Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''విద్యుత్తు సంస్కరణల్లో ఒక ఆర్డర్ పాస్ చేసిన్రు. అదేమిటంటే, టన్ను రూ.4వేలకు దొరికే మన దేశ బొగ్గు కొనుడు బంద్ పెట్టాలె. టన్నుకు 35 వేలు ఖర్చుబెట్టి 10% విదేశీ బొగ్గు విధిగా కొనాలె. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చి అమ్మించేందుకు, ఆయన వ్యాపార మిత్రులకు లాభం కలిగించేందుకు ఈ ఘనత వహించిన విశ్వగురువు విద్యుత్తు సంస్కరణ పేరిట తెచ్చిన ఆర్డర్ ఇది. హి ఇజ్ ది మోస్ట్ ఫాసిస్ట్ ప్రైమ్మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ'' అంటూ రాష్ట్ర శాసన సభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ పాలనపై విరుచుకుపడ్డారు. కేంద్రం రాయితీలు తానివ్వదు.. ఇచ్చే రాష్ట్రాలకు మోకాలడ్డు పెడుతోందంటూ అసెంబ్లీ వేదికగా మోడీ సర్కార్ను తూర్పరాబట్టారు. ఆయన విమర్శల్లో నిజముంది కదా! ఇప్పటికే ప్రభుత్వ రంగాలనూ అమ్మేసిన మోడీ.. విద్యుత్తును సైతం తన వ్యాపార మిత్రులకు కట్టబెట్టే కుట్రకు పూనుకున్నారు. అందులో భాగంగానే రాష్ట్రాలపై ఆ సంస్కరణల అమలుకు ఒత్తిడి చేస్తున్నారు. కేంద్రం చెప్పినట్టు మోటర్లకు మీటర్లు పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరుకు పేదలకు కల్పిస్తున్న సబ్సిడీలన్నీ బంద్ అవుతాయి. ఇదే జరిగితే కోటి కుటుంబాల బతుకులు ఆగమవుతాయి. మీటర్లపై బొంకుతున్న బీజేపీ పెద్దలు దీనికేం సమాధానం చెబుతారు? ఆ కోటి కుటుంబాల సంగతి కమల నాథులకు పట్టాదా? ఇవి బీజేపీ ప్రభుత్వం విద్యుత్తు సంస్కరణ పేరుతో రైతులను దోచుకొనేందుకు చేస్తున్న దుర్మార్గపు ఆలోచనలు కాక మరేంటి?
ఉపన్యాసాలతో తిమ్మిని బొమ్మిని చేయగల మన ప్రధానమంత్రి...అశాస్త్రీయమైన విధానాలను, అసంబద్ధమైన సంస్కరణలను అనుసరించడం సాధారణ ప్రజల జీవితాలను తారుమారు చేస్తున్నాయి. తాజాగా ఆయన తీసుకోస్తున్న విద్యుత్ సంస్కరణలు కూడా పేదల బతుకుల్లో మినుకుమినుకు మనే ఈ కాస్త వెలుగులను కూడా దూరంచేయనున్నాయి. తన ఏనిమిదేండ్ల పాలనతో ఏడున్నర దశాబ్దాల ప్రగతిని, అభివద్ధిని వెనక్కి తీసుకుపోయిన ఘనత వారిది!! కరోనాను అరికట్టడానికి అశాస్త్రీయ విధానాలతో చేసిన నిర్వాకాన్ని అంతర్జాతీయ మీడియా ఎండకట్టింది వాస్తవమే కాదా? అదేనా విశ్వగురువుగా ఆయన సాధించిన ఖ్యాతి? నిన్నటి వరకూ మోడీ.. మోడీ అన్న యువతే నేడు 'పీచేముడ్' అంటున్నారంటే ఆయన చెప్పిన ఉద్యోగ భద్రత ఎటుపోయినట్టు? కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా 13సార్లు పెట్రోల్, ఇంధన, గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరగొట్టిన ఆయనే...నిత్యావసర ధరలు అగ్గిలో అదే పేదల బతుకులను బుగ్గిచేశారు. ఇప్పుడు కరెంట్ షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
మోడీ ప్రభుత్వం ఆదానీ, అంబానీ లాంటి స్వదేశీ, విదేశీ కుబేరుల కోసమే పనిచేస్తుందన్నది ఇప్పటికే తేలిపోయిన విషయం. అదే ముచ్చట అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి మరోసారి తెలంగాణ సమాజానికి గుర్తుచేశారు. అడుగడుగునా బీజేపీ రాష్ట్ర సంక్షేమానికి ఏవిధంగా అడ్డుపడుతుందో కుండబద్దలు కొట్టినట్టు వివరించారు. రైతు వ్యతిరేక చట్టాలపై రైతాంగం సాగించిన ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసే కుట్రలను.. మొక్కవోని దీక్షతో ప్రాణాలను ఫణం పెట్టి మరీ ఉద్యమించి రైతులు ఈ ప్రభుత్వ మెడలు వంచారు. అదే విధంగా విద్యుత్ సంస్కరణలు కనుక అమలు చేస్తే విద్యుత్ ఉద్యోగులే ఈ బీజేపీ ప్రభుత్వ గద్దెను కూకటి వేళ్ళతో సహా పెకలిస్తారనడంలో సందేహం లేదు.
ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కారుచౌకగా విదేశీ, స్వదేశీ బడా పెట్టుబడిదారులకు కట్టపెడుతున్నది మోడీ సర్కార్. విదేశీ పెట్టుబడులను 40శాతం నుంచి 70శాతం వరకూ పెంచి బ్యాంకింగ్, ఎల్ఐసీ, రక్షణ, రైల్వే, విమానయాన, తదితర భారీ సంస్థలను ప్రయివేటుకు అప్పగించేందుకు పూనుకుంటున్నారు. తాజా విద్యుత్ సంస్కరణలు సైతం ఆ విదేశీ సంస్థల మెప్పు కోసం తెస్తున్నవే తప్ప ఈ దేశ ప్రజల బతుకులు బాగుచేయడానికి కాదు. జీడీపీ రేటు పడిపోతున్నది. ద్రవ్యోల్బణం ఎగబాకుతున్నది. నిరుద్యోగిత రేటు తీవ్రస్థాయికి చేరుకుంది. ఇంతటి సంక్షోభంలో కూడా మోడీ సర్కార్ తేనున్న విద్యుత్ సంస్కరణలు ఈ దేశ ప్రజల బతుకులను మరింత దిగజార్చుతాయి. ఎత్తైన విగ్రహాలు, సెంట్రల్ విస్టాలు, రామ మందిర నిర్మాణాల మీదా ఉన్న శ్రద్ద ప్రజల సంక్షేమంపై ఈ ప్రభుత్వానికి లేకపోవడం విచారకరం. ప్రజల సంక్షేమం చూడని ఏ ప్రభుత్వం కూడా విగ్రహాలలో, కట్టడాలతో నిలబడదనే విషయాన్ని చరిత్ర ఇప్పటికే అనేక సార్లు రుజువు చేసింది. అందువల్ల ''దేశంలో అపారమైన సంపద ఉన్నా... వాటిని వాడే తెలివి లేని పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. వాళ్ల బ్యాడ్ ఇరిగేషన్ పాలసీ వలన, వాళ్ల బ్యాడ్ వాటర్ పాలసీ వలన... వాళ్ల బ్యాడ్ పవర్ పాలసీ వలన.. దేశాన్ని చీకటిమయం చేస్తున్నారు. వాళ్లకు సమజ్ కాదు, చెప్తే వినరు!'' అంటున్న కేసీఆర్ మాటలు వాస్తవమే కదా!