Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి' అన్న యాదగిరి పాట తెలంగాణ పోరాట పొలికేకై మోగింది. 'ఓ నిజాము పిశాచమా! కానరాడు/ నిన్ను బోలిన రాజు మాకెన్నడేని/ తీగెలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ కోటి రత్నాల వీణ' అంటూ పద్యమై గర్జించాడు దాశరథి. తెలంగాణకు ఒక చారిత్రక సాంస్కృతిక ప్రత్యేకత ఉంది. వెట్టి చాకిరికి, అణచివేతకు, పేదరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం వీరోచితంగా సాగిన యుద్ధ భూమి ఇది. ఆ సమర సన్నివేశాలు, ఆవేశాలు ఇక్కడి కళా సాహిత్యాల్లోనూ విస్తృతం. అట్లాంటి తెలంగాణ సాయుధ సమర కాలంలో ఆయుధాన్ని, అక్షరాన్ని యెక్కుపెట్టిన యోధులెందరో. ఈ పోరాటం విప్లవోద్యమంగా మారిన క్రమంలో సాహిత్యం ఉద్యమంతో సమ్మిళతమై నూతన ఒరవడిని సృష్టించింది. 'నీబాంచను' అన్న నోటితోనే ' నీ గోరికడ్తం కొడుకో' అనే తిరుగుబాటు బావుటా నెగరేయించింది.
'కసి ఆరిపోకుండా బుసకొట్టు చుండాలె/ కాలంబురాగానే కాటేసి తీరాలె' అంటూ నైజాం రాక్షస పాలనలో చితికి పోయిన బతుకులలో విప్లవ జ్వాల రగిలించారు కాళోజీ. 'ఈ ప్రజలు కూడా / గుట్టుచప్పుడు కాకుండా / కుతకుతమని ఉడుకుతారు / పొగలు రేగి సెగలు చిమ్మి / భగభగమని మండుతారు' అంటూ చంద్రలాల్ ఓఝా మహత్తర పోరాట చరిత్రను ప్రపంచానికి చాటారు. 'దేశంలో సంస్థానాలన్నింటిలో / హైదరాబాద్ పెద్దది / భూస్వామ్య బాధల్ని ప్రజలు సహించిన చిట్టచివరి హద్దు అది' అని కుందుర్తి తెలంగాణ కావ్యంలో స్పష్టం చేశారు. 'త్యాగాలకు వెనుదీశామా? / భోగాలను ఆశించామా? / ప్రాణాలకు భయపడ్డామా?' అంటూ తేన్నేటి సూరి పోరాట కాలంలో వెనుదీయని ప్రజల గొప్పతనాన్ని కీర్తించారు. 'అడవుల కొండల అనుంగు బిడ్డలు / పొలాల పొత్తిట పెరిగిన పాపలు / లేచిరి క్రోధోధ్ధత భీకరులై / సమరోద్థృతకాక్షేయ కరులై'... అంటూ 'తెలంగాన'మై వినిపించారు మగ్ధూం. ఆరుద్ర తెలంగాణ బాధితుల పక్షాన నిలబడి 'త్వమేవాహమ్' అంటే... ఆవంత్స సోమసుందర్ 'ఖబర్దార్!' అంటూ 'వజ్రాయుధం'తో హెచ్చరించాడు. కెనడా కవి స్మిత్ 'ది మీనింగ్ అండ్ ఎండ్ ఆఫ్ రిలీజియన్' గ్రంథాన్ని ఆరుద్ర 'వీర తెలంగాణ విప్లవ గీతాలు'గా అందించారు. హరీంధ్ర నాథ్ చటోపాధ్యయ గీతాలు, చిత్త ప్రసాద్ బొమ్మలు ఆ మహొన్నత పోరాటాన్ని వెలుగెత్తి చాటాయి.
