Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజురోజుకి దిగజారిపోతున్న విద్యావిలువలను గమనిస్తున్న ప్రతి ఒక్కరిలోనూ మన చదువుల్ని, విద్యావిధానాన్ని అనుసరించాలా లేక ధిక్కరించాలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అదే సందేహం ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తికే కలిగింది. ''దేశంలోని విద్యాసంస్థలు విద్యార్థులను వారి సామాజిక, సాంస్కృతిక మూలాల నుంచి వేరు చేసే విద్యాకర్మాగారాలుగా మారాయని'' సీజేఐ ఆవేదన చెందారు. దేశంలో చదువుకోవటం పోయి చదువుకొనటం ప్రారంభమై చాలాకాలమే అయింది. బిడ్డ కడుపులో ఉండగానే మొదలవుతున్న సీట్ల వేట కేజీ నుండి పీజీ దాకా సాగుతూనే ఉంది. ఖరీదైన విద్యా సంస్థలో చదివితేనే భవిష్యత్తు బాగుంటుందన్న ఆశలు, ఆ ఆశల వెంట పరుగులు, ఐదు ఆరు అంకెల్లో జీతాలతో ఉద్యోగాలు.. ఇలా నిత్యం ఒత్తిళ్లతో సహజీవనం చేస్తూ జీవితాన్ని గెలిచి మనుషులుగా ఓడిపోతున్నారు భావి భారత పౌరులు. ఆ అవకాశం కూడా దక్కని వాళ్లు నాలుగు రోడ్డల మధ్య నిలుచుని దిక్కులు చూస్తున్నారు. వృత్తిపరమైన కోర్సు లపై దృష్టి పెట్టడమంటే కావాల్సిన అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేసే అధిక వేతనంలో కూడిన విధేయులైన కార్మికశక్తిని సృష్టించడం తప్ప మరోకటి కాదని కూడా సీజేఐ అందుకే వ్యాఖ్యానించారు.
చదువంటే విద్యార్థుల విజ్ఞానాన్ని, శీలాన్ని, సత్ప్రవర్తనను, సామాజిక బాధ్యతను పెంపొందించడమనే నిజాన్ని వదిలిపెట్టి భూముల్ని, ఆస్తుల్ని, మార్కెట్లో షేర్లనీ విలువ గట్టినట్టు విద్యను కూడా విలువకడుతున్నారు. మానవ శాస్త్రాలు, చరిత్ర, భాష వంటి ముఖ్యమైన విషయాలకు కార్పొరేట్ విద్యావిధానంలో చోటు లేకుండా పోయిన ఫలితమే ప్రజల గురించి, సమాజం గురించీ క్షణమైనా ఆలోచించలేని తరం తయారవుతోంది. విద్యార్థులు కెరీరిస్టులుగా మారుతున్నారే తప్ప వారిలో కాసింతయినా సామాజిక స్పృహా బాధ్యతా కనిపించకపోవడం ఏ సమాజానికీ శ్రేయస్కరం కాదు. మన విద్యా వ్యవస్థలోని లోపాల వల్లే ఈ విషఫలాలు కాస్తున్నాయి.
చదువు యొక్క ప్రథమ లక్ష్యం అక్షర జ్ఞానం, ఉద్యోగ సాధన మాత్రమే కాదు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం ఏర్పరచటం, సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతను కల్పించడం. ఏ సమాజమైనా నిరంతరం పురోగమనంలో ఉండా లంటే విద్యకు ఈ లక్షణం తప్పనిసరిగా ఉండి తీరాలి. అప్పుడే అవి విద్యార్థుల నుంచి సామాన్య జనవాణికి చేరుతాయి. ఆ సమాజం అభివృద్ధి పథంలో సాగుతుంది. అందుకు చదువు సమాజంలోని రుగ్మతలకు చికిత్స చేసే దివ్య ఔషధం కావాలి. సమాజానికి దారిచూపే వెలుగుల దివిటీ కావాలి. కానీ మన విద్యా సౌధ నిర్మాణం అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు సాగిల పడుతూ చదువును సరుకుగా మార్చేశాయి. అందుకే 76ఏండ్ల స్వతంత్య్ర దేశంలో కూడా ఆ లక్ష్యాలకు చేరువ కాలేకపోతున్నాం. ఒకప్పుడు దేశంలో ఇరవై ముప్పై యూనివర్సిటీలు ఉండే స్థితిని దాటి నేడు వందల సంఖ్యలో యూనివర్సిటీలు వచ్చాయి. ప్రపంచంలోని వైజ్ఞానిక పరిశోధకులలో 1/3 వంతు భారతీయులేనని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ యివేవీ మన సమాజాన్ని స్పృశించడం లేదు. సామాన్య ప్రజలతో బంధం ఏర్పరుచుకుని వారి కష్టాలను తీర్చే కృషి చేయటం లేదు. ఫలితంగా దశాబ్దాలు గడిచినా మన విద్యా వ్యవస్థ కుల వైషమ్యాలను రూపుమాపలేకపోయింది. ఆర్థిక అసమానతలను అరికట్టలేకపోయింది.
దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానంతో విద్యా హక్కును కూడా కోల్పోయే ప్రమాదం ముంచుకొచ్చింది. దీంతో దేశంలో నిరక్షరాస్యత ఇంకా పెరిగి, సమాజ చైతన్య స్థాయి మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులకు తిలోదకాలు ఇవ్వడమే. రాజ్యాంగపరమైన హక్కులు అమలు జరగాలంటే, విద్య అందరికి అందుబాటులో ఉంటేనే సాధ్యమవుతుంది. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా ధార్మిక సంస్థల ప్రవేశానికి అనుమతిస్తోంది. ఇది తిరోగమనానికి దారితీస్తుంది. ఇప్పటికే బీజేపీ అధికారంలోనికి వచ్చాక వివిధ విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి విద్యావిధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసే మిలిటెంట్ ఆందోళనలను, ప్రశ్నించే హక్కులను అణచివేయడం, ఎస్మావంటి చట్టాలను ప్రయోగించడం చేసింది. విద్య కాషాయీకరణ, మతోన్మాద ధోరణులు పెచ్చరిల్లుతున్న క్రమంలో నూతన విద్యావిధానం మరింత హీన సంస్కృతిని పెంచి, విద్యను అంగడి సరుకుగా మారుస్తుంది. ఒక ప్రగతిశీల రాజ్యం అవతరణకు శాస్త్రీయ దృక్పథం గల ప్రజలు అవసరం. అందుకే శాస్త్రీయ పురోగతిని సాధించడం మన రాజ్యాంగ లక్ష్యాలలో ఒకటిగా నిర్దేశించుకున్నాం. కానీ ఏడున్నర దశాబ్దాలుగా లక్ష్యానికి చేరువ కాలేకపోతున్నాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగడం సమాజానికి ప్రమాదం. ఈ ప్రమాదం నుండి తప్పించుకోవటానికి మనకున్న మార్గం మొత్తం మన విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసుకోవటమే.