Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''దొరకాడికి పోయి రావాలి. గడీల పనులు చానావున్నాయి. తమ్మున్ని చూడుబిడ్డా! ఏడిస్తే ఇన్ని గంజినీళ్లు పట్టు. ఎత్తుకుని ఊకుండ బెట్టు'' అంటూ పాలకేడ్చే పిల్లల్ని వొదిలి రెక్కలు ముక్కలు చేసుకునే చెల్లి చంద్రమ్మలెందరో తెలంగాణ నేలపైన నాడు రోదనకు గురయ్యారు. చెప్పులు చేతబట్టుకుని, తలవంచుకుని ''దండాలయ్యా! నీ బాంచను కొల్మొక్తా! మీరు సెప్పినట్లే ఇంటా!'' అనే సామాన్యుల దీనాలాపనలూ నాడు పల్లెపల్లెలో కనిపించే దృశ్యాలు. 'మాభూమి' సినిమా చూడండి ఒకసారి. డెబ్భఐదేండ్ల క్రితం నిజాం సంస్థానం ఏలుబడిలో జమీందారులు, జాగీరుదారులు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు, సామాన్య ప్రజలను బానిసలుగా చూస్తూ వారితో వెట్టి చేయిస్తూ, కులం పేరుతో హీనంగా చూస్తూ ఎన్ని దారుణాలు! ఎన్నెన్ని అఘాయిత్యాలు! ఎన్ని హత్యలు, అత్యాచారాలు! వందల, వేల ఎకరాల భూములను తమ సొంతం చేసుకుని రైతులతో చాకిరీ చేయిస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్న జమీందారులు నాటి నైజాం రాజుకు తొత్తులుగా మారి జనాన్ని కాల్చుకుతిన్నారు. నిజాం విధించే పన్నులు, నిర్భంధాలు, వెట్టి, అణచివేతలు భరించలేక ప్రజలు అల్లల్లాడిపోయారు.
ఎక్కడ అణచివేత ఉంటుందో, ఎక్కడ దోపిడీ తీవ్రమవుతుందో అక్కడ తిరుగుబాటు తప్పదనే మార్క్స్ మహనీయుని సూత్రం ఇక్కడా నిజమైంది. ఆంధ్ర మహాసభ, సంగం పేరుతో నిరసన మొదలైంది. ప్రజల గుండెల్లో రగులుతున్న ప్రతీకార జ్వాలను అవగాహన చేసుకున్న కమ్యూనిస్టులు రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి నాయకత్వం వహించారు. 1946 నుండి 1951 వరకు ఐదేండ్లూ సాయుధ పోరు కొనసాగింది. దొడ్డి కొమరయ్య తొలి బలిదానంతో ఈ ఉద్యమ జ్వాల ఉధృతమయింది. తెలంగాణ విముక్తి గీతాలాపన చేసింది. బాంచన్ దొరా అన్న గొంతులు బందూకు పట్టి, యుద్ధక్షేత్రంలో యోధులుగా ముందుకురికారు. ప్రాణాలు త్యాగం చేశారు. భూమికోసం, భుక్తికోసం పీడన విముక్తికోసం ఎర్రజెండా నీడలో మహత్తర పోరాటాన్ని కొనసాగించారు. ఉద్యమం బలోపేతమై మూడు వేల గ్రామాలను విముక్తమొనర్చారు. పదిలక్షల ఎకరాల భూమిని రైతులకు పంచారు. వెట్టిచాకిరి, కులపీడనకు చమరగీతం పాడారు. సమస్త భారతావని తెలంగాణ పోరాట చైతన్యానికి అబ్బురపడింది. 1947 ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్య్రమొచ్చినా తెలంగాణ మాత్రం స్వేచ్ఛకోసం పోరాడుతూనే ఉంది. ఇక్కడ అరుణకాంతి రెపరెపలను పరికించిన నాటి కేంద్ర ప్రభుత్వం, కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని చూసి బెంబేలెత్తింది. ఆందోళన చెందింది. ఆనాడు హౌంమంత్రిగా ఉన్న వల్లభారు పటేల్ ఆధ్వర్యంలో సంస్థానంపై సైనిక చర్యకు పూనుకున్నారు. ఏ ప్రతిఘటనా లేకుండానే 1948 సెప్టెంబర్ 17న నైజాం నవాబు లొంగిపోయాడు. కానీ సైన్యం నవాబును నిర్భంధించిందిలేదు. అతన్ని 'రాజ్ ప్రముఖ్'గా కేంద్రం ప్రకటించి, అతని ఆస్తులకు కాపలాకాసింది. రజాకర్ అరాచకానికి నాయకత్వం వహించిన ఖాసిం రజ్వీని క్షేమంగా బయటకు సాగనంపింది. కమ్యూనిస్టులపైన, ఉద్యమించిన జనంపైన కేంద్ర సైన్యం ఉక్కుపాదం మోపి వేలాదిమందిని ఊచకోతకోసింది. అయినా బెదరక పోరుముందుకే సాగింది. ఇవి చరిత్రలోని కొన్ని ముఖ్య ఘటనలు.
