి. భరతమాత విముక్తియే జీవితలక్ష్యమై ప్రజాసేవలో అంకితులయిన ఎందరెందరో త్యాగధనుల తలపోతలో పునర్చేతనా శక్తి. విడగొట్టడం కాదు ఐక్యంగా నిలబెట్టడం. అమ్మకాలు చేపట్టటం కాదు, కొండంత నమ్మకాన్ని ఎదనింపటం. వెనక్కి వెనక్కి వెళ్ళడం కాదు, పదండి ముందుకని పాడటం. హక్కుల గొంతుపై ఉక్కుపాదాలు మోపటం కాదు, స్వేచ్ఛా పావురాలు రెక్కలు విప్పటం. అంతా బాగుందని బుకాయించటం కాదు... కేవలం ప్రదర్శనగా కళగా ఉద్వేగమార్కెట్లో లాభాలు ఏరుకోవడం కాదు. వొట్టి కపటమాటలు కట్టిపెట్టి దేశ ప్రజల గట్టిమేలుకు నడుం కట్టటం నేటి కర్తవ్యం.