Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్‌లోని పురాతన నగరం సామరకండ్‌లో గురు, శుక్రవారాల్లో జరిగే పదిహేను దేశాల షాంఘై సహకార సంస్థ(ఎస్సిఓ) వార్షిక సమావేశం ప్రారంభమైంది. కరోనా తీవ్రత తగ్గిన(2019) తరువాత దేశాధినేతలు ప్రత్యక్షంగా పాల్గొంటున్న తొలి సమావేశమిది. చైనానేత షి జింపింగ్, భారత ప్రధాని నరేంద్రమోడీ, రష్యా అధిపతి వ్లదిమిర్ పుతిన్ ఈ సమావేశాల సందర్భంగా విడివిడిగా సమావేశం కానున్నారని వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్ సంక్షోభంలో మీరు మావైపు ఉంటారా పుతిన్ వైపు నిలుస్తారా తేల్చుకోవాలంటూ అమెరికా బరితెగించిన నేపధ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికాకు అండగా ఉన్న నాటో కూటమిలోని టర్కీ, తటస్థవైఖరితో ఉన్న భారత్, చైనాలు, రష్యాకు పూర్తి మద్దతు ఇస్తున్న ఇరాన్, బెలారస్ ఈ భేటీలో భాగస్వాములుగా ఉన్నాయి. అందువలన సంచలనాత్మక లేదా ఇప్పటికే ఉన్న వైరుధ్యాలను మరింతగా ఎగదోసే పరిణామాలు లేదా ప్రకటనలు ఉండవు. ఆసియా-ఐరోపా ఖండాలు కలిసే ప్రాంత దేశాలు ప్రధానంగా ఉన్న బృందమిది. ప్రపంచంలో అతి పెద్ద ప్రాంతీయ సహకార కూటమి.
ఈ బృందంలోని దేశాల ఉమ్మడి ఆర్ధికశక్తి అమెరికాకు సమానం.ప్రపంచంలో ఇంకా నిక్షిప్తంగా ఉన్నట్లు అంచనా వేస్తున్న చమురు, సహజవాయు నిల్వల్లో 45శాతం వరకు ఈ దేశాల్లోనే ఉన్నాయి. అమెరికా ఆధిపత్యంలోని నాటో కూటమి దేశాల్లో 6,065 అణ్వాయుధాలు ఉండగా, ఈ కూటమిలోని దేశాల్లో 6,928ఉన్నప్పటికీ సహకారం, భద్రతకు సై అంటున్నది తప్ప బస్తీమే సవాల్ అని ఎవరిమీదా తొడగొట్టటం లేదు. అందువలన ఈ కూటమిని విస్మరించటం ఏ దేశానికైనా అంత తేలిక కాదు. చైనా చొరవతో ఏర్పడిన ఎస్సీఓ ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో, దాని ప్రధాన కార్యదర్శి చైనీయుడే అయినా 2006 నుంచి పరిశీలక దేశాలుగా ఉన్న భారత్, పాకిస్థాన్ 2017లో సభ్య దేశాలుగా చేరాయి. ప్రతి ప్రాంతీయ కూటమిలో ఉన్నట్లే కొన్ని దేశాలకు పరస్పర విబేధాలు ఉన్నప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా కలిశాయి. ఇప్పటి వరకు ఉన్న ఎనిమిది పూర్తి సభ్యదేశాలకు సామరకండ్ సమావేశాల్లో ఇరాన్ తోడు కానుంది. తొలుత షాంఘై ఐదు అని పిలిచిన రష్యా, చైనా, కజకస్తాన్, కిర్ఖిజిస్తాన్, తజికిస్తాన్ మధ్య 1996లో అవగాహన కుదిరింది, తరువాత దాన్ని 2001లో షాంఘై సహకార ఆర్గనైజేషన్‌గా మార్చారు, అదే ఏడాది ఉజ్బెకిస్తాన్ చేరింది. మంగోలియా, బెలారస్, ఆఫ్ఘనిస్తాన్ పరిశీలక దేశాలు, శ్రీలంక, టర్కీ, కంపూచియా, నేపాల్, ఆర్మీనియాలు సంప్రదింపుల భాగస్వాములు కాగా ఆప్ఘనిస్తాన్‌లోని తాలిబాన్లను ఏ దేశమూ గుర్తించని కారణంగా అక్కడి నుంచి ప్రతినిధులెవరూ ఉండరు. అతిధులుగా ఐరాస, సిఐఎస్, ఆసియన్ సంస్థల ప్రతినిధులు, తుర్కిమెనిస్తాన్ ప్రతినిధులు ఉంటారు. దీన్ని మరింతగా విస్తరించేందుకు అవకాశం ఉంది.
షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల మధ్య భద్రతాపరమైన, మిలిటరీ, ఆర్థిక, సాంస్కృతిక సహకార లక్ష్యాలతో పని చేస్తున్నది. ఈ సంస్థలో అమెరికా బాధిత లేదా దాని పెత్తనాన్ని ఎదుర్కొనే దేశాల్లో ముందున్న చైనా, రష్యా, ఇరాన్, బెలారస్, కంపూచియా వంటివి ఉన్నందున అమెరికా లేదా పశ్చిమ దేశాల వ్యతిరేక కూటమిగా, తూర్పు దేశాల నాటోగా చిత్రించి జనాలను తప్పుదారి పట్టించి కొన్ని దేశాలను దూరం చేసేయత్నాలు లేకపోలేదు. కూటమి ఏర్పడిన 2001 నుంచీ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు దీన్ని తమ శత్రు కూటమిగా లేదా భూతంగా చిత్రించేందుకు చూసినప్పటికీ అది విస్తరిస్తూనే ఉండటం ఒక ప్రత్యేకత. సంస్థ స్ఫూర్తికి భిన్నంగా ఉందంటూ వెళ్లిపోయిన దేశమేదీ లేదు. సంస్థలోని దేశాల్లో ఎక్కువ భాగం పశ్చిమ దేశాల విస్మరణ, వివక్షకు గురైనవే కావటంతో కొన్ని అంశాల మీద స్పష్టమైన వైఖరిని ప్రకటించటం తప్ప శత్రుకూటములను గట్టటం, ఘర్షణకు దిగటం, మూడోపక్షానికి ముప్పుతెచ్చే పనికి ఇంతవరకు పూనుకోలేదు. ఇదే దాని విజయ రహస్యం.
ఉక్రెయిన్ సంక్షోభం ఇంథన సరఫరా, ఆహారం, రవాణా-సరఫరా సమస్యలను ముందుకు తెచ్చిన నేపథ్యంలో సామరకండ్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రపంచాధిపత్యం కోసం చూస్తున్న అమెరికాను సవాలు చేసే ప్రతిదేశం మీద ఏదో విధంగా కత్తిగట్టి దెబ్బతీసేందుకు చూస్తున్నదానిలో భాగమే ఈ సంక్షోభం. ఆహారం, ఇంథనాలను కూడా తమ అస్త్రాలుగా ఉపయోగించేందుకు పూనుకున్న పశ్చిమ దేశాలకు అవే అస్త్రాలు ఎదురు తిరగటంతో దిక్కుతోచటం లేదు. దానికి భిన్నంగా సహకారం, సమానత్వ ప్రాతిపదిక మీద పనిచేస్తున్న షాంఘై సహకార సంస్థ సామరకండ్ సమావేశం వీటిపై కేంద్రీకరించే అవకాశం ఉంది. ఆమేరకు చర్చలు ఫలించాలని కోరుకుందాం.