Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అవునంటే సూట్ కేసులు... కాదంటే సీబీఐ కేసులు'' ఇదీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో నడుస్తున్న ట్రెండ్..! కుతంత్రాలే పాలనా దక్షతకు ప్రతీకలవుతుంటే ఇప్పుడు ఎటు చూసినా రాజకీయ అలజడులే కనిపిస్తున్నాయి. ఈ దేశానికి ఇవేమీ కొత్త కాకపోయినా ఈ తీవ్రత మున్నెన్నడూ ఎరుగనిది. దేశమంతటా షిండేల కోసం సాగుతున్న కమలనాథుల వేట, వారిది కాని ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నీ కుదురుగా నిలువనీయడం లేదు. వీరి మహారాష్ట్ర నిర్వాకాన్ని ఇంకా మరువనేలేదు, అప్పుడే ఢిల్లీకి చేరిన ''ఆపరేషన్ లోటస్'' జార్ఖండ్, బీహార్‌లలోనూ ప్రకంపనలు రేపుతోంది. కేజ్రీవాల్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారా? హేమంత్‌సోరెన్‌పై అనర్హత వేటు పడుతుందా? తేజస్వీయాదవ్ అరెస్టయితాడా? అన్న చర్చ నేడు ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఉనికినే ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, దేశంలో ఏకఛత్రాధిపత్యానికై బీజేపీ బరితెగిస్తోంటే... ప్రజలిచ్చిన తీర్పులు నీటిమూటలవుతున్నాయి.
ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని, తమ 40మంది ఎమ్మెల్యేల కొనుగోలుకు 800వందల కోట్లు సిద్ధం చేసుకున్నారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ముందే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై ఈడీ దాడులు సాగడం, ఆ మరుసటిరోజే తను ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చి, ప్రభుత్వాన్ని కూల్చితే ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేయడంతోపాటు, దాడులు ఆపి, కేసులు ఎత్తివేస్తామని ప్రతిపాదించారని సిసోడియా ప్రకటించడం తెలిసిందే. తాజాగా మరో 12మంది ఆప్ ఎమ్మెల్యేలు తమను బీజేపీ నేతలు సంప్రదించారని తెలియజేసారు. ఈ సంప్రదింపుల సారాంశం ''ఒక ఆశ (రూ.20కోట్లు) ఒక బెదిరింపు (సీబీఐ కేసులు, ఈడీ దాడులు)'' అని కూడా వారు కుండబద్దలు కొట్టారు. దీంతో కేజ్రీవాల్ హుటా హుటిన భేటీ ఏర్పాటు చేయగా 62మందికి గాను 53మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి సిసోడియా హర్యానాలో, స్పీకర్ రాంనివాస్ విదేశీ యాత్రలో ఉండగా మరో ఎమ్మెల్యే వర్చువల్‌గా పాల్గొన్నారని తెలుస్తోంది. అయినప్పటికీ ఢిల్లీలో ఉండి కూడా 7గురు ఎమ్మెల్యేలు గైర్హాజరవడం సూచిస్తున్నదేమిటీ?
ఢిల్లీ కథ ఇలావుంటే జార్ఖండ్ కథ మరోలావుంది. కథలు వేరైనా క్లైమాక్స్ మాత్రం అంతటా ఒక్కటేనన్నది గుర్తుపెట్టువాలి! తమ మహారాష్ట్ర తదుపరి లక్ష్యాల్లో జార్ఖండ్ కూడా ఉన్నదనేది బీజేపీ నేతలు బహిరంగంగానే చెపుతున్న ముచ్చట. అందువల్ల, ఇక్కడ కూడా కొంతకాలంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులూ, షిండేల అన్వేషణా నిరంతరాయంగా సాగుతూనేవుంది. ఈ పార్టీ ఆపార్టీ అన్న తేడాలేదు, అవతలివాడు ఎమ్మెల్యే అయితే చాలు... ''గంపకింద కమ్మడం గద్దెమీద కూర్చోవడం'' అన్నట్టుగా ఉంది బీజేపీ తీరు...! తాజాగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పైనే ఎమ్మెల్యేగా అనర్హత వేటుకు భూమిక సిద్ధం చేసింది. ఇందుకుగాను, ఈ ముఖ్యమంత్రి, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించి, స్టోన్ చిప్స్ మైనింగ్‌లో ఒక లీజును దక్కించుకున్నాడనేది బీజేపీ వేసిన పాచిక. ఈ చర్య ద్వారా అధికార దుర్వినియోగం చేసారు కనుక, ఆయనపై అనర్హత వేటు వేయాలని బీజేపీ గవర్నర్‌కు విజ్ఞప్తి చేయడం, ఆపైన గవర్నర్ ఎలక్షన్ కమిషన్ అభిప్రాయాన్ని కోరడం ఇప్పటికే జరిగిపోయాయి. కాగా ఎలక్షన్ కమిషన్ సైతం పచ్చజెండా ఊపడంతో ఆయన అనర్హుడిగా వేటుకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో బీజేపీ కుట్రలకు ప్రజలెన్నుకున్న మరో ప్రభుత్వం బలయిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందు ముందు ఏం జరుగనుందో వేచి చూడాలి.
ఇక బీహార్‌లో జరుగుతోంది మరో ప్రహసనం. అక్కడ నిన్నటి వరకూ ఉన్నది నితీష్‌కుమార్ నాయకత్వంలోని బీజేపీ, జేడీయూ సంకీర్ణమే. కానీ, బీజేపీ ధృతరాష్ట్ర కౌగిలిలో ఊపిరాడక ఇటీవలే రాజీనామా చేసిన నితీష్‌కుమార్, తిరిగి తేజస్వీ యాదవ్‌తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఊహించని ఈ పరిణామం బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ. కేంద్రంలో అధికారానికి కీలకమైన బీహార్ చేజారడంతో ఉక్రోషం పట్టలేక పాతకేసులను తిరగతోడుతోంది. ఎప్పుడో యూపీఏ 1 (2004-2009) హయాంలో, లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వేమంత్రిగా ఉన్న కాలంలో, రైల్వే ఉద్యోగ నియామకాల్లో అవకతవకలకు పాల్పడ్డారనే అభిప్రయోగా లున్నాయంటూ, ఇప్పుడు (2022) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. ఆమేరకు ఆయన కుటుంబ సభ్యులపై సోదాలు ఊపందుకున్నాయి. తేజస్వీ యాదవ్‌ను అరెస్టు చేసేందుకు, తద్వారా బీహార్‌లో ఆర్జేడీని దెబ్బతీసేందుకే ఈ తతంగమని వేరుగా చెప్పనవసరం లేదు.
బీహార్‌లో తేజస్వీ యాదవ్ అయినా, జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ అయినా నిజంగా అక్రమాలకు పాల్పడితే విచారణ జరిపి చర్య తీసుకోవడంలో అభ్యంతర పెట్టాల్సింది ఏమీలేదు. కానీ ఇన్నాళ్లుగా లేనిది ఇప్పుడే ఎందుకిలా జరుగుతోంది? వీరిరువురూ బీజేపీ వ్యతిరేక శిబిరంలో లేకుంటే ఈ దాడులు జరిగేవా? అన్నది ప్రశ్న! చట్టం తన పని తాను చేసుకుపోతోందని కమలనాథులు తేలికగా కొట్టిపారేయవచ్చు గానీ, ఇందులో కక్షసాధింపులూ, తమ రాజకీయ ప్రయోజనాలేవీ లేవంటే నమ్మగలమా?