Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు...' అన్నారు పెద్దలు. ఇదే కోవలో రాష్ట్రంలోని భూ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామంటూ చెప్పిన ప్రభుత్వం... అందుకోసం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. అయితే అది సరైన ఫలితాలను ఇవ్వకపోవటంతో ఇప్పుడు అన్నదాతలు కడగండ్ల పాలవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రతీ సోమవారం జిల్లా కలెక్టరేట్లలో ప్రజావాణి నిర్వహిస్తున్న క్రమంలో... ఈసారి పలు జిల్లాల్లో ఇలాంటి ఘటనలే వెలుగు చూడటం గమనార్హం. తమ భూములను ఇతరులు ఆక్రమించు కుంటున్నారంటూ అధికారులకు మొరపెట్టుకున్నా... ఫలితం లేకపోయిందంటూ ఒకేరోజు నలుగురు రైతులు ఆత్మహత్యకు పూనుకోవటాన్నిబట్టి సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వలసెళ్లిన వారి భూమిని కబ్జా చేయటం, ఒకరి భూమిని మరొకరు ఆక్రమించుకోవటం, ఒకరి పేరిట ఉన్న భూమిని మరొకరి పేరిట రికార్డుల్లోకి మార్చుకోవటం తదితర కారణాల రీత్యా... బాధితులు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను ఆశ్రయించటం, వారు పోలీసులను ఆశ్రయించాలంటూ సూచించిన దరిమిలా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటం వ్యవస్థలో ఉన్న డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్నది.
ఇలాంటి సమస్యలు, చిక్కు ముడులను విప్పేందుకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం చురుగ్గా కదలాల్సిన అవసరాన్ని 'ప్రజావాణి...' మరోసారి నొక్కి చెప్పింది. వాస్తవానికి సెప్టెంబరు 2020లో ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన 'భూమి హక్కులు, రికార్డులు- పాస్ పుస్తక చట్టం 1971' సవరణ చట్టంలోనే ఈ విషయాలన్నింటినీ ప్రస్తావించారు. హక్కుల రికార్డులను డిజిటల్ పద్ధతిలో నిర్వహణ, పట్టాదారుల పేర్లు పాస్ పుస్తకాల్లో నమోదు తదితరాంశాలను చేర్చటానికి వీలుగా ధరణి వెబ్‌సైట్‌ను రూపొందించామంటూ ముఖ్యమంత్రి ఆ సందర్భంగా స్పష్టం చేశారు. తద్వారా రెవెన్యూ చట్టాన్ని రైతులకు అనుగుణంగా మారుస్తామంటూ ఆయన వెల్లడించారు. కానీ ఆచరణలో అవేవీ అమలు కావటం లేదు. మరోవైపు ధరణిలోని లోపాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సైతం అందులో 20 తప్పులున్నట్టు గుర్తించింది. వాటిని సవరించాలంటూ విజ్ఞప్తి చేసింది.
కానీ ఇప్పటి వరకూ అవేవీ జరిగిన దాఖలాల్లేవు. ధరణిపై అనేకసార్లు సమీక్షల మీద సమీక్షలు చేసినట్టుగా పైకి కనబడుతున్నా ప్రభుత్వ పెద్దలు మూలాల్లోకి వెళుతున్నట్టు కనబడటం లేదు. ఆ క్రమంలోనే అనేక తప్పిదాలకు, వివాదాలకు అవి కేంద్ర బిందువులవుతున్నాయి. దీంతో విసిగిపోయిన బాధితులు పురుగు మందుల్ని, పెట్రోల్ డబ్బాల్ని ఆశ్రయిస్తున్నారు. వారి సమస్యను గుర్తించి సరి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై ఉంటుంది. వారు చేసిన పొరపాట్ల వల్ల లోపాలు తలెత్తితే రైతులు, బాధితుల నుంచి ఎలాంటి ఫీజునూ వసూలు చేయకుండానే పరిష్కారం చూపాలి. నిర్దిష్టకాలంలో పొరపాట్లను సరిచేసి వాస్తవ హక్కుదార్లకు పాసుపుస్తకాలను ఇవ్వాలి. ఆఫీసుల చుట్టూ తిప్పించుకోకుండా దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ రికార్డులు సరి చేసి పాసు పుస్తకాలు పంపిణీ చేయాలి.
కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ, అసైన్మెంట్ భూములు, దేవాదాయ భూములు అన్యాక్రాంతమవుతున్నా సర్కారు చోద్యం చూస్తున్నదే తప్ప ఇతమిద్దంగా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ఫలితంగా కబ్జాలు, భూ ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా భరించలేని బాధితులు అయితే తామే పెట్రోల్ పోసుకోవటమో... లేదంటే అధికారులపై పెట్రోల్ పోసి నిప్పంటిచటమో చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ వాంఛనీయం కాదు. సర్కారు తక్షణమే తగు చర్యలు చేపట్టాలి. రెవెన్యూ శాఖకు సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఇలాంటి భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు ఆయన ప్రత్యేక చొరవ చూపాలి. ఇప్పటికే తమ దృష్టికి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. తాజాగా వెలుగులోకి వచ్చిన వాటికి సైతం పూర్వాపరాలు విచారించి... పరిష్కారమార్గాలు వెతకాలి. లేదంటే ఇప్పుడు జరిగిన ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి.