Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కొండంత రాగం తీసి...'' అని ఏదో అన్నట్లు నిన్నటి పెద్ద కొత్వాలుగారి సభ వెలవెలబోయింది. గంపెడాశతో పెట్టిన సభ అది. ''చిత్తం శివుడి మీద... భక్తి చెప్పుల మీద'' అన్నట్లు, పెరేడ్ గ్రౌండ్ ఊపుతో మునుగోడుకు నిచ్చెన వేయాలనుకున్నారు. అక్కడి నుంచి తెలంగాణలో అధికార పగ్గాలందుకోవాలనుకున్నారు. ఫ్లాప్‌షోగా ముగియడంతో పెద్దాయన అందరికీ క్లాసుపీకి వెళ్ళినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. అయినా, ''వద్దన్న వారితోనే ఉత్సవాలు జరిపించామని మరో అమాత్యులవారు పొంగిపోతున్నారు. బీజేపీ ఎజెండాలోకి కేసీఆర్ వెళ్ళాల్సి వస్తోందని నిన్నొక బ్యానర్ కథనం అల్లిందొక పత్రిక. కిషన్‌రెడ్డిగారి ఆనందం టీఆర్ఎస్తో జరిపించామని కాబోలు! కమ్యూనిస్టులు ఈ సాయుధపోరును మరిచిపోయింది ఎన్నడు? అది ప్రారంభమైన జులై 4ను, ఐలమ్మ వర్ధంతిని, షోయబుల్లాఖాన్ జయంతిని, ఆ పోరాటంలో పాల్గొన్న ఎందరో మహానేతల జయంతులు, వర్థంతులను కమ్యూనిస్టులు జరుపుతూనే ఉన్నారు. ఆసేతు హిమాచలం ఏ కమ్యూనిస్టు కార్యకర్తని కదిలించినా తమని తాము తెలంగాణ సాయుధరైతాంగ పోరాట వారసులుగా పరిగణించుకుంటారు. కుటుంబ సభ్యులైనా కొంతకాలనికి వారి స్మృతిపథం నుండి తొలగిపోతారేమోగానీ ఈ మహత్తరపోరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. సెప్టెంబర్ 17 ''విమోచన'' పేరుతో అధికార ప్రాప్తికి అడ్డదారిని రహదారిగా చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. అందుకే వాస్తవాల రికార్డును సరిగా నిలబెట్టేందుకు కమ్యూనిస్టులు పూనుకున్నారు.
'కైవల్య సిద్ధి'కి పరివార నేతలు ఎంచుకునే మార్గాలు ''అమోఘం!'' తెలుగులో ''కాళ్ళు, జుట్టు'' నానుడి కన్నా, ఇంగ్లీషోడి ''క్యారెట్ అండ్ స్టిక్'' సిద్ధాంతమే వారికి బాగా ఒంటబట్టినట్టుంది! ప్రాంతీయ పార్టీలకు వాటికున్న స్వభావరీత్యా తమ రాష్ట్రాల్లో తమకి అధికారం నిలబడి ఉండేందుకు ఢిల్లీతో అంటకాగుతాయి. నేడు ఐటి, ఈడి, సిబిఐ వంటి అస్త్ర శస్త్రాలతో రాజకీయ రంగంలో స్వైర విహారం చేస్తున్న బీజేపీ ఈ పార్టీలను మచ్చిక చేసుకుని లొంగదీసుకోవటం, కొరుకుడుపడక పోతే విచ్ఛిన్నం చేసి ఆక్రమించుకోవడం చూస్తున్నాం. ''ఆత్మానుభవమైతేనే తత్వం బోధపడుతుందన్న''ట్టు ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ ఆ విషకౌగిలి నుంచి బయటపడు తున్నాయి. టీఆర్ఎస్కు ముందే అర్థమైనట్లుంది.
