Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఏ దేశంలోని బడులలో పెచ్చులు ఊడిపడుతుంటాయో, ఏ దేశంలోని దేవాలయాలలో (గుడి, మసీదు, చర్చి) గాలిగోపురాలు(శిఖరాలు) బంగారంతో మెరుస్తూ ఆకాశాన్నంటు తుంటాయో... ఆ దేశం తనంతట తానే స్వయంగా నాశనం అవుతుంది'' అంటాడు సొక్రటీస్. అలాంటి పని ఇప్పుడు భారతదేశమంతటా శరవేగంగా జరుగుతోంది. దేశంలో మరుగుదొడ్లు లేని పాఠశాలలు అనేకం ఉండగా, విద్యాలయాల్లో దేవాలయాలూ, పెద్దపెద్ద విగ్రహాల నిర్మాణానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. అందుకే 'మనుష్యునకు మనోవైకల్యమును దెచ్చుటలో మతావేశము వంటిది వేరొకటి లేదు' అన్నాడెప్పుడో చిలకమర్తి.
ఈ వైకల్యాల సంస్కృతి ఇప్పుడు విద్యాలయాల్లోకీ ప్రవేశించింది. నిన్నా మొన్నటి వరకూ హిజాబ్ వివాదం కర్నాటకను అతలాకుతలం చేసింది. తాజాగా బెంగళూరు వర్సిటీ క్యాంపస్‌లో వినాయక ఆలయం నిర్మించాలని బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బిబిఎంపి) నిర్ణయించింది. విద్యా కేంద్రాలలో మతపరమైన చిహ్నాలు ఉండవద్దని భారతరాజ్యాంగం చెపుతుంటే, దానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి నిరసనగా క్యాంపస్‌లోని ప్రధాన కార్యాలయం ముందు గత మూడు రోజులుగా విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో గుడి నిర్మించవద్దని, లైబ్రరీ నిర్మించాలని డిమాండ్ చేస్తూ, వందలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఈ చర్య విద్యా వాతావరణానికి విఘాతం కలిగిస్తుందని యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్, రిజిస్ట్రార్ సహా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అయినా బిబిఎంపి నిరంకుశంగా వ్యవహరిస్తోంది. ప్రజలను మతతత్వం, కుల తత్వం నుంచి వేరు చేసి, లౌకికతత్వాన్ని అలవర్చడంలో విద్య కీలకపాత్ర పోషిస్తుంది. అయితే పాఠశాల స్థాయి నుంచే విద్యలో నిర్హేతుక భావాలను చొప్పిస్తున్నారు. దేశంలో బలంగా పాదుకొనిపోయిన లౌకిక వ్యవస్థను పెకలించేందుకు, విద్యతోపాటే మతతత్వాన్నీ విస్తరించేలా పావులు కదుపుతున్నారు. సామ దాన భేద దండోపాయాలను అమలుపరుస్తూ... అన్ని రకాల మాధ్యమాలను ఇందుకు సాధనాలుగా చేసుకున్నారు. అందులో విద్యాలయాలు కూడా మినహాయింపేమీ కాదు. 'ఒక సంస్కృతిని నాశనం చేయడానికి పుస్తకాలను కాల్చే పనిలేదు, జనాన్ని చదవకుండా చూడండి చాలు' అంటాడు అమెరికన్ రచయిత రే బ్రాడ్బరీ. ఇప్పుడు వీరు చేస్తున్నది అదే. కాకపోతే మరో పద్ధతిలో. ఇది చాలదన్నట్టు దేశంలో నూతన విద్యా విధానం పేరుతో చదువును భ్రష్టు పట్టిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. మానవాభివృద్ధి సూచికలో సైతం భారత్ స్థానం మరింత దిగజారింది. రెండేండ్ల క్రితం 131వ స్థానంలో ఉన్న దేశం ప్రస్తుతం 132వ స్థానానికి పడిపోయిందని ఐరాస విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
బడి అంటే కేవలం చదువు చెప్పే చోటు మాత్రమే కాదు, విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసే ప్రదేశం. అందుకే- 'సమాజం మతతత్వపూరితమైతే అప్పుడిక రాజకీయాలు, పోలీసు తదితర రాజ్య యంత్రాంగాలు సైతం అదే బాట పట్టే అవకాశం వుంది. కనుక సమాజాన్ని మతతత్వం నుంచి వేరుపరచడం లేదా ప్రజలకు లౌకిక విలువలను అలవరచడం బళ్లలోనే మొదలవ్వాలి' అంటాడు ప్రముఖ చరిత్రకారుడు బిపిన్ చంద్ర. కుల, మతాలను విద్యాలయాల నుంచి, రాజకీయాల నుంచి వేరు చేయడం, లౌకిక క్షేత్రాల్లోకి మతాన్ని చొప్పించకుండా నిరోధించడమనేది ఏ దేశానికైనా కీలకమైనది. అది ఏ మతమైనా కావొచ్చు. 'చదువు మనిషిని పూర్తి మానవుడిగా తీర్చిదిద్దుతుంది, చర్చ సంసిద్ధ మానవుడిగా తీర్చిదిద్దుతుంది, రాత కచ్చితమైన మానవునిగా తీర్చిదిద్దుతుంది' అని 16వ శతాబ్దినాటి బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు ఫ్రాన్సిస్ బేకన్ అన్నాడు. సమాజంలో మనిషి తలరాతను మార్చేది, బతుకుబాటను చూపేది చదువు మాత్రమే! ఆ చదువుకు పాఠశాల స్థాయిలోనే లౌకికతత్వంతో కూడిన బలమైన పునాదులు పడాలి. అప్పుడే విద్యాలయాలు దేశానికి వన్నె తెచ్చే భాగ్య విధాతలను తయారుచేసే కార్ఖానాలు కాగలుగుతాయి.