Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మనం చిల్లరదొంగలను ఉరితీస్తూ... గజదొంగలనేమో ప్రజాసేవకులుగా ఎంచుకొంటున్నాం'' అన్న ప్రాచీన గ్రీకు కథకుడు ఈసోపు వ్యాఖ్యలు నడుస్తున్న మన దేశ రాజకీయాలను ప్రతిబింబిస్తున్నాయి. దేశంలో అవినీతిని సంపూర్ణంగా రూపుమాపుతామని 2014 ఎర్రకోటలో జాతీయజెండా సాక్షిగా చెప్పిన మాటలనే 2022లోనూ అదే వేదికగా, అదే జెండా సాక్షిగా అక్షరం పొల్లుపోకుండా మన ప్రధాని మోడీ మరోసారి ఉటంగించారు. ఈ సారి ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరో పాతికేండ్లు గడువు ప్రకటించారు అంతే. అవినీతిలో, బంధుప్రీతిలో అస్మదీయులకు ప్రజాసంపద దోచిపెట్టడంలో గత పాలకుల కంటే రెండాకులు ఎక్కువే చదివారు నేటి పాలకులు. ఈ ఎనిమిదేండ్లలో అవినీతిని వ్యవస్థీకృతం చేయడంలో మరింత పెంచి పోషించింది తప్ప.. దానిని అరికట్టడానికి తీసుకున్న చర్యలు శూన్యం. కార్పొరేట్లకు దోచిపెట్టడానికి వల్లమాలిన ప్రేమ ఒలకబోసే ఈ నేతలే అవినీతి గురించి గురివింద మాదిరి నైతిక విలువలను వల్లిస్తున్నారు.
పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్యలు పేదల్ని ఉద్ధరించే కార్యక్రమంగానే ప్రచారం చేసుకున్న మోడీ.. దాని ద్వారా వల్ల సమకూరే సొమ్మును పేదల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి ఏండ్లు గడిచినా అతీగతి లేదు. విదేశాల్లో దాచిన నల్లడబ్బును100రోజుల్లో వెనక్కు తెచ్చి పేదల ఖాతాల్లో రూ.15లక్షలు చొప్పున జమ చేస్తానన్న ఎన్నికల వాగ్దానాన్ని చివరకు ఎన్నికల తమాషాగా తేల్చివేశారు. మరి ప్రధాని పేదల కోసమే పడే ఆరాటం, పోరాటం ఏమైపోయాయి? అని అడిగితే నేరం. పనామా పత్రాలు, బహమస్ లీకులు వెల్లడించిన భారత నల్లకుబేరులపై కనీస చర్యలు కూడా తీసుకోలేదు. అంతెందుకు, అవినీతిని అంతం చేస్తానంటున్న మోడీ, దేశంలో పెచ్చరిల్లిన అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజాందోళన తదుపరి లోక్పాల్ బిల్లును పార్లమెంట్ ఆమోదించి ఏండ్లు గడిచినా ఇంతవరకు ఎందుకు నియమించలేదు!
నిజంగా నేరస్థులో కాదో తెలియకుండానే దేశవ్యాప్తంగా లక్షలాది విచారణ ఖైదీలు కారాగారాల్లో మగ్గిపోతున్నారు. అవినీతిని ఆరోప్రాణంగా భావించే పెద్దమనుషులేమో నాయకులై... చట్టానికి చుట్టాలై రాజకీయ చక్రం తిప్పుతున్నారు. నీకిది, నాకది పద్ధతిలో పంచుకుంటూ, తమ చేతులకు మట్టి అంటకుండా, మూడో కంటికి తెలియకుండా డబ్బును భారీయెత్తున దేశం దాటించే విజరు మాల్యా, నీరవ్మోడీలాంటి బడాబాబులు ఎందరు లేరు? అవినీతి జగత్తుకు మకుటంలేని మహారాజులైనప్పటికీ నేతలవతారాలెత్తి నిరాటంకంగా నిక్షేపంగా రాజ్యం చేస్తున్న వారి అపూర్వ అక్రమగాథలెన్ని పోగుపడలేదు! అప్పటిదాకా అవినీతి పరులైన వారందరూ కాషాయ తీర్థం పుచ్చుకోగానే అగ్నిపునీతులైపోతున్నారు.
దేశంలో బయటపడుతున్న అక్రమ బాగోతాల్లో వీరి శిబిరానిదే అగ్రతాంబూలం. కమిషన్ల కోసం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తమను పీక్కుతింటు న్నారని ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయానికే కాంట్రాక్టర్లు లేఖ రాశారు. ఆ లేఖపై ఏ చర్యలకు ఉపక్రమించని మోడీ సాబ్.. అవినీతిని రూపుమాపుతా మంటూ జబ్బలు చరవడం హాస్వాస్పదం కాక మరేమిటి? ''గత ఎనిమిదేండ్లలో తమ విధానాల ద్వారా 2లక్షల కోట్లు అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడగలిగాం'' అని వజ్రోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా ప్రకటించిన మోడీ గారు.. కార్పొరేట్ పన్ను 35 నుంచి 22శాతానికి తగ్గించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు జరిగిన 6.5లక్షల కోట్లు నష్టం గురించి కానీ, బడానేతలు బ్యాంకులకు ఎగొట్టిన 11.5 లక్షల కోట్లు సంగతి దాచారా? మరిచారా?
రాజకీయ అవినీతి తిమింగిలాల జాబితాలో ఇప్పుడున్న నేతలు పేర్లు మొదటివి కావు... ఆఖరివి అంతకంటే కాబోవు! అక్రమాస్తులను పోగేసే నాయకుల దుశ్చేష్టలు దేశీయంగా ప్రజాస్వామ్యాన్ని కుళ్లగించి, మాఫియా పాలనకు అంటుకడ తాయని సర్వోన్నత న్యాయస్థానం లోగడే స్పష్టం చేసింది. అయినాసరే, దేశాన్ని గుల్లచేసే నాయక బకాసురుల మేత ఆగడం లేదు. మాజీ ప్రజాప్రతినిధులపై నమోదైన సీబీఐ, ఈడీ కేసుల్లో విచారణ వేగం పుంజుకోవడం లేదు. సుప్రీంకోర్టు చీవాట్లు పెడుతున్నా, కేంద్ర సర్కార్ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేసే దర్యాప్తు సంస్థలు తమ తీరును మార్చుకోవడం లేదు. అందుకే ఎంత మేసినా తమకేమీ కాదన్న నేతాశ్రీల ధీమా.
ఇటీవల మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చి కమలనాథుల సహకారంతో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో సగానికి సగం అవినీతిపరులే అన్నది వాస్తవం కాదా? వ్యక్తుల పూర్వాపరాలతో నిమిత్తం లేకుండా, తాము గెలుపుగుర్రాలుగా భావించిన వారికే నాయకులుగా పార్టీలు వీరతిలకం దిద్దుతున్నాయి. అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అక్కరకు రావాల్సిన జాతి వనరులను ఈ ధూర్త రాజకీయాలే దిగమింగుతున్నాయి. రాజ్యాంగపు ఫెడరల్ స్వభావాన్ని అటకెక్కించి రాష్ట్రాల హక్కులను హరించి అధికార కేంద్రీకరణకు పూనుకున్న మోడీ.. చెప్పేవన్ని 'జుమ్లా'లే అన్నది వాస్తవం.