Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పేరులో ఏముంది పెన్నిధి'' అంటారుగానీ, పేర్లతోనే భావోద్వేగాలు రగిలించడంలో పేరెన్నికగన్న నేతలున్న కాలమిది. అందులో ఘనాపాటి ప్రధాని మోడీ...! తాజాగా ''రాజ్‌పథ్''ను ''కర్తవ్యపథ్''గా మార్చేశారు. ''కింగి జార్జ్'' స్థానంలో ''నేతాజీ'' విగ్రహాన్ని ఆవిష్కరించేసారు. అంతేనా... ''బానిస చిహ్నాలను తొలగిస్తున్నాం'' అంటూ ఈ సందర్భాన్ని ఓ ''మహాద్భుతం''గా ప్రవచిస్తున్నారు. ఇవి వినడానికి బాగుంటాయి. అయితే ఇక్కడ బద్దెన సుమతీ శతకమొకటి తప్పక గుర్తుచేసుకోవాలి.
''వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు...'' అన్నారాయన. కాబట్టి ప్రధాని ప్రవచనాలను కూడా ఈ వెలుగులో పరికిస్తే తప్ప మనకు తత్వం బోధపడదు. బ్రిటిష్ చక్రవర్తి కింగ్‌జార్జ్ విగ్రహం స్థానంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ప్రతిష్టాపన సంతోషిం చదగినదేగానీ, తద్వారా తాము నేతాజీ వారసులమని చెప్పుకునే ప్రయత్నాలను మాత్రం నమ్మితే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే, భారత ప్రజల బానిస సంకెళ్లను తెంచడానికి ప్రాణాలకు తెగించి పోరాడినవాడు నేతాజీ అయితే, ఈ దేశానికి ఆ సంకెళ్లు వేసిన బ్రిటిష్ పాలకులకు దాస్యం చేసినవాళ్లు మన ప్రధాని పూర్వీకులు.
వీరు మాటల్లో చెప్పేదొకటి, చేతల్లో చూపే దొకటనడానికి బోలెడన్ని ఉదాహరణలు కండ్ల ముందే ఉన్నాయి. గడిచిన ఎనిమిదేండ్లుగా నేతాజీ కలల సాకారానికే కట్టుబడి పనిచేస్తున్నామని మాగొప్పగా సెలవిచ్చారు ప్రధాని! కానీ ఆచరణలో జరుగుతున్నదేమిటి? జాతీయోద్యమ కాలంలో తాను కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ''ప్లానింగ్ కమిటీ''ని ప్రతిపాదించారు నేతాజీ. స్వతంత్య్రానంతరం అదే ''ప్లానింగ్ కమిషన్ (ప్రణాళికా సంఘం)''గా మారింది. కానీ ప్రధానిగా మోడీ ఏం చేశారు? ఆ ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి ఆ స్థానంలో ''నిటి ఆయోగ్''ను ఏర్పాటు చేశారు. దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల పురోగమనానికీ, అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యానికీ ప్రణాళికా సంఘం, ప్రభుత్వ రంగం చాలా అవసరమన్నది నేతాజీ భావన. అందుకు పూర్తి విరుద్ధంగా ప్రణాళికా సంఘాన్ని రద్దుచేయడమేగాక, ప్రభుత్వరంగాన్ని కూడా అంగట్లో అమ్మకానికి పెట్టారు ప్రధాని. ఈ ఎనిమి దేండ్లుగా సాగుతున్నది ఇదే కదా..? ఇందు లో నేతాజీ కలలు సాకారమ య్యిందెక్కడో ఈ ''నేతాజీల''కే తెలియాలి..!
