Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(14, ఆగస్టు 1947 అర్థరాత్రి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉపన్యాసం)
చాలా సంవత్సరాల క్రితం గమ్యం చేరడానకి ఒక ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను గణనీయంగా పూర్తిచేసే సమయం వచ్చింది. అర్థరాత్రి సమయంలో, ప్రపంచం నిద్రపోతున్నప్పుడు, భారతదేశం కొత్త జీవితంలోకి, స్వేచ్ఛలోకి మేల్కొంటోంది. ఈ రోజు మనం కష్టాల కాలాన్ని ముగించాం, దీంతో భారతదేశం మళ్లీ తనను తాను కనుగొంటుంది. ఈ రోజు మన దేశం జరుపుకునే విజయం ఒక అడుగు మాత్రమే, ఎదురుచూసే గొప్ప విజయాల గమ్యంలో ఇది మనకు ఒక అవకాశం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, భవిష్యత్తు సవాళ్ళను స్వీకరించడానికి మనం తగినంత ధైర్యంగా, అవగాహనతో ఉన్నామా?
స్వేచ్ఛ, అధికారంతో బాధ్యత కూడా వస్తుంది. భారతదేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సార్వభౌమాధికార సంస్థ అయిన ఈ అసెంబ్లీపై ఆ బాధ్యత ఉంది. స్వాతంత్య్రం రాకముందే ప్రసవ వేదనలన్నింటినీ భరించాం, ఆ దుఃఖాన్ని తలచుకుంటే గుండె బరువెక్కుతుంది. ఆ కష్టాల్లో కొన్ని ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ గతం ముగిసింది. భవిష్యత్తు మనముందు సిద్ధంగా ఉంది. ఆ భవిష్యత్తు సౌలభ్యం లేదా విశ్రాంతికి సంబంధించినది కాదు, ఎడతెగని కృషితో కూడినది. అలా చేయగలిగినప్పుడు మాత్రమే మనం తరచుగా తీసుకున్న ప్రతిజ్ఞలను, తీసుకోబోయే ప్రతిజ్ఞలను నెరవేర్చగలం. భారత దేశానికి సేవ అంటే, కష్టాలు అనుభవిస్తున్న లక్షలాది మంది ప్రజల సేవ. దీని అర్థం పేదరికం, అజ్ఞానాన్ని రూపుమాపటం. వ్యాధులను, అసమానతలను అంతం చేయడం.
మన తరంలోని గొప్ప వ్యక్తుల ఆశయం భారత ప్రజల కన్నీటిని తుడవడం. ఆ లక్ష్యం మనకు పెద్దదే కావచ్చు, కానీ కన్నీళ్లు, బాధలు ఉన్నంత కాలం మన పని ఆగదు. మన కలలకు వాస్తవికతను అందించడానికి మనం శ్రమించాలి. ఆ కలలు భారతదేశం కోసం మాత్రమే కాదు, ప్రపంచం కోసం కూడా. ఎందుకంటే అన్ని దేశాలు, ప్రజలు ఈ రోజు చాలా దగ్గరగా ముడిపడి ఉన్నారు. వారిలో ఎవరూ విడిగా జీవించలేరు. శాంతి, స్వేచ్ఛ, శ్రేయస్సు ఇవన్నీ విభజించలేనివి. ప్రపంచం శకలాలుగా విభజించబడితే అది ముప్పే అని భావించాలి.
భారతదేశ ప్రజల ప్రతినిధులుగా ఉన్న మాతో, ఈ గొప్ప ప్రయత్నంలో విశ్వాసంతో చేతులు కలపాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టకేలకు నిర్ణీత రోజు రానే వచ్చింది. సుదీర్ఘ నిద్ర, పోరాటం తర్వాత, భారతదేశం మేల్కొని, కీలకమైనదిగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా మళ్లీ నిలబడిన రోజు. గతం తాలూకు జ్ఞాపకాలు ఇప్పటికీ ఏదో ఒక కొలమానంలో మనకు అంటిపెట్టుకుని ఉంటాయి. అయితే మన ప్రతిజ్ఞలను నెరవేర్చడానికి ముందు మనం చాలా చేయాల్సి ఉంటుంది.
