Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానున్న రోజుల్లో అమెరికా ఫెడరల్ రిజర్వు(మన ఆర్బీఐ వంటిది) వడ్డీ రేట్లను పెంచటం ఖాయమే గానీ వేగాన్ని తగ్గిస్తామని తాజాగా స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరికి వడ్డీ రేటు 3.5 నుంచి 3.75శాతానికి చేరవచ్చని అంచనా. ఇది మన వంటి వర్ధమాన దేశాలకే కాదు, ప్రపంచాన్ని డాలరు బంధంతో ముడివేసినందున అది తెగిపోయె వరకు అన్ని దేశాలకూ ఈ తిప్పలు తప్పవు. ప్రపంచమంతటా(చైనా తప్ప) అన్ని దేశాలనూ ద్రవ్యోల్బణ భూతం మింగివేస్తుందా అన్న భీతి కలుగుతోంది. గతంలో తన ఇబ్బందులను అధిగమించేందుకు అమెరికా రికార్డు స్థాయిలో వడ్డీరేట్లను పెంచి లాటిన్ అమెరికాతో సహా అనేక దేశాలను నాశనం చేసింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలంటే వడ్డీ రేట్లు పెంచటం పెట్టుబడిదారీ విధానంలో దగ్గరి దారి. 1979 ఆగస్టు ఆరున పాల్ ఓకర్ అనే పెద్దమనిషి అమెరికా ఫెడరల్ రిజర్వుబోర్డు అధిపతిగా బాధ్యతలు స్వీకరించాడు. తొలుత చిన్నా చితకా పెంపులు చేశాడు. కానీ ఆక్టోబరులో అమాంతం వడ్డీ రేటును 13.7శాతానికి పెంచి మరుసటి ఏడాది ఏప్రిల్కు 17.6కు 1981 నాటికి దాదాపు ఇరవై శాతానికి చేర్చాడు. దీన్నే ఓకర్ షాక్ అని పిలిచారు. దీంతో అమెరికా ద్రవ్యోల్బణం అనే జబ్బు నుంచి తేరుకొని మాంద్యం అనే మరో పెద్ద జబ్బును అంటించుకుంది. దీని వలన తొలుత ఇబ్బంది పడినా తరువాత అమెరికా సమస్యలనుంచి బయటపడిందిగానీ ప్రపంచమంతటినీ అతలాకుతలం గావించింది. అనేక దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోవటం, నిరుద్యోగం, దారిద్య్రం పెరుగుదలకు కారణమైంది. రాచ పీనుగ ఒంటరిగా పోదన్న లోకోక్తి తెలిసిందే. ఇప్పుడు రంగు నీళ్లు, గోలీలతో జబ్బు తగ్గకపోతే ఓకర్ షాక్ ఇచ్చినా ఇవ్వవచ్చనే హెచ్చరికలు కూడా వెలువడుతున్నాయి. ప్రపంచం ఏమైనా అమెరికాకు పట్టదు, తన సంగతి తాను చూసుకుంటుంది.
మన దేశంలో కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయటంలో మోడీ సర్కార్ విఫలమైంది. అమెరికా వడ్డీ రేట్లు పెంచటంతో మన ద్రవ్య, స్టాక్ మార్కెట్లో ఉన్న డాలర్ పెట్టుబడులు అమెరికాకు తరలిపోతుండటంతో మన విదేశీమారక ద్రవ్య నిల్వలు హరించుకుపోతున్నాయి. మనం కూడా ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు వడ్డీ రేట్లను పెంచక తప్పటం లేదు. ప్రస్తుతం ఆర్బీఐ 5.4శాతానికి పెంచింది. ఇంకా పెరగవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ఈ జబ్బు తగ్గినా కొత్త జబ్బులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనాకు ముందు వడ్డీ రేట్లు తక్కువ ఉన్నప్పుడే మన ఆర్థిక పురోభివృద్ధి ఎనిమిది నుంచి నాలుగు శాతానికి తగ్గింది. పెరిగిన రేట్లతో కొత్త పెట్టుబడులు పెట్టేందుకుగానీ,, ఉన్నవాటిని నడిపించేందుకు గానీ ఎందరు ముందుకు వస్తారు? ప్రపంచ ఆర్థిక రంగం 2021లో 6.1శాతం వృద్ధి చెందితే 2022లో 3.2శాతానికి దిగజారవచ్చని ఐఎంఎఫ్ చెబుతోంది. దీనికి వడ్డీ రేట్ల పెరుగుదల మరింత ముప్పు తేనుంది. ప్రపంచం మీద అమెరికా, నాటో దేశాలు రుద్దిన ఉక్రెయిన్ సంక్షోభం ఇప్పటికే అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తోంది. విదేశీమారక ద్రవ్యనిల్వలు పడిపోతే ప్రతి దేశమూ శ్రీలంక మాదిరే మారుతుంది. కరోనా కారణంగా 2019-21 మధ్య వర్థమాన దేశాల సగటు రుణభారం జీడీపీలో 54 నుంచి 65శాతానికి పెరిగింది. మన దేశంలోనైతే 90శాతం దాటింది. ముఫ్పౖుె ఎనిమిది దేశాలు అప్పుల సంక్షోభంలో పడటం లేదా దాని ముంగిట ఉన్నట్లు చెబుతున్నారు.
కొందరికి తిండిలేక జబ్బులు వస్తే మరి కొందరికి తిన్నది అరగక జబ్బులు అన్నట్లుగా ద్రవ్యోల్బణం కూడా అలాంటిదే. ఒక్కో దేశంలో ఒక్కోకారణంతో వస్తోంది. అందువలన సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ అన్నట్లుగా ఒకే పరిష్కారం అన్నింటికీ కుదరదు. ఆత్మనిర్భర్ అనో మరోపేరో ఏది చెప్పినా మన కార్పొరేట్లకు ఇచ్చిన పన్ను రాయితీలు పోగా, మిగిలిన సొమ్మును పాత అప్పులు తీర్చేందుకు, కంపెనీల రిజర్వు నిధులను పెంచుకొనేందుకు, డివిడెండ్లు చెల్లించేందుకు వినియోగిస్తున్నారు తప్ప తిరిగి పెట్టుబడులు పెట్టి జనానికి ఉపాధి తద్వారా, ఆదాయాల పెంపుదలకు తోడ్పడటం లేదు. అమెరికాలో జనానికి నేరుగా నగదు అందించే ఉద్దీపన పథకాలు అక్కడ ద్రవ్యోల్బణానికి దారితీసిన కారణాల్లో ఒకటి. మన దగ్గర అలాంటివేమీ లేకుండానే నగదు చెలామణి-నోట్ల ముద్రణ కారణంగా ప్రభుత్వ విధానమే తాజా పరిస్థితికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అందువలన రోగానికి తగిన మందు మాదిరి విధానాలు ఉండాలి. ప్రభుత్వం ఒంటెద్దు పోకడగాక ప్రత్యా మ్నాయ విధానాలను ఆలోచించాలి, వాటిని చెబుతున్నవారి మాటలను వినాలి.