భారతదేశాన్ని లౌకిక, ప్రజాస్వామ్య పునాదులపై ఒక గొప్ప దేశంగా నిర్మించాలని కలలు కన్నారు నేతాజీ. కులం, మతం, జాతి ఆధారంగా ప్రాధాన్యతలు ఉండకూడదన్నారు. వీటన్నిటికీ అతీతంగా అందరికీ అన్నింట్లో సమానావకాశాలు కల్పించాలన్నారు. ''మత మూఢత్వం సాంస్కృతిక అభివృద్ధికి ఆటంకం - దానికి లౌకిక, శాస్త్రీయ విద్యే పరిష్కారం'' అని ప్రకటించారు. కానీ లౌకికవాదం అంటేనే ''మోడీ అండ్ కో'' కు మింగుడు పడదు! మరి వీరు ఆయన కలలను ఎలా సాకారం చేయగలరు? లెనిన్ సారథ్యంలోని బోల్షివిక్ విప్లవాన్ని మహౌన్నతమైనదిగా పేర్కొనడమే కాదు, భారతదేశ భవిష్యత్తు కూడా అలాంటి విప్లవంతోనే ముడిపడి ఉంటుందని భావించాడు నేతాజీ. ''మార్క్స్-లెనిన్‌ల రచనలు, కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ అధికారిక ప్రకటనల్లో వ్యక్తీకరించబడిన కమ్యూనిజం, భారత జాతీయోద్యమానికి మద్దతివ్వడం నాకు గొప్ప స్ఫూర్తినీ, సంతృప్తినీ ఇచ్చింది'' అని ప్రకటించాడు. కానీ వీరికి సామ్యవాదమంటేనే గిట్టదు కదా? మరి ఆయన వారసత్వానికి ఎలా అర్హులవుతారు?
అందువల్ల, జార్జ్ స్థానంలో నేతాజీనీ ప్రతిష్టంచడం, రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్గా మార్చడం చేసినంతనే... బానిసత్వ ప్రతీకల నుండి దేశాన్ని విముక్తి చేసినట్టుగా చెప్పుకోవడం కేవలం మోడీగారి మాటల గారడీ. ఆయన కర్తవ్యపథ్గా మార్చిన రాజ్‌పథ్ అనేది బ్రిటిష్‌వారు పెట్టిన పేరేమీ కాదు. వారు దానిని 'కింగ్స్ వే' అన్నారు. దాని మీదుగా వెళ్ళే మరో రోడ్డును 'క్వీన్స్ వే' అన్నారు. స్వాతంత్య్రానంతరం ఈ 'కింగ్స్ వే'ను 'రాజ్‌పథ్'గా, 'క్వీన్స్ వే'ను 'జనపథ్'గా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో మార్చింది. అంటే ఇక్కడ 'రాజ్పథ'్ అంటే దానర్థం రాజుల మార్గమని కాదు, రాజ్య పథం అని. అలా అవి ప్రజాస్వామ్య చిహ్నాలుగా మారి చాలా కాలమే అయ్యింది. ఇప్పుడు ప్రధాని చేసిందల్లా సామాన్యులు సైతం స్వేచ్ఛగా తిరిగే రాజ్‌పథ్ ప్రాంతాన్ని కర్తవ్యపథ్గా మార్చి ప్రజలకు దూరం చేయడమే..!
చూడబోతే భారత స్వాతంత్ర పోరాటంలో తమ వారెవరూ లేకపోవడం ఏలినవారిని తీవ్రంగా కలవరపెడుతున్నట్టున్నది. అందుకే కాబోలు, నిన్న ''ఐక్యతా విగ్రహం'' పేరుతో పటేల్‌ను, నేడు ''కర్తవ్యపథ్'' పేరుతో నేతాజీనీ తమ ఖాతాలో వేసుకుని, వారి వారసత్వాన్ని అపాదించుకునే ఈ కుతంత్రాలు. నిజానికి చరిత్ర ఏం చెపుతున్నది? బ్రిటిష్ ప్రభుత్వంపై యుద్ధానికి ''ఇండియన్ నేషనల్ ఆర్మీ''ని స్థాపించి, సైన్యాన్ని చేర్చుకునే పనిలో నేతాజీ ఉన్నప్పుడు... ఇందుకు విరుద్ధంగా బ్రిటిష్ ప్రభుత్వంతో లాలూచీపడి, సావర్కర్ నేతృత్వంలో లక్షలాది హిందువులను బ్రిటిష్ సైన్యంలో చేర్పించిన ''అపర దేశభక్తుల''కు వీరు వారసులని కదా..! మరి వీరు నేతాజీ కలలను ఎలా సాకారం చేయగలరు? కాబట్టి సుమతీ శతకంలో చెప్పిన ''గని కల్ల నిజము తెలిసిన మనుజులే'' నేటి అవసరం.