Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఫిరంగీ'' సామ్రాజ్యాన్నే గడగడలాడించారు మన ప్రజలు. బహుశా, భారత్‌తో మొదలైన బీటలు తుదకు వలస వ్యవస్థనే తుత్తునీయలు చేశాయి. చివరికి వారి సూర్యుడు ఇంకోదేశంపై ఉదయించాలంటే భయపడి, ఆ ఒక్క ఇంగ్లండ్‌కే పరిమితమయ్యాడు. భారతదేశ స్వాతంత్య్రోద్యమానికున్న ప్రాధాన్యత అది. ప్రొఫెసర్ ఇందూ అగ్నిహౌత్రి అన్నట్టు అది కేవలం 'విదేశస్తుల'పై పోరాటం కాదు. సామ్రాజ్యవాదంపై పోరాటం. ప్రపంచవ్యాప్తంగా జరిగిన వలస విముక్తి పోరాటాల్లో అంతర్భాగం. ''బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా భారతీయులు చేసిన పోరాటాలు బ్రిటిష్ పాలనంత పాతవి'' అని ఇ.ఎమ్.ఎస్. అన్నదెందుకంటే 1757లో ఈస్టిండియా కంపెనీ కాలూనింది మొదలు టిప్పుసుల్తాన్ వంటి యోధులు, సన్యాసి-ఫకీర్ల రూపంలో రైతులు తిరుగుబాట్లు చేశారు. అవి 1946లో నావికుల తిరుగుబాట్ల వరకు నిరంతరం సాగాయి. బ్రిటిష్‌వారికి కంటిపై కునుకులేకుండా చేసిన పోరాటాలవి.
ప్రొఫెసర్ అకీల్ బిల్‌గ్రామీ చెప్పినట్లు 1947కు ముందు జరిగిన పోరాటాలన్నింటిలో చివరి మూడు దశాబ్దాల్లో జరిగినవి అత్యంత కీలకమైనవి. ఏ ఫ్యూడల్ శక్తులపై బ్రిటిష్ సామ్రాజ్యం నిలబడి ఉండిందో ఆ ఊత కర్రల మొదళ్ళనే ఆనాడు కమ్యూనిస్టులు ధ్వంసం చేశారు. ఈ ముప్పయేండ్లలోనే కేరళలో పున్నప్రవాయిలార్ పోరాటం ట్రావెన్కూర్లో రాచరిక వ్యవస్థని కూల్చింది. బెంగాల్ జోతేదార్ల (భూస్వాములు)కు వ్యతిరేకంగా సాగిన తెభాగా పోరాటం చివరికి పండిన పంటలో ఒక భాగమే కౌలు ఇచ్చేలా చట్టం సాధించుకుంది. అస్సాంలో సుర్మావ్యాలీ రైతాంగం, మహారాష్ట్ర వర్లీలో ఆదివాసీల తిరుగుబాటు, వీటన్నింటికి తలమానికంగా జరిగిన తెలంగాణ సాయుధపోరాటం వెట్టికి వ్యతిరేకంగా ప్రారంభమై నిజాం సర్కార్‌నే కూల్చింది. ఇవన్నీ జాతీయోద్యమంలో కమ్యూనిస్టులు నిర్వహించిన వీరోచిత చారిత్రాత్మక పోరాటాలు. కాంగ్రెస్ నాయకత్వంలో లక్షల్లో ప్రజల్ని రోడ్లపైకి తెచ్చిన పోరాటాలు జరిగింది ఈ మూడు దశాబ్దాల్లోనే. శాసనోల్లంఘన, సహాయ నిరాకరణల్లో ప్రజలు వెల్లువలా పాల్గొన్నారు. సైమన్ గ్యోబ్యాక్ అని భారతావని నినదించింది ఈకాలంలోనే.
భారత కమ్యూనిస్టు పార్టీతో పాటు, ప్రధాన వర్గ సంఘాలైన ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఆలిండియా కిసాన్ సభలు పుట్టింది ఈ ముప్పయ్యేండ్లలోనే. ఖిలాఫత్ ఉద్యమంలో కోట్లాది ముస్లింలు బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాడింది కూడా ఈ కాలంలోనే. కేవలం బ్రిటిష్ పాలన అంతమైతే చాలదు, సాంఘిక, ఆర్థిక, సామాజిక దోపిడీ నుండి దేశం, మన ప్రజలు విముక్తవ్వాలనేది కమ్యూనిస్టుల ఆకాంక్ష. అందుకు వారు కార్మిక, రైతాంగ పోరాటాలేగాక, భారత సమాజంలో వేళ్ళూనుకున్న కుల దోపిడీ అంతానికి కూడా నిరంతరం పోరాడారు.