కమ్యూనిస్టులకు తప్ప మిగిలిన పార్టీలకు సరళీకృత ఆర్థిక విధానాలపై ఏకాభిప్రాయముంది. వాటి అమలు గురించి ఈ పార్టీలకు ఏ పట్టింపూ లేదు. పెద్దనోట్ల రద్దునూ, జీఎస్టీని టీఆర్ఎస్ ఆహ్వానించి ఆ తర్వాత నాలిక్క కరుచుకోవడం ఇటీవలి అనుభవం. కానీ ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థనుత నేడు మాంద్యం దిశగా నడుపుతున్నవి ఆరెండే! కొన్ని రాష్ట్రాలను మెత్తపరిచిన బీజేపీ నేడు రాష్ట్రాల హక్కులపై దాడికి ఉపక్రమించింది. రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయాన్ని, ఉమ్మడి జాబితాలోని విద్య, విద్యుత్‌లను కబ్జాచేయడానికి తెగబడింది. ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతింటున్నది. రాజ్యాంగానికి మౌలిక ఆలంబనైన ఆర్థిక స్వావలంబన, లౌకికతత్వం, సామాజిక న్యాయం, ఫెడరలిజం ధ్వంసమయిన తర్వాత అది కరిమింగిన వెలగపండులా మిగులుతుంది. ఆ శిథిలాల మీదే ఆరెస్సెస్ కలల రాజ్యం నిర్మించబడుతుంది.
మొన్న అమిత్‌షా తమ శ్రేణులకు ''మనం అధికారంలోకి రావడం ఖాయమనే'' గ్యారంటీ ఇచ్చివెళ్ళారు. తెల్లవార్లూ వారి ఆలోచనంతా బీజేపీ యేతర రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమెలాగనే! అందుకు కష్టపడి పనిచేసి ఆయా పార్టీలను ఓడించి తామధికారంలోకొచ్చే ప్రజాస్వామ్య ఆలోచనలు చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. టీఆర్ఎస్తో హనీమూన్ నడిచినన్నేళ్ళూ ''విమోచన'' దినమూ గుర్తురాలేదు. కేంద్ర ప్రభుత్వమే అధికారయుతంగా దాన్ని పండగ జేసుకోవడమూ గుర్తుకురాలేదు. 'వడ్లగింజలో బియ్యపు గింజ' అనుకుంటాం గాని, వడ్లగింజతో ప్రారంభమైన పంచాయతీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదేసే మార్గాలన్వేషించేదాకా వచ్చింది.
తమకు అడ్డుపడే ఏ రాష్ట్ర ప్రభుత్వమూ బతికి బట్టకట్టకూడదనేది వారి ప్రయత్నం. దాని కోసం బీజేపీ ఎజెండా సెట్ చేసింది. ఇది బహిరంగ రహస్యమే! ''మునుగోడులో రాజగోపాలరెడ్డిని గెలిపించండి! మేము ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తామ''ని మనుగోడు బహిరంగ సభలోనే ''నంబర్ టు'గారు చెప్పారు. ఆ 'హామీ' వెనుక భరోసా ఏంటి? వాళ్ళిద్దరున్నారు. వాళ్ళకిద్దరున్నారు. ఆ ఇద్దరికీ దోచిపెట్టిన దేశ సంపదుంది. దాని కోసం ఆశపడే నాలుకలున్నాయి. వారికివ్వడానికి కావల్సినన్ని కాంట్రాక్టులున్నాయి. ఎన్నో ప్రభుత్వాలను నమిలి మింగిన రక్తపు మరకలు ఇంకా ఆరని నోళ్లున్నాయి. గతంలో ఆ గడ్డిమేసిన పెద్దలు కొందరింకా నెమరేస్తునే ఉన్నారని చూపగలిగిన 56 అంగుళాల ఛాతీలున్నాయి! 'హిందూ రాష్ట్ర'మంటే హిందువులదనుకునేరు. అది కార్పొరేట్లది! దానిలో జిన్నా మనవడు నుస్లీవాడియా లాంటివారూ ఉంటారు! పారా హుషార్!