Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిచ్చి ముదిరింది వైద్యం చేయించండిరా బాబూ! అని ఈ రోజు బీజేపీ నాయకుని గురించి వారి సహచర సమూహానికి చెప్పాల్సివస్తోంది. ఎందుకంటే, ఇది మామూలు పిచ్చికాదు. తెలంగాణలోని సాధారణ భక్తజన బృందం యొక్క ఆధ్యాత్మిక హక్కును, స్వేచ్ఛను హరించివేసే ప్రేలాపనలు పేలుతున్నారు, కావున. ఇదెక్కడి ఉన్మాదం! ఆధ్యాత్మిక అంశాలన్నీ రిజిస్టరు చేసుకున్న పార్టీ పేటెంట్లా! భగవద్గీతను శవయాత్రలో వినిపిస్తే వైకుంఠ రథంపై దాడిచేసి టైర్లను కోసేస్తామని మొన్న బీజేపీ నాయకుడు సంజయుడు హెచ్చరికలు జారీ చేశారు. భగవద్గీతను వినటం అనేది మనిషి చనిపోయిన సందర్భంలో సాధారణంగా జరుగుతుంది. అది ఇప్పటికిప్పుడు వచ్చినదికాదు. ఇప్పుడు వైకుంఠధామాలు ఏర్పడ్డాక, చివరియాత్రకు వాహనాలు ఏర్పాటు చేశాక వాటిని వైకుంఠ రథాలనన తర్వాత గీత అందులోనూ కొనసాగుతోంది. ఇది హిందువులు మాత్రమే ఆచరిస్తున్న ఒక అంశం. అది వాళ్ల ఇష్టం. కొందరు ఏ గీతాలూ వినరు. కొందరు డప్పుకొట్టి ఊరేగిస్తూ చివరి యాత్రను ముగిస్తారు. ఘంటసాల చాలా హృద్యంగా గానం చేసిన గీతాశ్లోకాలు మరణావరణంలో దుఃఖితులను ఓదారుస్తున్నట్లు కొనసాగుతాయి. దీన్ని అడ్డుకోవటానికి ఆయనెవరు? భగవద్గీత వాళ్ల సొంతమా? వీరికేం హక్కుంది?
ఒక దుఃఖపూరిత సన్నివేశాన్ని కూడా మతతత్వంగా మార్చి రాజకీయ పేలాలు ఏరుకో చూడటం అత్యంత దారుణం. అంతిమయాత్ర వాహనంపై దాడిచేస్తామన్న ఆలోచన ద్వేషపూరితమైన దుర్నీతికి నిదర్శనం. మానవత్వం కన్నా మత రాజకీయం ముఖ్యమైన చోట, ఇంతకన్నా దిగజారుడు ఇంకేముంటుంది? ఇక్కడే కాదు, ప్రపంచమంతా మరణ సందర్భాన సంప్రదాయక మత గ్రంథాల ప్రవచనాలు, భక్తిగీతాలు అనూచానంగా సాగుతాయనే విషయ జ్ఞానంలేని నాయకుల గొంతుల్లోంచి ఇంకేమి వినగలం మనం! మనుషులు చచ్చిపోయాక కూడా వెంటాడుతున్న మతోన్మాద దుశ్చర్యలివి. పాపం ఘంటసాల బతికుంటే ఎంత బాధపడేవాడో! తన గొంతును కావాలనుకునే వాళ్లనే చూసి, మరణించి బతికిపోయాడు.
మరణించిన సందర్భంలో కానీ, అంతి మయాత్రలో కానీ భగవద్గీతను ఎందుకువింటారో వీళ్లకు తెలుసా? పవిత్రమైన, ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలమైన భగవద్గీతను అవమానిస్తే ఊరుకోమని ఉరిమిన సంజయునికి మరణం కూడా పవిత్రమైదేనని తెలవకపోవటమే విచారించదగ్గ విషయం. పుట్టుక ఎంత పవిత్రమో, పూజ ఎంత పవిత్రమో, మరణమూ అంతే పవిత్రం. గీతాకారుడన్నట్లు ''జాతస్యహి ధ్రువోమృత్యుః ధ్రువం జన్మ మృతస్యచ| తస్మాద పరిహార్యెర్థేన త్వం శోచితుమర్హసి!!'' అంటే పుట్టిన వానికి మరణం తప్పదు. మరణించిన వానికి పుట్టుక తప్పదు, తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో, నువ్వు దుఃఖించడం తగదని, కురుక్షేత్ర యుద్ధంలో తన వారు మరణించిన దానికి రోధిస్తున్న అర్జునునికి కృష్ణుడు బోధించిన ప్రవచనమిది. ఇందులో మరణించిన వాడు పుట్టక తప్పదన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నా ఇది దుఃఖపడుతున్న బంధువులకు ఒక ఓదార్పును, సాంత్వనను కలిగించే విషయం. ఘంటసాల గొంతు మరింత ఓదార్పు. మరణించిన సందర్భాన్ని అపవిత్రమని, హీనమని, నీచమని, మలినమనీ భావించడం, మరణాన్ని కించపరడం అశేష జన సామాన్యాన్ని అవమానించడమే అవుతుంది.
భగవద్గీతను హిందువులు పవిత్రమైన గ్రంథంగానే చూస్తారు. కానీ వేదాలు, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ సాహిబ్ మొదలైన వాటివలె దీన్ని దైవశాసనంగా, శృతులుగా ఏమీ పరిగణించరు. ఇందులో ఆధ్యాత్మిక, తాత్విక విషయాలతో పాటు ధర్మము, నీతి, రాజనీతికి సంబంధించిన అనేక విషయాలు చర్చించబడినవి. అనేక విషయాలను చేర్చుకుని బహుళత్వ స్వభావం, వైరుధ్యాలు గీతకు ఉన్నందువల్లనే దీన్ని విభిన్న పద్ధతులలో వ్యాఖ్యానించటం సాధ్యమైంది. ఇక ఈ గీతలోనే సామాజిక పరమైన వర్ణవిభజన కూడా వివరించబడింది. చాతుర్వర్ణంమయాస్పష్టం అనే ప్రవచనమూ ఉంది. ఇది కులవ్యవస్థకు తాత్విక పునాది. దీన్నే సదరు నాయకమన్యులు ఆచరించాలని, అనుసరించాలని తలుచుకుంటున్నారు. అది వేరేవిషయం. కానీ భిన్నమైన విషయాలు, ఆనాటి సామాజికాంశాలు తాత్వికతలు గల భగవద్గీత గ్రంథంపై ఎవరికీ ఏ పేటెంట్ హక్కులు లేవు. ఏదో ఒక అంశాన్ని ముందుకు తెచ్చి వైషమ్యాలను సృష్టించి, రాజకీయ ప్రయోజనానికి వాడుకోవాలని చూడటం నీచమైనపని. ప్రజలు దీన్ని సహించరు.