Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగం జనాన్ని ఆదుకోవాల్సిన రీతిలో ఆదుకోవటం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ అన్నింటిలోనూ వైద్యులు, సిబ్బంది, మందులు, మౌలిక వసతుల కొరతే. మొన్నా మధ్య హైదరాబాద్లోని సీఎం క్యాంపు కార్యాలయానికి (మెట్రోరైల్ భవన్, బేగంపేట) వెళ్లిన విలేకర్లు అక్కడ వేల సంఖ్యలో గుట్టగుట్టలుగా పడి ఉన్న సీఎమ్ఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) దరఖాస్తులు చూసి నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ నియోజకవర్గాల్లోని రోగుల సీఎమ్ఆర్ఎఫ్ దరఖాస్తులను నింపటానికి, వాటిని హైదరాబాద్లో అందజేయటానికి ఏకంగా ముగ్గురు, నలుగురు సిబ్బందినే నియమించు కున్నారట. ఆ సిబ్బంది ఏడాదంతా ఈ దరఖాస్తుల పనులను చూసుకోవటానికే సమయం వెచ్చిస్తున్నారంటే వాటి ప్రాముఖ్యత ఏంటో మనకు విదితమవుతున్నది. వాస్తవానికి ఒక వ్యక్తికి ఏదైనా వ్యాధి లేదా రోగం సంక్రమించినప్పుడు ఆస్పత్రికి వెళ్లటం పరిపాటి. కొద్దో గొప్పో డబ్బున్న వాడైతే ప్రయివేటు, మరీ సంపన్న వంతులైతే కార్పొరేట్ దవాఖానా లకు వెళుతుంటారు. ఇక ఏ దిక్కూ మొక్కూ లేని బీదాబిక్కీ అయితే సర్కారు దవాఖానా మెట్లెక్కాల్సిందే. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతితోపాటు పేదలు సైతం ఇప్పుడు ఈ రెండు పద్ధతులను కాకుండా సీఎమ్ఆర్ఎఫ్పైన్నే ఎక్కువగా ఆధారపడుతుండటం గమనార్హం. కారణం... ప్రభుత్వ దవాఖానాల్లో రోగుల సంఖ్యకు సరిపడా వైద్యులు, సిబ్బంది, మౌలిక వసతులు లేకపోవటం, ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఫీజులు చుక్కలు చూపిస్తుండటమే. దీంతో రోగులు ముందు తమ దగ్గరున్నది తెగనమ్మటమో.. లేదంటే అప్పోసప్పోజేసి... ఆ తర్వాత సీఎమ్ఆర్ఎఫ్కు అప్లికేషన్ పెట్టుకోవటమో చేస్తున్నారన్న మాట. తద్వారా వచ్చిన ఎంతో కొంత మొత్తానికి ఇంకొంత జమచేసి... బాకీలు తీర్చటమే అతడి ముందుంటున్న ఏకైక సవాల్. ఈ క్రమంంలో గుట్టలు గుట్టలుగా పడి ఉన్న సీఎమ్ఆర్ఎఫ్ దరఖాస్తులు మన వైద్యరంగ దుస్థితికి ప్రబల, ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
వైద్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశాం... దాన్ని బలోపేతం చేశామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు ఇక్కడ తేలిపోతున్నాయి. 'నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు...' అంటూ ఓ సినిమాలోని పాటను మంత్రులు పదే పదే ప్రస్తావిస్తూ, ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదంటూ ఢంకా బజాయిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఉస్మానియా, గాంధీ, నిమ్స్ దాకా అన్ని ఆస్పత్రులనూ ఆధునీకరించామనీ, వాటిలో మౌలిక వసతులను మెరుగుపరిచామని వారు పదేపదే చెబుతూ వస్తున్నారు. ఇక్కడ గమ్మత్తేమంటే సర్కారు వారు ఆర్భాటంగా ప్రకటిస్తున్నట్టు అనేక జిల్లాల్లో నూతన ఆస్పత్రులు నిర్మితమవుతున్నాయి. ప్రారంభోత్సవాలూ జరిగిపో తున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం స్వాతంత్య్రదినోత్సవం రోజున గోల్కొండ కోట నుంచి చేసిన ప్రసంగంలో వైద్యారోగ్య రంగం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజారోగ్యంలో తెలంగాణ అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిందని ప్రకటించారు. డయాగస్టిక్స్ సెంటర్లు, ఆక్సిజన్ బెడ్లు, ప్రభుత్వా సుపత్రుల్లో ప్రసవాల రేటు గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైదరాబాద్ నలు చెరగులా టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) తరహాలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామంటూ హామీనిచ్చారు. ఇవన్నీ ఆయన గతంలో ఉద్ఘాటించినవే.
గమ్మత్తేమిటంటే... ప్రభుత్వ ఆస్పత్రులు, వాటిలో మౌలిక వసతులు ఇంత బాగా ఉంటే... ఇప్పుడు వైరల్ ఫీవర్లతో బాధపడుతున్న జనాలకు సర్కారు దవాఖానాల్లో పడకలెందుకు దొరకట్లేదో అర్థం కాని స్థితి. వాటిలో సరిపోయినంత సిబ్బంది, వైద్యులు ఉంటే మలేరియా, టైఫాయిడ్, ఇతర జ్వరాలు సోకిన వారు ప్రయివేటు వైపునకు ఎందుకు పరుగులు పెడుతున్నారో తెలియని పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రమంతా వైరల్ జ్వరాలతో వణికిపోతున్నది. ఏ ఇంట్లో చూసినా దగ్గు, జలుబు, జ్వరాలే. ఈ క్రమంలో సర్కారు దవాఖానాకు వెళితే గంటల తరబడి క్యూ లైన్లు. దానికితోడు మందుల కొరత వెక్కిరిస్తున్నది. ఒకవేళ ఉన్నా అరాకొరాగా ఇచ్చి పంపుతున్న వైనం. సాక్షాత్తూ జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేటాయించిన వెల్నెస్ సెంటర్లలోనూ అన్ని మందులూ దొరకటం లేదంటే అతిశయోక్తి కాదు. మరోవైపు కరోనాతో కోట్లు కోట్లు పోగేసుకున్న కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రుల ధనదాహం ఇంకా తీరలేదు. కోవిడ్ కంటే ముందు రోజులతో పోలిస్తే ఇప్పుడు ఆయా దవాఖానాల్లో ఓపీ ఛార్జీలను విపరీతంగా పెంచారు. గతంలో చిన్న చిన్న క్లినిక్కుల్లో రూ.200 నుంచి రూ.300 వరకు ఉన్న ఓపీ ఫీజు ఇప్పుడు ఏకంగా రూ.500, రూ.600 వరకూ పెరిగింది. ప్రయివేటు, కార్పొరేట్లో గతంలో రూ.500గా ఉన్న కన్సల్టేషన్ ఫీజు ప్రస్తుతం ఏకంగా రూ.వెయ్యి వరకూ ఎగబాకింది. వీటిని భరించలేని రోగులు మందుల షాపుకెళ్లి ఏదో ఒక గోలి తెచ్చేసుకుని సర్దుకుపోతున్నారంటూ పలువురు వైద్యులు చెప్పటం గమనార్హం. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలోని ఇలాంటి అంశాలన్నింటిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. తద్వారా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, ఉచిత వైద్యాన్ని అందించేందుకు కృషి చేయాలి.