Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పృష్టతాడనాత్ దంత భంగః' గురించి నిజంగానే 'బండి'వారికి తెలియదా? వెనకాల ఒక తన్ను తంతే పళ్ళు ఆటోమేటిక్‌గా రాలిపోవు. అయినా మన ఎంపీ గారి సౌకర్యార్థం... నడ్డి మీద తంతే ఆ తావుకి ఆ తన్న బడ్డ 'శాల్తీ' బొక్కబోర్లా పడ్తే పళ్ళురాలతాయని దాని అర్థం, తాత్పర్యం. ఈ విషయం తెలియకుండానే పాలక బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిపోయారనుకోలేం!
మొన్న నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రలో నడుస్తూ, మహిళలతో సెల్ఫీలు దిగుతూ సంజయ ఉవాచేమంటే (భగవద్గీతకారుడు క్షమించాలే!) మోటార్లకు మీటర్లు పెట్టాలని (విద్యుత్ సవరణ బిల్లులో) ఎక్కడుంది? అంటూ కేసీఆర్‌కు ఓ ప్రశ్న సంధించాడు. అక్కడితో ఆగుంటే బాగుండేది. కేసీఆర్ చెప్పింది అబద్ధమని రుజువు చేయలేకపోతే తన పదవి (పార్లమెంట్ సభ్యత్వమో, రాష్ట్ర అధ్యక్షుల పోస్టో తెలీదు కాని!) వదిలేస్తానంటూ మరో భీష్మ ప్రతిజ్ఞ కూడా చేసేశారు. సంజరు సాబ్! జర పైలం!
కేసీఆర్ అసెంబ్లీలో పాత పేపర్లే చూపించారనుకుందాం. మీ దగ్గరున్న కొంగ్రొత్త బిల్లులో ఏముంది? సంజయుల వారికి అర్థం కావల్సిన విషయమేమంటే శ్రీమాన్ వాజ్పారుగారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న 2003 విద్యుత్ చట్టమే దేశ, విదేశీ పెట్టుబడిదార్ల కోసం చేయబడింది. దాని అమలుకు పెట్టుబడి మానస పుత్రుడు, కార్పొరేట్ల ఇష్టసఖుని ఆధ్వర్యంలో 2014 నుండే ప్రారంభమైన ప్రయత్నాలు 2022కి ఒక ''కొలిక్కొచ్చాయి.'' ''దాల్ మే కుచ్ కాలాహై'' అని పసికట్టిన ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు మాత్రం 2014కు ముందునుండే సమ్మెలు, పని బంద్ పెట్టడాలు వంటి ఎన్నో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వామపక్షాలు వారికి మొదటి నుండీ అండదండలిస్తూనే ఉన్నాయి. దెబ్బలు తగిలి తలలు బొప్పికట్టే కొద్దీ అనేక రాజకీయ పార్టీలు వారికి సాత్దార్ ఇస్తూ నిలుస్తున్నాయి. అసలీ విధానానికి అంకురార్పణ చేసిన కాంగ్రెస్, దాన్ని ఉధృతంగా ముందుకు తీసికెల్తున్న బీజేపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు కారణాలేమైనా ఏదో ఒక సందర్భంలో దాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాయి.
