Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాపం! ఆనాడు అంజయ్యనెందుకు బద్నామ్ చేశారు? అప్పటికి నెత్తిన కిరీటం ఒక్కటి మాత్రమేలేని మహారాజు 'సంజయు'డేగా ఆ గాంధీ?! ఆయనకి చెప్పులందించాడనే కదా టంగుటూరి అంజయ్యని అంత నవ్వులపాలు చేసిందీ. ఆనాడు అంజయ్యపై అన్ని జోకులేసి ఆడిపోసుకున్న మీడియా నేడీ సంజయుడి గురించి చూపదా? చెప్పదా? ఆనాడు భరతుడు చిత్రకూటం నుండి శ్రీరాముడి పాదుకలు నెత్తిన పెట్టుకుని మోసినంతసేపు మోసి ఉండకపోవచ్చు. ఇప్పుడు సింహాసనాల్లేవు కాబట్టి, పైగా ఈ పెద్ద మనిషి 'రాజు' కూడా కాదు కాబట్టి, అక్కడ పెట్టి పాలన చేయాల్సిన అవసరం కూడా లేకపోయుండచ్చు. నాడు అంజయ్యగారు ప్రదర్శించింది ప్రభుభక్తే అయితే నేటి 'బండి' వారిదీ ఆ బాపతు భక్తే కదా?! నాటి అంజన్న మోసిన పాదుకలు 'సంజయు'డివి కాగా, నేడు పాదుకలు మోసిందే 'సంజయుడు!' ఆనాడు టివి ఛానళ్లు లేవు పదే పదే చూపడానికి. సోషల్ మీడియా అసలే లేదు. అంజయ్య సాబ్ కొంత బచాయించినట్లే లెక్క. కానీ సోషల్ మీడియా పుణ్యమాని సంజయుడికి ఆ అవకాశం లేకుండా పోయింది పాపం!
బండి సంజరు కథలో సమాధానాలు దొరక్కుండా మిగిలిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. మహంకాళి అమ్మవారి గుడి కొచ్చింది దేశంలో అత్యంత పవర్ఫుల్ మనిషి. కేంద్ర పోలీసుమంత్రి. జడ్డో, దానిపక్కన ఎన్నో ప్లస్సులున్న వ్యక్తి. ఆ రక్షణ వలయంలోని వ్యక్తి పాదరక్షలు దొంగిలించగలిగే 'యమదొంగ' ఇంకా పుట్టి ఉండడు ఈ భూమ్మీద! పైగా దేశ పోలీసు మంత్రికి చెప్పులందించడానికి, అవసరమైతే చెప్పులు తొడగడానికి వెనకాడని రక్షక భటులెందరో ఉంటారన్న విషయం సర్వే సర్వత్రా వినపడే మాట! బహుశా వారికా అవకాశం ఇవ్వకూడదనే గావచ్చు సర్వశ్రీ సంజయుడురికింది! పాదరక్షల రక్షణకు చాలా గుళ్ళలలో స్టాండ్లుంటాయి. మహంకాళి అమ్మవారి గుళ్ళోనూ ఉన్నాయి. చెప్పుల కాపలాకు మనుషులుంటారు. కొన్ని సందర్భాల్లో అక్కడ కూచునే యాచకులే ఆపని చేస్తూ భక్తులిచ్చే తృణమో, ఫలమో అందుకుని 'గౌరవ ప్రదం'గా జీవనం గడుపుతుంటారు. ఇందరి కండ్లు కప్పి అంత పెద్దాయన పాదరక్షల్ని ఎవరేం చేస్తారు? గుడిముందే ఆయన వదిలేయవచ్చు. కొంపతీసి అవి 'మాయ'మైతే ఎంత చెడ్డపేరు?! చెప్పుల్ని కాపడలేని పోలీసులు మంత్రిగారినేం కాపాడతారని పత్రికల్లో బ్యానర్ స్టోరీలు నిండిపోవా? ఆ ఎస్పీజీ కమాండర్ ఉపాధికే మోక్షం రావచ్చు కదా?!
