Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ... ఈ దేశపు వర్తమానం మున్నెన్నెడూ లేనంత వికృతంగా రూపుదాల్చడం దేశభక్తులైన పౌరులకు వేదన కలిగించే విషయం. పార్లమెంటూ గవర్నమెంటూ అన్నీ భద్రమే... పౌరహక్కులూ, ప్రజల భద్రతే దిక్కులేనివై బక్కచిక్కుతున్నాయి. న్యాయస్థానాలూ సమస్త వ్యవస్థలూ క్షేమమే... న్యాయమే నడివీధిలో అనాధగా రోదిస్తున్నది. అత్యంత పాశవికంగా గ్యాంగ్‌రేప్‌కు గురైన బిల్కిస్ బానో కేసులో దోషులందరినీ విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. ఈ ఉదంతం తర్వాత ఎవరికైనా కలిగే అభిప్రాయం ఇదే. ఢిల్లీలో ప్రధాని ఎర్రకోట సాక్షిగా అతివలపట్ల ''అపారమైన'' వాత్సల్యాన్నీ, ''అంతులేని'' మమకారాన్నీ కురిపిస్తున్న తరుణంలోనే... గుజరాత్లో సర్కారువారి సౌజన్యంతో దేశాన్ని వెటకారం చేస్తూ వెలుగుచూసిందీ ఘటన. పైగా తల్లీ పిల్లలన్న తేడాలేకుండా మహిళల మీద అత్యాచారాలకు తెగబడి, సాటి మనుషులు పద్నాలుగు మందిని పొట్టనబెట్టుకున్న ఈ ముష్కరులు ''సంస్కారవంతులు'' అంటూ ఏలినవారి కితాబులు..! వారేదో దేశభక్తులైనట్టు సన్మానాలూ సత్కారాలూ...! ఇప్పుడు ఈ వికృతాలే కదా వర్తమాన భారత ముఖ చిత్రాలు..! ఈ విపరీతాలన్నీ చూస్తుంటే, కత్తులకు దండలేసి కరుణరసాన్ని వొలికించడమంటే ఎంటో ఎరుకలోకొస్తున్నట్టు లేదూ...!?
ఈ కేసు పూర్వాపరాల కోసం ఇరవయ్యేండ్ల వెనక్కి వెళ్ళితే... నేటి భారత ప్రధానే నాటి గుజరాత్ ముఖ్యమంత్రిగావున్న కాలమది. గోద్రా ఘటన తరువాత రాష్ట్రంలో చెలరేగిన మతకలహాల్లో, ఉన్మాదుల నరమేథానికి భయపడి, ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణికిపోతున్న సమయమది. ఇలాంటి కల్లోల కాలంలో, బిల్కిస్ బానో తన కుటుంబంతో సహా పదిహేడుమంది గ్రామస్తులతో కలిసి, ఒక ట్రక్కులో ఊరొదిలి పోతుండగా జరిగిందీ దారుణం. మూడు జీపుల్లో ఆ ట్రక్కును వెంటాడి, వేటాడి చెరపట్టిన ఉన్మాదులు అత్యంత కిరాతకానికి పాల్పడ్డారు. బిల్కిస్ బానో మూడేండ్ల పాపను నేలకేసి కొట్టగా, ఆ పసిగుడ్డు నెత్తురు ముద్దయి అసువులు బాసింది. ఆపైన అయిదునెలల గర్భిణీ అనికూడా చూడకుండా ఆ రక్కసిమూకలు సాగించిన సామూహిక అత్యాచారానికి బలైంది బిల్కిస్ బానో. పిదప ఆమె సోదరి, కోడలిపై కూడా సాగిందా రాక్షస క్రీడ. ఆ ట్రక్కులో ప్రయాణిస్తున్న పద్నాలుగు మందినీ ఆడా మగ అన్న విచక్షణ లేకుండా నరికి చంపారు. అందరితోపాటే బిల్కిస్ కూడా చనిపోయిందని భావించి వెళ్లిపోయారు.
