Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'యథా అన్నం - తథా మన్నం' అని రెండేండ్ల క్రితం ఆగష్టు 'మన్ కీ బాత్'లో ప్రధాని నరేంద్ర మోడీ ఆహార ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రస్తావించిన సూక్తి ఇది. ఆహారాన్ని బట్టే ఆరోగ్యం, మనసు ఆధారపడి ఉంటాయనేది దీని అర్థం. ప్రజలకు పౌష్ఠికాహారాన్ని అందించే దిశగా ప్రభుత్వ చిత్తశుద్ధితో ఉంది అని చెప్పడానికి ప్రధాని ఆ సూక్తిని ఉపయోగించారు. 'మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్టు' కేవలం సూక్తులతో పనులు జరగవు అనేది అంతే వాస్తవం. కరోనా సవాళ్ళ నేపథ్యంలోనూ తమ ప్రభుత్వం జీరో హంగర్ను సాధించేందుకు కృషి చేస్తోందని రెండేండ్ల కిందట ప్రధాని చెప్పిన మాటల్లో చిత్తశుద్ధి లోపించినట్టు ఉంది. అందుకే నిన్నటి 'మన్ కీ బాత్' లోనూ ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించడమే తమ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. అంతే కాదు ఈ సెప్టెంబర్‌ను 'పోషకాహారమాసం' గానూ ప్రకటించారు. మరి ఈ సారైనా వారి మాటల్లో చిత్తశుద్ధి ఏపాటిదో చూడాలి. ఎందుకంటే ఆయన ఇచ్చే పిలుపులు, పథకాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆచరణ మాత్రం ఒక్క అడుగు ముందుకు వేయదు, ఫలితం ప్రజలకు అందదు.
ప్రపంచ జనాభాలో పౌష్టికాహార లోపంతో భాదపడుతున్న బాలల్లో నాలుగోవంతు మంది భారత్‌లో
ఉన్నారనే నివేదికలు ఆందోళన కల్గిస్తున్నాయి. 'ఆరోగ్యమే మహాభాగ్యం' అనే నినాదంతో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది కోట్లరూపాయలు వెచ్చించినా ఫలితం శూన్యం. భారత్‌లో నలభైశాతం మంది తక్కువ బరువుతో పుడుతున్నారని వారిలో ఏడు శాతం మంది పిల్లలు పుట్టిన ఐదేండ్లలోపే మరణిస్తున్నారన్న గణంకాలు భయపెడుతున్నాయి. పుట్టిన ప్రతివారికి జీవించేహక్కు రాజ్యంగం కల్పించింది. కానీ ఇలా పౌష్టికార లోపంతో పసిపిల్లలు మరణిస్తుంటే అందుకు బాధ్యత వహించాల్సిన పాలక పెద్దలు మాత్రం నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కొత్త పథకాలు తీసుకురాకపోయినా ఇబ్బంది లేదు కానీ, ఉన్న వాటి అమలు ఎలా ఉందనేది 'మన్ కీ బాత్'లో మాట్లాడే ప్రభుత్వ పెద్దలు మనసుపెట్టి ఆలోచించాలి. ప్రధానంగా నగరాల్లో మురికివాడల్లో ఉంటున్న కోట్లాది నిరుపేదల పరిస్థితి రాను రాను దుర్భరంగా తయారవుతున్నది. వాయు, నీటి కాలుష్యాలకు తోడు అశుభ్రవాతావరణం వ్యాధులు ప్రబలడానికి కారణం. ముఖ్యంగా కలుషితనీరుతో డయేరియా వంటి రోగాలపాలై అసువులు బాస్తున్నారు. వారి జీవితాలను మెరుగు చేయాల్సిన ప్రభుత్వాలు ఆ బాధ్యత నుంచి తప్పకున్న ఫలితమే ఇది.
ఈ విషయంలో ఎన్నోసార్లు కాగ్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ నివేదికలను పరిశీలించి లోటుపాట్లను సరిదిద్ది మరింత సమర్థవంతంగా ఉన్న పథకాలను అమలు చేసే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరం. ఆహారభద్రత విషయంలో ఎన్ని చట్టాలు చేసినా, సంస్థలను ఏర్పాటు చేసినా ఆచరణలో తీసుకోవాల్సిన శ్రద్ధ తీసుకోవడం లేదు. దీంతో పథకాలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. రోజురోజుకీ అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ జీవన వ్యయాన్ని అధికం చేస్తున్నాయి. నిత్య జీవనం దుర్బరంగా మారిందే గాని మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలోనే ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, రూపాయ పతనం లాంటి ప్రజలను పట్టి పీడిస్తున్న అంశాలపై, కనీసం చర్చించడానికి కూడా మోడీ ప్రభుత్వానికి ఆసక్తి లేదు. ఈ పరిస్థితికి తోడు దేశంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నది. అమృతోత్సవాలు జరుపుకుంటున్న పాలకులకు ఇవన్నీ స్వల్ప విషయాలుగానే కనిపించడం అత్యంత విషాదం.
దేశ ప్రజలు ఏమాత్రం సంతప్తికర జీవనం సాగించలేనప్పుడు తమకు కావలసిన రీతిలో వృద్ధి గణంకాలను వెల్లడిరచినా ఉపయోగం ఉండదు. పాలకుల ఉత్సవాలను నిత్య జీవనానికి సతమతమయ్యే జనం పట్టించుకోరు. వంది మాగద మీడియా ప్రభుత్వం గొప్పలు చెబితే ప్రజలు ఎంతో కాలం నమ్మరు. ఒకవైపు గతంలో ఏనాడు లేనంతగా నిరుద్యోగం తాండవిస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయి సరైన ఆదాయం లేక సతమతమవుతున్న వారికి కనీసం ఆహార భద్రత కల్పించడానికి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం చర్యలను తీసుకోవాలి. ప్రజలు స్వయం సమద్ధి పొందాలి. చిత్తశుద్దీ, ఆచరణ లేకుండా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ అంటూ ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, కొత్త కొత్త ఆకర్షణీయమైన నినాదాలిచ్చినా ప్రయోజనం ఉండదు. పౌష్టికాహార లోపంతో ఈసురో మంటూ జీవిస్తున్న మహిళలు, పిల్లలు మరిన్ని బాధలకు గురవక తప్పదు. కాళోజీ చెప్పినట్టుగా ''సంపద రాశులు ఒక వైపు.. ఆకలి కేకలు మరోవైపు''... దేశం సాధిస్తున్న వృద్ధి రేటు మాత్రం అభాగ్యుల కడుపు నింపలేని పరిస్థితి వేరొకవైపు. అందుకే ఈ నేల ఆకలి మంటలతో మాడుతోంది. మరి ప్రధాని చెప్పిన 'పోషకాహార మాసం' ఏమేరకు ఫలితాలిస్తుందో వేచి చూడాలి!