Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా దానికి జూనియర్ భాగస్వాములుగా మారిన సామ్రాజ్యవాదులు ప్రపంచ దేశాలను తమ మానాన తమను బతకనిచ్చేట్లు లేరు. చమురు, చమురు ఉత్పత్తుల మీద డిసెంబరు ఐదు, 2023 ఫిబ్రవరి ఐదు నుంచి రెండు దశలుగా ఆంక్షలతో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు పూనుకున్నారు. ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ మీద రష్యా ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్యను మరింతగా ఎగదోసేందుకు ఒక వైపు ఉక్రెయిన్‌కు ఆధునిక ఆయుధాలిస్తున్న పశ్చిమ దేశాలు మరోవైపు రష్యాను నిలువరించే పేరుతో దాని చమురు, గాస్ కొనుగోలు చేయవద్దంటూ ఆంక్షలు విధించాయి. ఈ రెండు చర్యలూ ఇప్పటి వరకు ఎలాంటి ఫలితాలనూ ఇవ్వలేదు. సైనికచర్య ప్రారంభానికి ముందు వచ్చేదాని కంటే ఇంథన ఎగుమతులు 38శాతం పెరిగి రష్యాకు ఎక్కువ రాబడి వస్తున్నది. మరోవైపు నాటో కూటమి అందచేసే అస్త్రాలతో పుతిన్ సేనలను అడ్డుకుంటామని ప్రగల్బాలు పలికిన జెలెనెస్కీ ఆరునెలల కాలంలో 20శాతం ప్రాంతం మీద పట్టును కోల్పోయాడు. చివరికి ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడంటే తమ అణువిద్యుత్ కేంద్రం మీద తామే దాడులు చేసి దెబ్బతీసి ఆ నెపాన్ని రష్యా మీదకు నెట్టేందుకు చూశాడు. ఇది తమ పార్లమెంట్ భవనాన్ని తామే తగలబెట్టుకొని కమ్యూనిస్టుల మీద మోపిన తీరును గుర్తుకు తెచ్చింది. ఉక్రెయిన్ మిలిటరీని రష్యా సేనలు అడ్డుకోవటంతో పెను అణుప్రమాదం తప్పింది.
రష్యా ఇంథన ఉత్పత్తుల ఎగుమతులను అడ్డుకోవటంలో విఫలమైన అమెరికా, నాటో కూటమి దేశాలు వాటి ధరలను దెబ్బతీసేందుకు పొమ్మనకుండా పొగ పెట్టినట్లుగా కొత్త ఎత్తువేశాయి. తాము నిర్దేశించిన ధరల కంటే ఎక్కువకు కొనుగోలు చేస్తే వాటిని రవాణా చేసే టాంకర్లకు బీమా సౌకర్యాన్ని నిలిపివేస్తామని అమెరికా, కెనడా, జపాన్, జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్, ఇటలీలతో కూడిన జి7దేశాల కూటమి బెదిరించింది. దీనికి సిద్దము సుమతీ అన్నట్లుగా ఐరోపా సమాఖ్య వంతపాడింది. ఓడలు, టాంకర్ల బీమా వాణిజ్యం 90శాతం ఈ దేశాల చేతుల్లోనే ఉంది. తమ ఈ దుష్ట చర్యకు మీరు సహకరిస్తారా లేదా అంటూ మన దేశంతో సహా అనేక ఇంథన దిగుమతి దేశాల మీద అమెరికా వత్తిడి తెస్తున్నది. ఇది బుద్దితక్కువ పని అంటూ ఈ పథకానికి ఆమోదం తెలిపే, ఆంక్షలను సమర్థించే ఏ దేశానికి తమ ఉత్పత్తులను వేటినీ విక్రయించేది లేదని మాస్కో అధినేత వ్లదిమిర్ పుతిన్ తెగేసి చెప్పాడు. చెప్పటమే కాదు కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లు ఐరోపాకు చమురు, గాస్‌ను సరఫరా చేసే నార్డ్ స్రీమ్ ఒకటవ సహజవాయు సరఫరాను మరమ్మతుపేరుతో రష్యా నిలిపివేసింది. చెప్పిన గడువు తరువాత కూడా మూసివేత కొనసాగుతోంది. దాంతో ఇంథనాన్ని ఆయుధంగా చేసుకొని ఐరోపా దేశాల మీద వత్తిడి తేవటం తొండి ఆట అంటూ అమెరికా గుండెలు బాదుకుంటోంది. అదే ఇంథన అస్త్రంతో గత ఆరునెలలుగా రష్యాను దెబ్బతీసేందుకు పూనుకున్నదెవరో తెలియనంత ఆమాయకంగా ప్రపంచం ఉందని అమెరికా భావిస్తోంది.
పశ్చిమ దేశాలు ప్రకటించిన ఆంక్షలను అధిగమించేందుకు వాటిని ఖాతరు చేయకుండా రష్యా తన దగ్గర చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు ఇప్పటికే తగ్గింపు ధరలకు అంద చేస్తున్నది. పశ్చిమ దేశాల వత్తిడికి లొంగి వాటితో చేతులు కలిపితే కొత్తగా కలిగే ప్రయోజనం లేకపోగా తోకలుగా మారినట్లు మాటలు పడటంతో పాటు రష్యాతో సంబంధాలు దెబ్బతినటమే కాదు, అధిక ధరలకు ఇతర దేశాల నుంచి కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆంక్షలతో తమ కాళ్లను తామే తొక్కుకుంటున్నది ఐరోపా. ఇంథన, విద్యుత్ ధరలు సామాన్యులు భరించలేనంతగా పెరిగాయి. రికార్డులను బద్దలు కొడుతున్న ద్రవ్యోల్బణంతో అనేక దేశాలు మాంద్య ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు ఆంక్షలను ప్రకటించిన దేశాలు మరోవైపు ఆ గడువులోపల అదే రష్యా నుంచి ఇబ్బడి ముబ్బడిగా దిగుమతులు చేసుకుంటూ నిల్వ చేసుకోవటం వాటి సిగ్గులేని తనానికి, వంచనా శిల్పానికి నిదర్శనం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ప్రామాణిక బ్రెంట్ రకం ముడిచమురు ధర 90-100 డాలర్ల మధ్య కదలాడుతోంది. ధనికదేశాల కూటమి ఆంక్షలు ప్రారంభమైతే పశ్చిమాసియా ఇతర దేశాల చమురు ధరలు మరోసారి కొండెక్కి కొత్త పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తాయి. అవి సామాన్యుల జన జీవితాలను అతలాకుతలం గావిస్తాయి. పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులకు తమ లాభాలు తప్ప జనం ఏమైపోతారన్నదానితో నిమిత్తం ఉండదు. వాటి కోసం ఎంతకైనా తెగిస్తారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని సృష్టించటమే కాదు, దాన్ని కొనసాగించేందుకు కూడా పూనుకున్నట్లు రష్యాచమురు ధరల మీద పరిమితి పేరుతో తలపెట్టిన ఆంక్షలు వెల్లడిస్తున్నాయి. ఈ వైఖరిని ప్రజాప్రయోజనాలను కాంక్షించే వారందరూ వ్యతిరేకించాలి, జనానికి వ్యతిరేకం గనుక ప్రతిఘటించాలి.