శ్రమ జీవులు ఆశువుగా చెప్పిన మాటలే పల్లవులై పాటలుగా ధన్వించాయి. 'వీరులకు కాణాచిరా! తెలంగాణ!' అన్న రావెళ్ల గీతం ప్రతి గుండెను కదిలించింది. 'నాజీ నైజాము రాజు నలగొండ జిల్లాలోన / ప్రజలను పట్టియు నానా హింసలకు గురిజేసె' నంటూ పట్టంశెట్టి ఉమామహేశ్వరరావు ఆలపించాడు. 'కరకు కత్తుల తోడ ఓ రాజా / ప్రజల కుత్తుకలు కోసెటి యమరాజా' అంటూ నిజాం రాజును ఓ అజ్ఞాతకవి హెచ్చరించాడు. 'లేవీ ధాన్యం బివ్వవలదన్నా సర్కారు వారికి / లేవీ గొల్చితే కరువు పోదన్నా' వంటి పాటలు రైతుల్ని ఏకం చేసి.. పోరాట బాట పట్టించాయి. ' వేయరా దెబ్బ' అంటూ ఆవేశంతో తన చేతి కర్రను నేలకు కొట్టి కర్తవ్య భోద చేసిన అవ్వ మాటలే పల్లవిగా సుద్దాల హన్మంతు పాటలు ప్రజాశక్తిని కదిలించాయి. 'తెలుగు తల్లి బిడ్డలం - తెలంగాణవీరులం ' అంటూ కొండెపూడి లక్ష్మినారాయణ గీతం పల్లె పల్లెలో లాంగ్ మార్చ్ చేసింది. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య మరణించినప్పుడు కె.ఎల్.నరసింహరావు జైలు నుండే రాసిన 'అమరజీవి కొమరయ్య' పాట కర్తవ్యాన్ని గుర్తుచేసింది. మల్లు స్వరాజ్యం 'ఉయ్యాల పాటలు' మహిళను చైతన్యవంతం చేశాయి. పత్రి పాటా.. తూటాలా నేనుసైతం అంటూ పోరు సలిపింది.
తెలంగాణ సాయుధ పోరాటం, హైదరాబాద్‌పై పోలీసు చర్య నేపథ్యంలో అనేక కథలు వచ్చాయి. భాస్కరభట్ల కృష్ణారావు 'ఇజ్జత్' కథ, దొడ్డికొమురయ్య అమరత్వం నేపథ్యంలో ఆవులపిచ్చయ్య రాసిన 'ఊరేగింపులు' కథ. ఆళ్వారుస్వామి, పొట్లపల్లి రామారావులు జైలులోని ఖైదీలు కేంద్రంగా ఉద్యమాన్ని రికార్డు చేశారు. ఈ కథలన్నీ దొరల దౌర్జన్యాలని, రజాకార్ల దురాగతాలని, కమ్యూనిస్టుల పోరాట పటిమను, అధికారుల దాష్ట్టీకాన్ని చిత్రించాయి. తెలుగు నేల గర్వించదగిన నవలా సాహిత్యాన్ని ఈ పోరాటమే సృష్టించింది. బొల్లిముంత శివరామకృష్ణ 'మృత్యుంజయులు', లక్ష్మీకాంత మోహన్ 'సింహ గర్జన', ఆళ్వారుస్వామి 'ప్రజల మనిషి', 'గంగు' నవలలు ఆనాటి పరిస్థితిని కండ్లకు కడతాయి. 1947 నాటి తెలంగాణ గురించి మహీధర రామ్మోహన్రావు రాసిన 'ఓనమాలు', 'మృత్యువు నీడల్లో' తెలియజేస్తే... 1938కి పూర్వపు తెలంగాణ జన జీవితాలను దాశరథి రంగాచార్య 'చిల్లరదేవుళ్లు' చిత్రించింది. ఈ మహౌన్నత పోరాటంలో త్యాగాలు చేసిన వారిని నిత్యం సర్మించుకోవాలి. ఈ పోరాటమే లేకుండా నేటి, రేపటి తెలంగాణను ఊహించలేము. చారిత్రక అవగాహన ఉన్న వారెవరూ ఆ పని చేయరు. కానీ ఈ ఉద్యమంతో కనీస సంబంధంలేని వారు నేడు విద్వేషాలను రెచ్చకొడుతూ... ప్రజలను విభజించే పని చేస్తున్నారు. అలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త!