Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం హర్షణీయం. 'ఒక పౌరుడికి ఉన్న స్వేచ్ఛలన్నిటినీ కాలరాసి బలవంతంగా చీకటి గదిలో నిర్బంధించిన సిద్ధిఖీ కప్పన్ కుమార్తెను నేను. 75ఏండ్లగా మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వతంత్య్రాలు గాంధీజీ, నెహ్రూ, భగత్ సింగ్ వంటి స్వాతంత్రయోద్యమ నేతల త్యాగాల ఫలితం. భావ ప్రకటనా స్వేచ్ఛ మనందరి హక్కు. మా నాన్నకు స్వేచ్ఛ నివ్వండి' అంటూ పంద్రాగస్టు నాడు పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో సిద్ధిఖీ తొమ్మిదేండ్ల కూతురు మెహ్నాజ్ వ్యక్తం చేసిన ఆకాంక్ష ఇది. సిద్ధిఖీ నిర్బంధాన్ని ఖండిస్తూ అంతర్జాతీయంగానూ నిరసనలు వెల్లువెత్తాయి. దాదాపు రెండేండ్లు యోగీ ప్రభుత్వం ఆయనను చీకటి కొట్టంలో బంధించి చిత్రహింసలు పెట్టింది. అక్రమ కేసులు బనాయించి బెయిల్ రాకుండా మోకాలడ్డుతూ వచ్చింది. శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలోనూ పసలేని అవే అభ్యంతరాలను ఏకరువు పెట్టిన యోగి సర్కార్‌కు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం మొట్టికాయలు వేసింది. ప్రతి పౌరుడికీ భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ఒకటుంటుందని కనీసం దాన్నైనా గుర్తించండని కఠినంగానే వ్యాఖ్యానించింది. ధర్మాసనం ప్రశ్నలకు యోగి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైంది.
కప్పన్ నిజాలను నిర్బయంగా రాసే తెగువున్న పాత్రికేయుడు. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో రెండేండ్ల కిందట ఒక దళిత బాలికపై అత్యంత దారుణంగా లైంగికదాడి చేసి హత్య చేసిన పెత్తందారి దుండగులను రక్షించేందుకు అధికార యంత్రాంగం ఆ బాలిక మతదేహాన్ని కుటుంబ సభ్యులకు కూడా సమాచార మివ్వకుండానే దహనం చేసింది. అమానవీయమైన, ఈ దురాగతాన్ని ఆధార సహితంగా వెలుగులోకి తీసుకొచ్చిన పాత్రికేయుల్లో కప్పన్ ఒకరు. అందుకనే బీజేపీ సర్కార్‌కు అతడంటే కడుపు మంట. దళిత బాలికకు న్యాయం దక్కాలని కోరుకున్న ఆయనపై 'దేశద్రోహ' ముద్ర వేసేందుకు యోగి సర్కార్ విఫలయత్నమే చేసింది. తీవ్రవాద సంస్థ అయిన పిఎఫ్ఐతో సంబంధాలున్నాయంటూ ఉపా వంటి తీవ్ర నేరాలకు సంబంధించిన సెక్షన్లను బనాయించింది. కానీ, సుప్రీంకోర్టులో ప్రాథమిక ఆధారాలు కూడా చూపలేక పోయింది. వారు చూపిన సాక్ష్యం చూసి విస్తుపోవడం ధర్మాసనం వంతైంది. ఇంతటి తీవ్రమైన నేరాలకు సేకరించిన సాక్ష్యం ఒక ఐడి కార్డు... ఒక కరపత్రమా అంటూ నిలదీసింది. నిరసనలకు పిలుపునివ్వడమే నేరమా? అంటూ యోగి సర్కార్‌కు తలంటుతూనే భావ ప్రకటాన స్వేచ్ఛ ప్రాధాన్యతను సర్వోన్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది. 2012లో నిర్బయ ఘటన సందర్భంగా ఇండియా గేటు వద్ద పోటెత్తిన నిరసనల తర్వాతే మనం చట్టాలు మార్చుకున్నామనే సంగతిని కూడా న్యాయస్థానమే గుర్తు చేసింది. గొంతుక లేనివారి పక్షాన గొంతెత్తితే తప్పేంటంటూ ప్రశ్నించింది. ప్రజాస్వామ్యం మనుగడకు పత్రికా స్వేచ్ఛ కీలకమైనందున పత్రికా స్వేచ్ఛకు అంతరాయం కలిగించే అన్ని చర్యలు, చట్టాలు రద్దు చేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు గతంలోనే ఆదేశించింది. ఎన్ని సార్లు ఆదేశించినా సర్కార్ వంకర బుద్ధి మారనంత వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. యూపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ''అంతర్జాతీయ కుట్ర'' జరుగుతోందంటూ బొంకిన యోగి సర్కార్... ఇప్పుుడు ''కుట్ర'' ఎవరిదని చెబుతుందో.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ సంస్థలను మోడీ సర్కార్ నిర్వీర్యం చేస్తోంది. పౌరుల హక్కులను, మీడియా సంస్థలను, భావ ప్రకటనా స్వేచ్ఛనూ హరిస్తోంది. సామ, దాన, దండోపాయాలతో మీడియాను తన అనుచరుల గుప్పిట్లో ఉండేలా కుట్రలు చేస్తోంది. మోడీ క్రోనీ మిత్రుడు గౌతం అదానీ ఎన్డీటీవీని చేజిక్కించుకునేందుకు ఎంతటి అనైతిక కుట్రలకు పాల్పడ్డాడో చూశాం. ద వైర్, న్యూస్‌క్లిక్, ఆల్ట్‌న్యూస్ వంటి స్వతంత్ర మీడియా సంస్థలను కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి వేధింపులకు గురి చేసిన వైనాన్ని చూశాం. స్వేచ్ఛ ఇస్తే పెట్టుబడి సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న వాదన నిజమైనప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రం ప్రజల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే అంశమే కదా! ఒక వర్గానికి ప్రాణప్రదమైన స్వేచ్ఛ మరో వర్గానికి దక్కకూడదని పాలకవర్గం ఎందుకు భావిస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేయకపోయినా, తెలుసుకోవటంలో జాప్యం జరిగినా ప్రజలకున్న స్వేచ్ఛ శాశ్వతంగా సంకెళ్లలో బంధీ అవటం ఖాయం. ఇలాంటివి కేవలం పత్రికా స్వేచ్ఛను మాత్రమే కాలరాసే చర్యలుగా భావిస్తే పోరపాటే. వాటితో ముడిపడి ఉన్న సాధారణ ప్రజల రాజకీయ హక్కులు కూడా అణచివేతకు గురవనున్నాయన్న వాస్తవం తెలిసుండాలి. ఇలాంటి పరిస్థితులు చుట్టూ ముసురుకొని ఉన్న వేళ స్వేచ్ఛా స్వతంత్రాల కోసం పోరుసల్ఫుతున్న ప్రజాస్వామ్య గొంతులకు సుప్రీం తీర్పు ఒక ఊరట.