సరిగ్గా ఈ చివరి మూడు దశాబ్దాల్లోనే ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది. బ్రిటిష్ ప్రయోజనాలకు ఏవిధమైన నష్టమొచ్చే పనిచేయం అని సావర్కర్ మొదలు వాజ్‌పారు వరకు వాంగ్మూలాలిచ్చి జైళ్ల నుండి విడుదలయ్యారు. ''హిందువుల భూమే ఈ హిందూస్థాన్'' అనీ ''హిందువులు కానివారంతా జాతి జీవనంలో నుండి బయటికి పంపివేయబడతార''నీ సిద్ధాంతాలు అల్లి బ్రిటిష్ వ్యతిరేక పోరాటాన్ని నీరుగార్చారు. ''నేను సామ్రాజ్యంతో సహకరించడానికి సిద్ధంగావున్నా''నని ఆనాటి ఆర్ఎస్ఎస్ ప్రముఖుల్లో ఒకరైన ఎస్.పి.ముఖర్జీ నాటి బెంగాల్ గవర్నర్‌కు లేఖరాశాడు. క్రమంగా దేశంలో జనం తిరుగుబాటుకు సిద్దమవుతున్నారని దాన్ని బలంగా అణిచివేయమని క్విట్ ఇండియా పిలుపునకు కొద్దిగా ముందు 1942 జూలై 26న బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖరాశాడు.
మనం గమనించాల్సిన ముఖ్యవిషయమేమంటే ఈ 75ఏండ్లలో మన దేశం ఐక్యంగా ఉండగలగడమే! ప్రపంచంలో మరే ఇతర దేశంలో లేనంత వైవిధ్యం మనదేశంలో ఉంది. 22 అధికార భాషలు, మరో 122 ప్రధాన భాషలతో పాటు 1648 భాషలు మాట్లాడే ప్రజలు ఈగడ్డపై నివసిస్తున్నారు. 6400 కులాలు, ఉపకులాలు ఉన్నాయిక్కడ. ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలకు తోడు ఇక్కడే పుట్టిన బౌద్ధం, జైనం విలసిల్లినాయి. 29 పెద్ద మత సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతాయి మన దేశంలో. ఇంత వైవిధ్యమున్న దేశం చీలి ముక్కలైపోతుందని జోశ్యాలు చెప్పినవారున్నారు. ఏ ముక్కయినా తన నోట్లో పడకపోతుందా అని వేచి చూసిన, చూస్తున్న సామ్రాజ్యవాద గుంటనక్కలకు కొదవేలేదు. అయినా మనదేశం ఐక్యంగా మనగలిగింది. 75ఏండ్లు పూర్తి చేసుకుంటోంది. సామ్రాజ్యవాద కుతంత్రాలకు కుక్కలు చింపిన విస్తరైన ఎన్నో దేశాల ఉదాహరణలు మన కండ్లముందే ఉన్నాయి.
ఆర్ఎస్ఎస్ ప్రాయోజిత మోడీ సర్కార్ పుణ్యమా అని నేడు దేశ ఐక్యతకు, ప్రాదేశిక సమగ్రతకు పెనుముప్పు దాపురించింది. దేశ సమగ్రత రక్షణలో కీలక భూమిక మన రాజ్యాంగానిదే. భారత రాజ్యాంగంపై నిష్ణాతుడు గ్రాన్విల్లే ఆస్టిన్ ''జాతీయ, సామాజిక విప్లవాల కలయిక''గా మన రాజ్యాంగాన్ని వర్ణించారు. నేడు దాని స్థానంలో మనుస్మృతిని దిగుమతి చేయాలనే ప్రయత్నాల్లో మోడీ సర్కార్ ఉంది. రాజ్యాంగమిచ్చిన ఆర్థిక, రాజకీయ, సామాజిక హక్కులకు నేడు ముంచుకొచ్చిన ప్రమాదం నుండి మన ప్రజల్ని కాపాడుకొనడమే కీలక కర్తవ్యం.