బహుశా ''భక్తుల''కిదొక పరీక్ష కావచ్చు. 'భగవంతుడు' అమిత్‌షా రూపంలోనో, మోడీ రూపంలోనే ఇటువంటి పరీక్షలెన్నో పెడుతూంటాడు. వాటిలో విజయవంతంగా ప్యాస్ అయినవాడే అల్టిమేట్‌గా ఏ బూర్జువా పార్టీలోనైనా నాయకుడిగా నిలదొక్కుకో గలుగుతాడు. ఇవన్నీ తెలియని అమాయకుడేం కాదు బండి సంజరు! అందుకే మరో పదిసెకన్లలో అమిత్‌షా ఆయన చెప్పుల దగ్గరికి ఆయన చేరుండేవాడు. ఆ పది సెకన్లనూ అరసెకన్లో తన చేతిలోకి తీసుకుని సదరు పాదరక్షలను తానందుకొని స్వహస్తాలతో 'గౌరవ ప్రపత్తులతో గృహమంత్రి కాళ్ళముందుంచాడు. ఈయనకు బానిస మనస్తత్వం ఉందనో, ఆయనకు అహంకారం ఉందనో కాదు గానీ ఇదంతా ''అసంకల్పితంగానే'' జరిగిపోయింది! విధి కొన్నిసార్లు వక్రీకరిస్తూంటుంది. కెమేరాలు, సెల్ఫోన్లు బహుచెడ్డవి. తాము ఆశిస్తున్నట్లు తెలంగాణపై కాషాయజెండా ఎగిరితే, గద్దెనెక్కాలంటే ఈ పెద్దమనిషి గుడ్బుక్స్లో నమోదై ఉంటే మంచిదనుకున్నారో ఏమో ఈ పనికి తెగించారు బండి సంజరు.
అది మునుగోడు కావచ్చు, వారణాసి కావచ్చు... ధరలెందుకు పెరుగుతున్నాయో ప్రజలాలోచించకూడదు. నిరుద్యోగం, పేదరికం ఈ దేశంలో పుట్టలు దేలడానికి కారణాలు యెవరూ అడగకూడదు. ప్రభుత్వరంగ పరిశ్రమలను కారుచౌకగా పెట్టుబడిదారులకు ఎందుకు కట్టబెట్టుతున్నారని బీజేపీని ఎవరూ ప్రశ్నించకూడదు. కుటుంబ పాలనంటూ కాంగ్రెస్‌నో, టీఆర్ఎస్నో విమర్శిస్తూంటే కనీవినీ తరించాలేగానీ... రాజమాత విజయరాజె సింధియా, ఆమె పుత్రిక వసుంధరా రాజె, ప్రస్తుతం ఆమె మేనల్లుడు జ్యోతిరాదిత్య సింధియాల గురించి ఎవరూ ప్రశ్నించకూడదు. మొన్నటిదాక బీజేపీ అంటకాగిన శివసైనికులుండనే ఉన్నారు. ఈ లిస్టు చాంతాడంత ఉంది. తనపై వస్తున్న విమర్శలను పక్కకు తోలలేక నువ్వు ఫలానా వ్యక్తి కాళ్ళెందుకు మొక్కావని, ఫలానా వాళ్ళతో నువ్వెందుకు కాళ్లు మొక్కించుకున్నావని ఎదురేస్తున్నారు సంజయుల వారు. కేసీఆర్ మొక్కినా, కేసీఆర్ మొక్కించుకున్నా మరెవరు చేసినా ప్రజాస్వామ్యంలో ఆమోదించాల్సినవి కావు ఈ పాదాభివందనాలు. ఇక్కడ ప్రశ్న కాళ్లు మొక్కడం గురించి కాదు, చెప్పులు మోయడం గురించి! బానిస సంస్కృతి గురించి!! ఆత్మాభిమానం గురించి!!!