అయితే అనూహ్యంగా ఆమె బతికింది. నేరస్థులంతా తన గ్రామస్థులే కావడంతో గుర్తుపట్టింది. ఆపైన న్యాయం కోసం పోరాడింది. పోలీసులు, పోస్టుమార్టమ్ చేసిన డాక్టర్లు, ఫొరెన్సిక్ నిపుణులతో సహా ప్రాసిక్యూషన్ కూడా నిందుతులకే వంతపాడగా, విచారించిన కోర్టు, కేసును మూసివేసింది. దీనివెనుక ప్రభుత్వ పాత్రను పసిగట్టిన ఆమె జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు మొరపెట్టుకుంది. సుప్రీంకోర్టునూ ఆశ్రయించింది. ఫలితంగా 2004లో కేసు తిరిగి సీబీఐకి రిఫర్ చేయబడింది. ఆ తరువాత అనేక మలుపులు తిరిగి, గుజరాత్ ప్రభుత్వం నుండి ఎదురవుతున్న ప్రతికూలతల మూలంగా ముంబై హైకోర్టుకు బదలాయించబడింది. చివరికి 2008లో ప్రత్యేక న్యాయస్థానం నేరనిర్ధారణచేసి నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
కానీ, న్యాయం గెలిచిందనుకునే లోపే కాలచక్రం గిర్రున తిరిగింది. నాటి గుజరాత్ ముఖ్యమంత్రే నేడు దేశానికి ప్రధానమంత్రయ్యాడు. బాధితుల పక్షాన పోరాడిన తీస్తా సెతల్వాద్, శ్రీకుమార్ వంటి వారంతా జైలుపాలైతే, ఇప్పుడీ నరహంతకులేమో ''సత్ప్రవర్తన'' ముసుగులో జైలు నుండి విడుదలయ్యారు. తిరిగి న్యాయం బిల్కిస్ బానో రూపంలో బిక్కుబిక్కుమంటూ నేడు దిక్కులు చూస్తోంది!
ఒకవైపు ''నారీశక్తి'' గురించి అనర్గళ ప్రసంగాలు చేస్తూనే, మరోవైపు ఈ నీతిమాలిన చర్యలకు దిగజారడం వీరి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. జాతీయ పతాకనెగరేసి, ప్రధాని జాతినుద్దేశించి చేసిన ప్రసంగాన్ని దేశమంతా విన్నది. ఈ సందర్భంగా ''మహిళలు అవమానించబడినప్పుడు నాలో కలిగే అంతులేని బాధను, నా తోటి పౌరులైన మీతో గాక ఎవరితో పంచుకోగలను'' అని ''అంతులేని వేదన''ను వ్యక్తపరిచారాయన! ఇప్పుడు అదే పౌరురాలిగా బిల్కిస్ బానో ప్రశ్నిస్తోంది... ''నా జీవితాన్ని నాశనం చేసిన నరహంతకులను విడుదల చేశారు. మరి భయంలేని నా మునుపటి ప్రశాంతమైన జీవితాన్ని నాకు తిరిగి ఇవ్వగలరా?'' అని. సమాధానం చెప్పగలరా? ''బాధితుల పక్షాన నిలబడినవారిని జైలుకు పంపి, రేపిస్టులనేమో విడుదల చేస్తారా? అసలు మీ ఈ చర్యకు చట్టబద్దత ఉందా?'' అని పౌరసమాజమూ మండిపడుతోంది. ప్రభుత్వాలు బదులిస్తాయా? 1992 నాటి రిమిషన్ (శిక్షా కాలం తగ్గింపు) విధానం ఆధారంగా విడుదల చేశామని చెప్పుకుంటున్న గుజరాత్ ప్రభుత్వం, 2014లో తానే స్వయంగా లైంగిక దాడులూ, హత్య కేసుల్లోని దోషులకు ఈ రిమిషన్లు వర్తించవని చేసిన సవరణ సంగతి మరిచిపోయిందా? ఏ విలువలనూ ఖాతరు చేయనివారు, ఏ వ్యవస్థలనూ గౌర వించనివారు ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానమిస్తారని ఎలా ఆశించగలం...?