Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్దేశిత సమయానికి ముందే పార్లమెంటు సమావేశాలు మరోసారి అర్థంతరంగా ముగిసిపోయాయి. ఎనిమిదేండ్ల మోడీ పాలనలో సమావేశాలకు ఇలా మధ్యలోనే మంగళం పాడటం ఇది ఏడోసారి. మన అత్యున్నత చట్టసభను సైతం ఓ ప్రహసనంగా మార్చిన బీజేపీ ప్రభుత్వ తీరు ఆందోళనకరం. 16 రోజుల పాటు సాగిన సభా కార్యకలాపాల్లో ప్రజా సమస్యలపై సాగిన చర్చలు నామమాత్రమే! సమస్యలపై చర్చలకు ససేమిరా అనడం, పట్టుబట్టిన ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి సభా కార్యక్రమాలను జరుపుకోవడం బీజేపీ మార్కు నిరంకుశత్వానికి నిదర్శనం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రికార్డులను సృష్టించింది. 20మంది ఎంపిలను రాజ్యసభ నుండి సస్పెండ్ చేయడం పార్లమెంటు చరిత్రలో ఇదే తొలిసారి. అంతేకాదు, పార్లమెంటు సమావేశాలను నిర్దేశించిన షెడ్యూల్ కన్నా నాలుగు రోజుల ముందే ముగించిన సంగతీ తెలిసిందే. సమావేశాలను ఇలా అర్థంతరంగా నిరవధిక వాయిదా వేయడం పార్లమెంటు రికార్డుల ప్రకారం ఇది ఏడవసారి! సమస్యలపై చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తుండగా, సభ్యుల కోరికపైనే సమావేశాలను వాయిదా వేస్తున్నామని కేంద్రం ప్రకటించడం తిమ్మిని బమ్మి చేసే ఓ కపట వ్యూహం!
కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత, నిర్దేశించిన సమయంలో 50శాతం కన్నా తక్కువగా లోక్సభ ఐదుసార్లు జరిగింది. ప్రస్తుత సభతో ఆ సంఖ్య ఆరుకు చేరింది. రాజ్యసభ విషయానికి వస్తే ఇంత తక్కువ పనితీరును చూపడం 2014 నుండి ఇది ఏడవసారి! విలువలకు పట్టం కట్టి, రాష్ట్రాల శాసనసభలకు మార్గదర్శకంగా నిలవాల్సిన అత్యున్నత సభల పనితీరు మోడీ అండ్ కో ఆధ్వర్యంలో ఈ స్థాయికి పడిపోవడం విచారకరం! కాగా, దీనినే తమ ఘనతగా చెప్పుకోవడానికి పాలకపార్టీ పెద్దలు బరితెగించడం మరీ విచారకరం!
పార్లమెంటు సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో 13అంశాలపై చర్చ జరగాలని ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఇవిగాకుండా మరికొన్ని అంశాలను కూడా వీలైతే చర్చించాలని విజ్ఞప్తి చేశాయి. అధికధరలు, జీఎస్టీ మోత, నిరుద్యోగం, అగ్నిపథ్ వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. అయితే, సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు నుంచీ మోడీ సర్కారుది ఈ సమస్యలపై చర్చకు అనుమతించడంలో మొండి వైఖరే! ఆందోళనలు, సస్పెన్షన్లు, పార్లమెంటు ఆవరణలో, వెలుపలా ప్రతిపక్షాల నిరసనల తరువాత అధికధరల అంశంపై స్వల్పకాలిక చర్చకు మాత్రమే కేంద్రం అనుమతించింది. ఈ సందర్భంగా కూడా అధిక ధరలతో ప్రజలు బాధ పడుతున్నారన్న అంశాన్ని అంగీకరించడానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్థికశాఖ మంత్రి సిద్ధపడలేదు. దీనినిబట్టి ప్రజల సంక్షేమం పట్ల వారి చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. క్రీడలపై కొంత చర్చ జరిగినా, అదీ అసంపూర్తిగానే మిగిలింది. ఇవికాక మరే అంశాన్నీ చర్చించడానికి, సమస్యల లోతుపాతులు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపలేదు సరికదా అందుకు అవకాశమే ఇవ్వలేదు. కానీ, అదే సమయంలో లోక్సభలో ఏడు బిల్లులను, రాజ్యసభలో ఐదు బిల్లులను మాత్రం ఆమోదింపచేసుకుంది. వాటిపై కూడా చర్చ నామమాత్రమే. కార్పొరేట్లకు దోచిపెట్టి, ప్రజలపై భారాలు వేసే విద్యుత్ బిల్లుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనప్పటికీ ప్రవేశపెట్టింది. దీనిని బట్టే కేంద్ర ప్రభుత్వ శ్రద్ధ దేనిపై ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రతిపక్షమంటే లెక్క లేకుండా వ్యవహరించడం మోడీ ప్రభుత్వానికి కొత్తేమీ కాదు. గతంలోనూ అనేక సందర్భాలలో ఇదే విధంగా వ్యవహరించింది. అయితే, ఈ సారి మరింత బాహాటంగా, కక్షపూరితంగా ప్రతిపక్షం గొంతు నొక్కడానికి సిద్ధపడింది. నిజానికి ఇది పార్లమెంటు గొంతు నొక్కడమే! పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే! అందుకే, జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రతిపక్షాలన్ని కలిసి లేఖ రాయాల్సి వచ్చింది. అయినా, మోడీ సర్కారు వైఖరిలో మార్పు శూన్యం! ఆ తరవాత కూడా పార్లమెంటు జరిగిన తీరే దీనికి నిదర్శనం. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను దేశం జరుపుకుంటున్న వేళ ప్రజాస్వామ్య విలువలకోసం, వాటి పరిరక్షణ కోసం పరితపించాల్సి రావడం దురదృష్టకరం! అయినా, ఇది తప్పనిసరిగా ముందుకు తీసుకు వెళ్ళాల్సిన పోరాటం! ఆ దిశలో లౌకిక, అభ్యుదయ, పురోగామి శక్తులు కదలాలి. ప్రజలను సమీకరించాలి.