ఇప్పుడేమో కొందరు విద్వేష రాజకీయులు చరిత్ర సత్యాలను తలక్రిందులు చేసి, మసిపూసి అబద్ధ ప్రచారాలతో ఆర్భాటం చేస్తున్నారు. అసత్య వాక్చాతుర్య దురంధరుల మూర్ఖపు విన్యాసాలు మహా వెగటు పుట్టిస్తున్నాయి. మతతత్వ బురదలో బొర్లాడే విచ్ఛిన్నకులు ఇంతకంటే ఏం చేయగలుగుతారు! కేవలం, అధికారం కోసం ఎన్ని జిమ్మిక్కులయినా చేయటానికి వెనుకాడని వారికి, చరిత్రను వక్రీకరించడం కుటిలత్వానికి పుట్టిన విద్య. ఇక్కడ ఎవరైనా, ఏ రాయినైనా తట్టి చూడండి... చరిత్రను కళ్లముందు విప్పుతుంది. ఎర్రజెండా వారసత్వాన్ని నినదిస్తుంది. 'ఈ పల్లెల వీధులలో, నాపరాళ్ల నడిగి చూడు, కంపర మెత్తించు కథల, కన్నీటితో వచిస్తాయి' అని పాడిన హరీంద్రుని నాటి పాటలా మార్మోగుతూనే ఉంటాయి. బైరాన్‌పల్లికి వెళ్లిరా త్యాగాలెవరివో తెలిసొస్తుంది. కడివెండిని కదిలించి చూడు! రక్తధార గుర్తులింకా చెరిగిపోలేదు. పాలకుర్తిని పలకరించు! సూర్యాపేటను చుట్టిరా! పెంచికల్ దిన్నె కెళ్లావా! గుండ్రాంపల్లె, పిండిప్రోలు, బోనగిరి, కొలనుపాక, నల్లగొండ గుండెను కదిలించిచూడు... అమరుల స్థూపాల చెంత వినమ్రంగా తలను వంచు... వీరులెవరో వినిపిస్తుంది. త్యాగాల రాగం వీనుల కెక్కుతుంది. రాజకీయ చైతన్యం నిండిన తెలంగాణలో మత విద్వేషానికి ఆనాడూ చోటులేదు. నేడూ అనుమతించబోదు. ఎన్ని కుయుక్తులు చేసినా పోరు వారసత్వాన్ని మార్చలేరు. మతతత్వ శక్తుల దురాలోచనలేకాక అస్తిత్వ వాదుల అపసవ్యవాదనలు కూడా చెల్లుబాటు కాజాలవు. ఎర్రజెండా ప్రాభవంతోనే దేశంలో రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ఒనగూడిన కనీస ప్రయోజనాలను, పొందిన ప్రజాతంత్ర హక్కులను గుర్తించ నిరాకరించేవారి అజ్ఞానానికి చరిత్ర సమాధానం చెబుతుంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి జేజేలు పలుకుతుంది.