Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉక్రెయిన్‌లో అమెరికా ఆధిపత్యంలోని నాటో కూటమి కుట్రలకు వ్యతిరేకంగా రష్యా ప్రారంభించిన సైనిక చర్యకు ఆరునెలలు నిండాయి. అది ఎందుకు ప్రారంభమైందో తెలిసినప్పటికీ ఎప్పుడు, ఎలా ముగుస్తుందో, ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తుందో ఎవరికీ అంతుబట్టటం లేదంటే అతిశయోక్తికాదు. ఈ కాలంలో అక్కడ జరిగిన విధ్వంస తీవ్రత, రెండువైపులా మిలిటరీ నష్టాల గురించి నిర్ధిష్టమైన సమాచారం ఇప్పటికీ వెల్లడి కావటం లేదు. కొలువులు, నెలవులు తప్పిన లక్షలాది మంది ఇరుగుపొరుగు దేశాల్లో తలదాచుకోవటం, కొన్ని ప్రాంతాల వారు ఉక్రెయిన్ మిలిటరీ, నాజీ మూకల దాడులతో రష్యాలో కూడా తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. సరఫరా వ్యవస్థలకు విఘాతం, ఇతర కారణాలతో ప్రపంచం కూడా ఈ సంక్షోభ పర్యవసానాలను అనుభవిస్తున్నది.
కొద్ది రోజుల్లోనే దారికి తేగలనని భావించిన రష్యా అంచనాలు తప్పాయి. పశ్చిమ దేశాల చెప్పుడు మాటలు, ఇచ్చిన ఆయుధాలతో పుతిన్ సేనలను వెనక్కు కొట్టగలమని ఉక్రెయిన్ నేతలు చెప్పిన మాటలు బడాయిగా తేలింది. చైనా-భారత్ మధ్య తాము సృష్టించిన అగాధం, పరస్పర విశ్వాసలేమి కారణంగా ఉక్రెయిన్ సంక్షోభంలో తమ వెంటనడుస్తుందని మన దేశం గురించి అమెరికా పెట్టుకున్న ఆశలు ఇప్పటివరకైతే నెరవేరలేదు. ప్రపంచంలోని అనేక దేశాలు కూడా అవి ఎంతబలహీనమైనప్పటికీ అమెరికా తోకపట్టుకునేందుకు సిద్దం కాలేదు. బెదిరింపులు, అదిరింపులు, తైవాన్ అంశం మీద రెచ్చగొట్టి చైనాను దారికి తెచ్చుకోవాలన్న ఎత్తుగడ ఫలించేది కాదని తేలింది. అనేక దేశాల్లో అమెరికా సామర్థ్యం, చిత్తశుద్ది మీద ఉన్న విశ్వాసం సడలుతోంది. దేశీయంగా అధ్యక్షుడు జో బైడెన్ పలుకుబడి దిగజారిన కారణంగా నవంబరులో జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఉభయసభల్లో అధికార పార్టీ మెజార్టీ కోల్పోవచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ప్రపంచంలో తిరుగులేని పెత్తనం చెలాయించాలన్న అమెరికా పథకాల అమలుకు అధికారంలో రిపబ్లికన్లు ఉన్నారా డెమొక్రాట్లు ఉన్నారా అన్నదానితో నిమిత్తం లేదు. ఉక్రెయిన్ను నాటోలో చేర్చి మాస్కో ముంగిట తమ అస్త్రాలతో తిష్టవేయాలన్న అమెరికా ఎత్తుగడ ఫలించలేదు. దాంతో తటస్థదేశాలుగా ఉన్న ఫిన్లండ్, స్వీడ్జర్లాండ్లకు నాటో ముద్రవేసి మరోవైపు నుంచి రష్యా సరిహద్దులకు చేరువ కావాలని అమెరికా పావులు కదిపి కొత్త రంగాన్ని తెరిచింది. దాన్ని వ్యతిరేకించిన టర్కీ షరతులను అంగీకరించి రాజీచేసుకున్నది. ఉక్రెయిన్ తీసుకుంటున్న ఆయుధాలు, మిలిటరీ సంబంధాల తీరుతెన్నులను చూస్తే ఇప్పటికే అమెరికా అదుపులోకి వెళ్లిందన్నది తేటతెల్లం.
ఐరోపాలో రష్యా చుట్టూ ఉచ్చుబిగిస్తున్న అమెరికా మరోవైపు ఆసియా ఖండంలో పావులు కదుపుతోంది. ఆప్ఘనిస్తాన్ నుంచి మిలిటరీని ఉపసంహరించిన తరువాత ఏదో ఒక సాకుతో పొరుగునే ఉన్న దేశాల్లో తిష్ట, రష్యా ప్రభావం నుంచి దేశాలను తప్పించటం, చైనాకు వ్యతిరేకంగా నిలపటం అనే త్రిముఖ లక్ష్యాలతో ముందుకు పోతోంది. దీనిలో భాగంగానే పూర్వపు సోవియట్ రిపబ్లిక్కులైన మధ్య ఆసియా దేశాలు కజకస్తాన్, కిర్ఖిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లతో పాటు పాకిస్థాన్, మంగోలియాలతో కలసి ఆగస్టు పది నుంచి ఆరు రోజుల పాటు తజకిస్తాన్‌లో అమెరికా సైనిక విన్యాసాలు నిర్వహించింది. దీని వెనుక ఉన్న అమెరికా దుష్టాలోచనను గ్రహించాలని ఉమ్మడి భద్రతా ఒప్పంద సంస్థ(సిఎస్‌టిఓ)లోని తనభాగస్వామ్యదేశాలను రష్యా హెచ్చరించింది. ప్రాంతీయ మిలిటరీ సహకారం పేరుతో అమెరికా పావులు కదిపి వాటి శక్తి సామర్ధ్యాల అంచనాకోసం, దగ్గర కావాలని చూస్తోంది. పనిలో పనిగా విన్యాసాల్లో తన ఆయుధాలను పరీక్షించుకోవచ్చు, మిగతా దేశాలను భయపెట్టవచ్చు.
అమెరికా పార్లమెంటు ఎన్నికలు ముగిసే వరకు ఇప్పటి పరిస్థితే ఉక్రెయిన్‌లో కొనసాగవచ్చు. రష్యా బలహీనపడి వెనక్కు తగ్గేవరకు ఎంతకాలం వీలైతే అంతకాలం సాగదీసి ఆంక్షలను మరింత కఠినతరంగావించటం అమెరికా ఎత్తుగడగా ఉంది. అదే జరిగితే ఉక్రెయిన్ పాలకుల మీద కూడా అక్కడి జనం తిరగబడవచ్చు. రష్యాకు వీటో అధికారం ఉన్నందున ప్రయివేటుగా దేశాలను కూడగట్టటం మినహా ఐరాస వేదికల మీద చర్చకు అమెరికా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. అమెరికా ఎత్తుగడలకు ప్రతిగా రష్యా-చైనా మరింతగా సన్నిహితం కావచ్చు. అమెరికా, ఐరోపా దేశాల్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణ పర్యవసానాలు కూడా ఈ సంక్షోభాన్ని ప్రభావితంగావించవచ్చు.