Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో మళ్లీ జరిగిన అఘాయిత్య సంఘటన దేశాన్ని కుదిపేస్తోంది. తమోలీ పూర్వా గ్రామంలోని చెరకు తోటలో ఇద్దరు దళిత సోదరీమణులుపై అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. ఆపై చెట్టుకు ఉరివేసి హత్యచేశారు. ఇవి మరుక ముందే మరో బాలికపై లైంగిక దాడి చేసి, పెట్రోల్ పోసి దహనం చేశారు. ఈ కేసులలో అరెస్టు చేసిన నింధితులను కూడా విడుదల చేసేందుకు, పైగా వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. దీన్నిబట్టి బీజేపీ పాలన ఎంతటి క్రూరత్వాన్ని కలిగివుందో అర్థం అవుతోంది. నిర్బయ సంఘటన జరిగినప్పుడు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు గాజులు పంపిన ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించారు. బీజేపీ పాలనలో 'బేటీ బచావో, బేటీ పడావో' నినాదంలోని మర్మం ఇదేనా? దేశంలో మహిళలపై అందులో పసికూనలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు, అరాచకాలకు అంతులేదు. పసిపిల్లల నుంచి పండుటాకుల దాకా అత్యాచార బాధితులే. లైంగిక దాడి కేసులు వేల సంఖ్యలో నమోదు కావటమే ఇందుకు నిదర్శనం. ఈ సంఘటలు దేశంలో సామాజిక సంక్షోభానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. లఖింపూర్ ఖేరీలో లాగా మైనర్లకు సంబంధించిన కేసుల్లో మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమైన పదవుల్లో ఉన్న రాజకీయ నేతలు మహిళలపై అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నప్పటికీ బీజేపీ అధినాయకత్వం వారిపై ఎలాంటి చర్యలకూ పూనుకోలేదు. పైగా వారిని రక్షిస్తున్నారు. ఇది యూపీలో మహిళలపై నేరాలు జరుగుతును పరిస్థితులకు అద్ధం పడుతున్నది.
ఎన్‌సిఆర్‌బి ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 56,093 కేసులతో, దళితులు, మహిళలపై అత్యధిక నేరాలలో యూపీదే అగ్రస్థానం. దేశంలో దళితులపై జరుగుతున్న నేరాల్లో యూపీ 26 శాతం, రాజస్థాన్ (14.7 శాతం), ఎంపి (14.1 శాతం)లు ఉన్నాయి. సామూహిక లైంగికదాడి, హత్య కేసులు 218 ఉన్నాయి. ఈ విభాగంలోనూ 48 నేరాలతో యూపీ అగ్రస్థానంలో ఉంది. మహిళలు, ముఖ్యంగా దళిత స్త్రీలకు భద్రతలేని రాష్ట్రం యూపీ అని న్యాయబద్ధమైన అభియోగమే ఆ రాష్ట్రంపై ఉంది. దాన్ని మరింత బలపరుచుకునేలా నేటి ప్రభుత్వ చర్యలుంటున్నాయి. ఇటివల లఖీంపూర్ ఖేరీలో దళిత అక్కాచెల్లెళ్లపై లైంగికదాడిచేసి, వారిని చెట్టుకు వేలాడదీశారు. ఈ ఘటన మరువకముందే అదే తరహ ఘటనలు అదే రాష్ట్రంలో మరో రెండు చోటు చేసుకున్నాయంటే.. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయా ఘటనల నింధితులను అధికార పార్టీ నేతలే కాపాడటం అత్యంత దారుణం. నిస్సిగ్గుగా అక్కడి బీజేపీ నేతలు ''లైంగికదాడికి బాధిత మహిళలే కారణమంటూ'' చేస్తున్న వ్యాఖ్యలు జుగుప్సాకరం. ఇలాంటి ఘటనలో శిక్ష పడిన నేరస్తులనే విడుదల చేయాలని నిరసన ర్యాలీలు, ధర్నాలకు దిగిన చరిత్ర కలిగిన పార్టీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు కాక మరేం వస్తాయి. బిల్కిస్ బానో కేసులో విడుదలపైన నింధితులకు మిఠాయిలతో స్వాగతం పలికిన ఘనత వహించిన నేతలు వారు. ''హత్రాస్‌లో యువతిపై క్రూరమైన సామూహిక లైంగికదాడి, హత్య జరిగిన తర్వాత హైకోర్టు జోక్యం చేసుకునేంత వరకూ కేసు నమోదు కాలేదు. బీజేపీ నాయకుడు రాజీవ్ శ్రీవాస్తవ.. బాధితురాలిని 'ఆవారా' అనీ, నిందితులు అమాయకులు'' అని వ్యాఖ్యలు చేశాడు. అతనిపై ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకున్నది లేదు.
2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళా వివక్షత, కుల, మతతత్వ భావజాలాన్ని ప్రోత్సహించటం చూస్తున్నాం. నేరస్థుల కులం, మతం కారణంగా అత్యంత ఘోరమైన నేరాలకు శిక్ష తగ్గుతుంది. చిన్న పిల్లలపై లైంగికదాడులు వార్త వినని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ వరుస సంఘటనలను చూస్తే దేశంలో ప్రజాపాలన ఉందా? లేక ఆటవిక పాలనలో ఉన్నామా అన్న సందేహం కలుగక మానదు.
మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన కేసులు ఎక్కువగా నమోదైంది బీజేపీ నేతలపైనే. పార్లమెంటు సభ్యుల్లో గత పదేండ్లలో 85శాతం కేసులు పెరిగాయి. అందులో ఎక్కువమంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలుండటం గమనార్హం. మహిళలపై లైంగిక దాడులు, దారుణాలకు పాల్పడుతున్నట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న వారు చట్టసభలకు ఎన్నికవడం సిగ్గుచేటు. ఇలాంటివారు ప్రజాస్వామ్యానికే తలవంపు. చట్టం ముందు అందరూ సమానమేననీ, దోషులను శిక్షిస్తామని సంఘటన జరిగినప్పుడు ప్రకటించడం, ఆ తర్వాత వారందరినీ దగ్గరకు చేర్చుకోవడం అధికారపార్టీకి సర్వసాధారణమైంది. న్యాయమన్నా, చట్టమన్నా ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలు చట్టం ప్రకారం పాలన కొనసాగించకపోతే పతనం కాక తప్పదు.