Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయిలీ గూఢచారి సాఫ్ట్వేర్ పెగాసస్‌ను ప్రయోగించిందా? లేదా? అన్నది సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన కమిటీ తేల్చలేకపోయింది. ఇది కమిటీ వైఫల్యం అనడం కన్నా, ప్రభుత్వమే ఆ కమిటీని విఫలమయ్యేలా చేసిందనడం సముచితంగా ఉంటుంది. ఈ పెగాసస్ స్పైవేర్ ద్వారా, మోడీ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులపైన, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, ఎన్నికల సంఘం సభ్యులు, మానవహక్కుల కార్యకర్తలనేకులపైన అక్రమంగా నిఘాకు పాల్పడిందన్న విషయం వెలుగులొకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో నిజానిజాలను నిగ్గుతేల్చడం కోసం గత ఏడాది అక్టోబరు 28న జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ అధ్యక్షతన ఈ దర్యాప్తు కమిటీ ఏర్పాటైన సంగతి కూడా తెలిసిందే. కానీ ఈ కమిటీ దర్యాప్తునకు ప్రభుత్వం సహకరించడానికి బదులు అడుగడుగునా అడ్డుతగిలింది. ఈ మాట ఎవరో గిట్టనివారు అన్నది కాదు. సాక్షాత్తూ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమే సెలవిచ్చింది.
మిలటరీ గ్రేడ్ పెగాసెస్ స్పైవేర్‌ను తన సొంత పౌరులపై ప్రభుత్వం ప్రయోగించడం చట్టరీత్యా నేరం. ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోడానికి ప్రభుత్వం తప్పిదం మీద తప్పిదం చేస్తోంది. జాతీయ భద్రతను సాకుగా చూపి విచారణ కమిటీకి డేటా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలు తిరస్కరించడం ఎంతమాత్రం సరికాదు. రవీంద్రన్ కమిటీ విచారణకు కేంద్రం అన్ని విధాలా సహకరించాలని సుప్రీం ఆదేశించిన తరువాత కూడా ప్రభుత్వం ఇంత నిర్లజ్జగా వ్యవహరించిందంటే, న్యాయవ్యవస్థ పట్ల దానిది ఎంత ఖాతరులేని తనమో అర్థం చేసుకోవచ్చు. కానీ, ఇటువంటి పరిస్థితుల్లో కొరడా ఝుళిపించాల్సిందిపోయి, ప్రభుత్వం సహకరించలేదు అని వ్యాఖ్యానించడం ద్వారా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశానికి ఎటువంటి సంకేతం ఇవ్వదలచుకున్నారు? అన్నది ప్రశ్న.
అసలు ఈ ఇజ్రాయిలీ స్పైవేర్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసిందా, లేదా? తన పౌరులపై ప్రయోగించిందా, లేదా? ఇది తేల్చాల్సిన సుప్రీం కోర్టే చేతులెత్తేస్తే, ఇక ఈ దేశానికి న్యాయవ్యవస్థ పట్ల నమ్మకమేముంటుంది? పెగాసస్ స్పైవేర్‌ను భారత్, ఫ్రాన్స్, మెక్సికో, స్పెయిన్, హంగరీ, సౌదీ అరేబియా వంటి మొత్తం 40 దేశాల్లో 50వేల మందిపై ఉపయోగించినట్లు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 17 ప్రముఖ వార్తా సంస్థలు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఫర్బిడెన్ స్టోరీస్ వంటి ప్రభుత్వేతర సంస్థలు బల్లగుద్ది చెప్పాయి. వీటిలో చాలా దేశాలు సీరియస్‌గా దర్యాప్తు జరిపిస్తున్నాయి. కానీ భారత ప్రభుత్వం ప్రభుత్వ తీరు మాత్రం దీనికి పూర్తి రివర్స్‌లో ఉన్నది. జాతీయ భద్రత పేరుతో ఏం చేసినా చెల్లుబాటవుతుందన్నట్లుగా వ్యవహరిస్తున్నది.
ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వాన్ని హెచ్చరించడం వరకూ బాగానే ఉంది. కానీ, విచారణకు ప్రభుత్వం సహకరించనప్పుడు తీసుకోవాల్సిన తదుపరి చర్యల గురించి న్యాయస్థానం మౌనం వహించడమే బాగాలేదు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. పెగాసస్ స్పైవేర్‌ను వినియోగించినట్లు ఆధారాలేవీ లభించలేదని, అయిదారు ఫోన్లలో మాల్వేర్ పరికరాలు ఉపయోగించినట్లు మాత్రమే తేలిందని అనడం కేసును నీరుగార్చడం కాదా? వ్యక్తిగత గోప్యతా హక్కును కాపాడుకోవలసిన అవసరం లేదా? ముమ్మాటికీ అవసరం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.టి) శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇది జర్నలిస్టులకే కాదు ప్రతి పౌరునికీ అవసరం.
గోప్యత హక్కును ప్రమాదంలో పడవేసే పెగాసస్ వంటి గూఢచారి సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకుని మోడీ ప్రభుత్వం తన నిరంకుశాధికారాన్ని మరింత దృఢపరచుకోవాలని చూస్తోంది. అందుకే, ఈ కేసులో మొదటి నుంచి మొండిగా వ్యవహరిస్తున్నది. బీమా కొరెగావ్ కేసులో మాల్వేర్ను ఉపయోగించి తప్పుడు ఆధారాలను సృష్టించి, వారిని ఏండ్ల తరబడి జైలులో మగ్గేలా చేసిన మోడీ ప్రభుత్వం, పెగాసస్ కుంభకోణంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించు కోడానికి బదులు, పూర్తిగా కప్పిపుచ్చుకునేందుకే ప్రయత్నిస్తున్నది. ఈ పరిస్థితుల్లో నిరంకుశ మోడీ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ వహించేలా చూడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్ధపై ఉంది.