ఆలస్యంగానైనా మేల్కొన్న కేసీఆర్ మొన్న అసెంబ్లీలో ''క్రాస్ సబ్సిడీల కత్తిరింపులు'' ఈ సవరణ బిల్లులో ఉన్నాయన్నారు. తప్పుసార్! 2003 విద్యుత్ చట్టంలోనే ఇది ఉంది. ''ఓపెన్ యాక్సెస్'' గురించి కూడా దాన్లోనే ఉంది. ఈ రెంటి సారాంశం ఎవరైనా సంజయుల వారికి వివరించి పుణ్యం కట్టుకోండి. పెద్ద వినియోగదారులో, అంటే పెద్ద, పెద్ద పరిశ్రమలో, లేదా పరిశ్రమల గుంపో, లేదా ఏ అబిడ్స్‌లోని పెద్దషాపింగ్ మాల్స్ వారంతా కలిసో డిస్కాంల నుండి కాకుండా సీదా ఒక ప్రయివేటు ఉత్పత్తిదారు నుండి విద్యుత్ కొనుగోలు చేయొచ్చు. సదరు ఉత్పత్తిగారు మిజోరామ్లోని హైడల్ ప్రాజెక్టు కావచ్చు. గుజరాత్‌లోని అదానీ సోలార్ ప్రాజెక్టు కావచ్చు! అంత దూరం నుండి కరెంటు కొన్నా కేవలం మధ్యలో ఉన్న రాష్ట్రాలకు ''వీలింగ్ ఛార్జీలు'' అంటే వారి తీగల్లో నుండి ప్రవహించిన కరెంటుకు కొద్దిగా కిరాయి చెల్లిస్తారు. రైల్వేలు, ఎల్.టి, హెచ్.టి పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులు అధిక చార్జీలు చెల్లిస్తే, గృహ వినియోగదారులు ఆ మోతాదులో చెల్లించరు. వ్యవసాయ వినియోగదారులు మన తెలంగాణలో ఉచితంగా పొందుతున్నారు. సగటున వచ్చే ఆదాయంతో జనరేషన్ కంపెనీలు బతికి బట్టకడుతున్నాయి. దీన్నే కాస్ర్ సబ్సిడీ అంటున్నాం. ఇవి పోతే అంటే ఓపెన్ యాక్సిస్ వల్ల గృహ, వ్యవసాయ వినియోగదార్లపై భారం పడుతుంది. వ్యవసాయ కరెంటూ ఉచితంగా రాదు. మీటర్లు పెట్టమని బిల్లులో ఉందా? లేదా? అనే దాంతో సంబంధమేముంది?
అమ్మిన ప్రతి యూనిట్ కరెంటుకూ ''డబ్బు రాబట్టాలి'' అని ఈ సవరణ బిల్లులో ఉంది. రాబట్టాలంటే దాన్ని ''కొలవాలి.'' కొలుచుడంటే మీటర్లు పెట్టకుండా సాధ్యమేనా? దీన్నే ''పృష్టతాడనాత్ దంత భంగః'' అన్నది. ఈ 'సవరణ బిల్లు' ద్వారా మోడీసాబ్ ఒకేదెబ్బకి ఎన్ని పిట్టల్ని కొట్టాడంటే - తప్పనిసరిగా 10శాతం విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవాలట! నీ 'సింగరేణి బొగ్గు, నీ తాల్చేర్ బొగ్గు, నీ కోలిండియా బొగ్గు ఉన్నా విదేశీ బొగ్గు కొనాలి. అంటే ఆస్ట్రేలియాలోని అదానీ బొగ్గు గనుల బొగ్గు కూడా కావచ్చు. పైగా పునరుత్పాదక (రెన్యువబుల్) విద్యుత్‌ను తప్పనిసరిగా ప్రతిరాష్ట్రమూ 20శాతం తగ్గకుండా కొనాలి. అంటే ఏ చెత్త నుండి ఉత్పత్తి చేసేదో కాదు. అదానీ 'భగవానుడి' సోలార్ విద్యుత్. 2003 విద్యుత్ చట్టంలో ఇది 5శాతం అని ఉంటే మోడీ సాబ్ 'సవరణ బిల్లు' 20శాతానికి పెంచింది. రేపు ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు. మోడీ సాబ్ కొట్టే పిట్టల్లో చివరిదీ, కీలకమైంది... ఆఖరికి రాష్ట్రాల జనరేషన్ స్టేషన్లు బంద్ పెట్టుకోవాల్సి వస్తుంది.
ఈ బిల్లు రాష్ట్రాల హక్కులకు భంగం. సామాన్య వినియోగదారులకు, వ్యవసాయానికి నష్టం. దాన్ని గమనించకుండా మోటార్లు, మీటర్లు అంటూ కతలు చెప్తే నడవదు బీజేపీ నేతలారా! ఈ సందర్భంగా కేసీఆర్ ఒక విషయం గమనంలో ఉంచుకోవాలి. నిన్న ఏప్రిల్ ఒకటి నుండి రూ.5596కోట్లు విద్యుత్ చార్జీలు పెంచి, ట్రూ అప్ పేరున మన రాష్ట్ర ప్రజల మెడ మీద రూ.4092 కోట్లు కత్తి వేలాడదీసి కేంద్రంపై వేళ్ళు చూపితే ప్రజలు మీతో నిలబడటం కష్టం. ఇప్పటికైనా ప్రజల్ని కదిలించి ప్రతిపక్షాల్ని కలుపుకుని కేంద్రంపై యుద్ధానికి సన్నద్ధమైతే మంచిది. దానికి ప్రజలపై భారాలు మోపడం సరికాదు.