Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వతంత్ర మీడియా సంస్థగా గుర్తింపు పొందిన ఎన్‌డిటివిపై అదాని కన్ను పడింది. దానిని స్వాధీనం చేసుకోవడానికి ఒక పథకం ప్రకారం కుట్ర జరుగుతోంది. ఇదంతా మీడియా సంస్థలను కబ్జా చేయచూస్తున్న మతతత్వ-కార్పొరేట్ శక్తుల వ్యూహంలో భాగమే! ఇప్పటికే ఈ శక్తులు నయానా, భయానా దేశంలోని అనేక మీడియా సంస్థలను కబ్జా చేశాయి. తమ కార్ఖానాలో వండి వార్చే కట్టు కథలనే వార్తలుగా చలామణి చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఎన్డిటివి గొంతు నులమడానికి చేస్తున్న ప్రయత్నాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఈ తరహా చర్యలతో ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేయడం, తాము చెప్పే అవాస్తవాలనే నిజాలుగా నమ్మించడం వారి ఎత్తుగడ. దీనిలో భాగంగా తమను తాము 'మెయిన్ స్ట్రీమ్' మీడియాగా చెప్పుకునే దాదాపు 12 సంస్థలను మోడీ అండ్‌కో మింగేసింది! ఇటువంటి వాటినే గోడీ మీడియాగా జనం పిలుచుకుంటున్నారు.
ఈ గోడీ మీడియా అసత్యాలు, అర్థ సత్యాలతో తయారు చేస్తున్న కథనాలను దేశంపైన రుద్దుతోంది. స్వాతంత్య్ర పోరాటానికి ద్రోహం చేసి, బ్రిటిష్ వారికి జీ హుజూర్ అంటూ సలాములు చేసిన ద్రోహులను దేశ భక్తులుగా తెరపైకి తేవడానికి, హంతకులు, రేపిస్టులు ఏదో ఘనకార్యం చేసిన వారిలా సన్మానాలు, సత్కారాలు పొందడానికి ఈ గోడీ మీడియా శతథా ప్రయత్నిస్తుండటం ఇందుకో ఉదాహరణ. దీనికి భిన్నంగా తనశక్తి మేరకు వాస్తవాలను ప్రజలకు అందించి, స్వతంత్ర జర్నలిజంతో గుర్తింపు పొందిన ఎన్డిటివి ఈ విషప్రచార వ్యూహకర్తలకు పంటి కింద రాయిలా మారింది. అందుకే దాని గొంతు నొక్కడానికి ఇప్పుడీ కుతంత్రాలకు తెరతీసారు.
అదానీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రోనీ కేపిటలిజపు దుర్మార్గానికి వీరిమధ్య ఉన్న బంధం, సాగిన లావాదేవీలు నిలువెత్తు నిదర్శనం. ఎన్డిటివి టేకోవర్ ప్రక్రియ అత్యంత రహస్యంగా సాగడం దీనిలో భాగమే! విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రయివేటు లిమిటెడ్ (విసిపిఎల్) అనే సంస్థ నుండి 114 కోట్ల రూపాయలను 2009-10లో ఎన్డిటివి రుణంగా తీసుకుంది. దీనికి బదులుగా ఎన్డిటివి భాగస్వామ్య సంస్థ ఆర్ఆర్ఆర్పిఆర్లో వారంట్లను ఆ సంస్థకు దఖలు పరిచారు. తాజాగా విసిపిఎల్‌ను గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేసిన అదాని సంస్థ, ఆ వారంట్లను 29.18శాతం షేర్లుగా మార్చుకుంది. దీంతో పాటు మరో 26శాతం వాటాలు కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఈ కొనుగోళ్లు పూర్తయితే ఎన్డిటివికి చెందిన 55శాతానికి పైగా షేర్లు అదానికి దఖలుపడతాయి. అంటే యాజమాన్యం మారక తప్పని స్థితి ఏర్పడుతుంది. ఇంత కీలకమైన ప్రక్రియకు సంబంధించి నామమాత్రపు సమాచారం కూడా ఎన్డిటివి ప్రమోటర్లు రాధిక, ప్రణరురారులకు ఇవ్వకపోవడాన్ని కార్పొరేట్ నీతిగా అదాని సమర్థించుకోవచ్చు. కానీ ఇది దుర్మార్గం!
దేశంలో ఇప్పటికే పత్రికా స్వేచ్ఛ తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కుంటోంది. నిజాలను నిర్భీతిగా చెప్పే పాత్రికేయులు తీవ్రమైన అణచివేత చర్యలకు, అక్రమ కేసులకు గురవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అత్యాచారాన్ని రిపోర్టు చేయడానికి వెళ్లిన జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ ఏడాదికి పైగా జైలులో మగ్గుతున్నాడు. ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ 'ఆల్ట్' జర్నలిస్టు మహమ్మద్ జుబేర్‌ను అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు జోక్యంతో ఆయనకు బెయిల్ వచ్చింది. 'రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ రూపొందించిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ -2021 నివేదికలో మన దేశానిది 142వ స్థానం. జర్నలిస్టులకు ప్రమాదకరంగా మారిన దేశాల్లో భారత్ కూడా ఒకటని ఆ సంస్థ ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఇదిలా ఉంటే, మన దేశంలో ఇప్పటికే 80శాతానికి పైగా మీడియా అంబానీల కనుసన్నల్లో ఉంది. ఫలితంగా రైతు ఉద్యమం, సిఎఎ ఆందోళనల వంటి అంశాల్లో అసత్యాలు, అర్థసత్యాలు ప్రజల ముందుకు వచ్చాయి. మిగిలిన వాటిని కూడా అదాని కబ్జా చేస్తే మీడియా సంస్థలు పూర్తిస్థాయి కార్పొరేట్ ఎస్టేట్లుగా మారతాయి. వారి ప్రయోజనాలే వార్తలుగా మారతాయి. అదే జరిగితే దేశంలో జర్నలిజానికీ, ప్రజాస్వామానికి మహా ప్రమాదం. ముంచుకొస్తున్న ఈ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడుకోవడం, బలవంతపు టేకోవర్‌కు వ్యతిరేకంగా గళం విప్పే ఎన్డిటివి ప్రమోటర్లకు, సిబ్బందికి అండగా నిలవడం ఇప్పుడు దేశం ముందున్న కర్తవ్యం.