ఈ క్షణం భారతదేశంలోని మనకు, మొత్తం ఆసియాకు, ప్రపంచానికి మధుర క్షణం. ఒక కొత్త నక్షత్రం ఉదయించింది. తూర్పున స్వేచ్ఛ, ఒక కొత్త ఆశ ఉనికిలోకి వచ్చింది. దీర్ఘకాలంగా కోరుకుంటున్న స్వేచ్ఛ సాకారమవుతున్న క్షణం. ఈ నక్షత్రం ఎప్పటికీ అస్తమించరాదు, ఆ ఆశలు ఎప్పుడూ వమ్ము కాకూడదు! మేఘాలు మమ్మల్ని చుట్టుముట్టినప్పటికీ, మనలో చాలా మంది ప్రజలు దుఃఖంతో, కష్టమైన సమస్యలు చుట్టుముట్టి బాధలు పడుతున్నప్పటికీ, ఈ స్వాతంత్య్రానికి మేము సంతోషిస్తున్నాం. కానీ స్వేచ్ఛ బాధ్యతలనూ భారాలనూ తెస్తుంది కాబట్టి... మనం వాటిని స్వతంత్రతా భావమున్న, క్రమశిక్షణ గల వ్యక్తుల స్ఫూర్తితో నిర్వర్తించాలి.
ఈ రోజున మన మొదటి ఆలోచనలు ఈ స్వేచ్ఛ యొక్క రూపశిల్పి, మన జాతిపిత వైపు వెళ్తాయి. భారతదేశ గత స్ఫూర్తిని మూర్తీభవిస్తూ, స్వాతంత్య్ర జ్యోతిని పట్టుకుని, మన చుట్టూ ఉన్న చీకటిని వారు పారద్రోలి, వెలుగుని ప్రసరించారు. మనమే కాదు భవిష్యత్ తరాలు కూడా వారి సందేశాన్ని గుర్తుంచుకుంటాయి. ఈ దేశపు గొప్ప పుత్రుని అద్భుతమైన విశ్వాసం, బలం, ధైర్యం, వినయాన్ని తమ హృదయాలలో ముద్ర వేసుకుంటాయి.
ఈ స్వాతంత్య్ర సంబరాలలో ప్రస్తుతం సంతోషంగా పాలుపంచుకోలేని, రాజకీయ హద్దుల వల్ల మనతో దూరంగా ఉన్న మన సోదర సోదరీమణుల గురించి కూడా మనం ఆలోచించాలి. వారు మనవారు, మంచి, చెడులలో మనతోనే ఉండిపోతారు. వారి మంచి చెడులలో మనం ఎప్పటికీ భాగస్వాములమే. భవిష్యత్తు మనల్ని పిలుస్తోంది. మనం ఎక్కడికి వెళ్తాం? మన ప్రయత్నం ఏమిటి? భారతదేశంలోని సామాన్యులకు, రైతులకు, కార్మికులకు స్వేచ్ఛ, అవకాశాలను కల్పించడం, పేదరికం, అజ్ఞానం, వ్యాధులను అంతం చేయడం, సంపన్న, ప్రజాస్వామ్య, ప్రగతిశీల దేశాన్ని నిర్మించడం, ప్రతి పురుషుడు, స్త్రీకి న్యాయం అందించడం. చక్కని జీవితాన్ని కల్పించే సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్థలను సృష్టించడం. మనం మున్ముందు చాలా కష్టపడాల్సి ఉంది. మన ప్రతిజ్ఞ నెరవేరేవరకు, దేశ ప్రజలందరికీ మనం కోరుకున్నట్లు జరిగే వరకు మనలో ఎవరికీ విశ్రాంతి లేదు.
మనం ఈ గొప్ప దేశపు పౌరులం. దేశ పురోగతి కోసం ధైర్యంతో, ఆ ఉన్నత ప్రమాణాలకి అనుగుణంగా జీవించాలి. మనమందరం ఏ మతానికి చెందినవారమైనప్పటికీ, సమాన హక్కులు, అధికారాలు, బాధ్యతలు కలిగిన భారతదేశపు పౌరులం. మనం మతతత్వాన్ని లేదా సంకుచిత మనస్తత్వాన్ని ప్రోత్సహించరాదు. ఎందుకంటే సంకుచిత స్వభావం, ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఉన్న ఏ దేశమూ గొప్పది కాదు. ప్రపంచంలోని వివిధ దేశాలకు, ఆయా దేశాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ప్రపంచంలో శాంతి, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కొనసాగడంలో వారితో సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మనకు ఎంతో ఇష్టమైన, ప్రాచీనమైన, శాశ్వతమైన, నిత్యనూతనమైన మన మాతృభూమికి గౌరవప్రదమైన వందనాలర్పిస్తున్నాం. దేశ సేవకు పునరంకితం అవుతామని తెలియచేస్తున్నాం.