Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెలరేగుతున్న ద్రవ్యోల్బణ భూతాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వు మాంత్రికుడు జెరోమ్ పావెల్ శాంతించు తల్లీ అంటూ మరోసారి వడ్డీ రేటును 75బిపిఎస్ పెంచారు. ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మరో రెండుసార్లు 50బిపిఎస్‌ల చొప్పున పెంచే అవకాశం ఉందని వార్తలు. గురువారం నాటి పెంపుదలకు మన రూపాయి పాపాయి విలవిల్లాడుతూ రూ.80.86కు దిగజారి కొత్త రికార్డును సృష్టించింది. ప్రధాని నరేంద్రమోడీ ''కీర్తి కిరీటంలో మరో కొత్త ఫించాన్ని'' పెట్టించింది. ఇప్పటికే మన కరెన్సీ విలువ పతనంతో దిగుమతులు జనానికి మోయలేని భారంగా మారుతున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యం కూడా నరేంద్రమోడీ అచ్చేదిన్, మేకిన్ ఇండియాగానే మిగిలిపోనున్నట్లు తీరుతెన్నులున్నాయి.
వరదలు వచ్చి ఊళ్లకు ఊళ్లు ఇబ్బందులు పడుతుంటే వాటిని సొమ్ము చేసుకొని లాభపడేవారి గురించి తెలిసిందే. ద్రవ్యోల్బణం, యుద్ధం కూడా అలాంటిదే. కష్టజీవులకు చెప్పుకోలేని కష్టాలు తెస్తే ఇవి కొంత మంది వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు అపరిమిత లాభాలను తెచ్చి పెడతాయి. అమెరికా వడ్డీ రేట్ల పెంపుదల అక్కడి ఫెడరల్ రిజర్వు దవ్యోల్బణ లక్ష్యమైన రెండు శాతం సమీప భవిష్యత్‌లో అంటే 2024 వరకు చేరే అవకాశంలేదని చెబుతున్నారు. ఇది ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచమంతటా ప్రతికూల పర్యవసానాలకు దారి తీస్తుంది. 2014 మార్చి నెలాఖరున 304 బిలియన్ డాలర్లు ఉన్న విదేశీమారక ద్రవ్యం తమ నేత మోడీ దేశప్రతిష్టను పెంచేందుకు తీసుకున్న చర్యల కారణంగా 2022 జనవరి 14 నాటికి గరిష్టంగా 635బి.డాలర్లకు పెంచినట్లు భక్తులు చెప్పారు. అప్పటి నుంచి ఈనెల 20వ తేదీన వచ్చిన వార్తల ప్రకారం వాటిలో 83బి.డాలర్లు ఎందుకు హరించుకుపోయాయో చెప్పిన వారులేరు. దవ్యోల్బణం అదుపుకు వడ్డీ రేట్లు పెంచితే, పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ముఖ్యంగా ఆర్థికవెసులు బాటు పరిమితంగా ఉండే చిన్నవారికి గిట్టుబాటు కాదు, అది సంస్థల్లో సిబ్బంది తగ్గింపు, మూసివేతలకు దారితీస్తుంది. దాంతో కుటుంబాలు గొల్లుమంటాయి. కొనుగోళ్లను తగ్గించటంతో వస్తువులకు గిరాకీ తగ్గుతుంది. అది ఉత్పత్తి తగ్గింపు, మూసివేతలకు, నిరుద్యోగానికి దారితీస్తుంది.ఇది ఒక విషవలయం.
ద్రవ్యోల్బణానికి కార్మికుల వేతనాల పెంపుదలే కారణమని చెప్పేందుకు కొంత మంది సిద్దము సుమతీ అన్నట్లుగా ఉంటారు. అమెరికాలో అదే జరుగుతోంది. కార్మికుల నిజవేతనాలు తగ్గుతున్నాయి. కార్మికులు బాధితులు తప్ప బాధ్యులు కాదని నిరూపించే గణాంకాలు తమ దగ్గర ఉన్నాయని వాటిని ఎలా కాదంటారో చెప్పాలని కార్మిక సంఘాలు సవాలు చేస్తున్నాయి. ఆర్థికవేత్తలు సైతం అమెరికాలో ప్రస్తుత స్థితికి దీర్ఘకాలంగా అనుసరిస్తున్న విధానాలు, పెట్టుబడి-కార్మికుల మధ్య ఉన్న అసమానతలే కారణమనీ, కార్పొరేట్ల లాభాపేక్ష తప్ప కార్మికులు కారణం కాదని స్పష్టం చేశారు. వాల్‌స్ట్రీట్ (మన దేశంలో ముంబైలోని దలాల్ స్ట్రీట్ స్టాక్ఎక్సేంజ్ వంటిది) పెట్టుబడిదార్ల ధరల పెంపుదలే దీనికి మూలమని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, ఇటీవలి ఇతర కారణాలు, సరఫరా కొరతతో ధరల పెంపుదల వంటివి తమ వ్యాపారానికి ఎంతో దోహదం చేస్తున్నట్లు చెప్పుకొనేందుకు వారికి ఎలాంటి సిగ్గు ఎగ్గు లేదని పేర్కొన్నారు. కార్మికుల వేతనాలు, ఇతర ఖర్చుల కంటే ఆ సాకుతో వస్తువుల ధరలను ఎంతో ఎక్కువగా పెంచారన్నారు. వడ్డీ రేట్ల పెంపుదల వృద్ది రేటు మందగించటానికి తద్వారా ఉపాధి తగ్గుదల, నిరుద్యోగం పెరుగుదలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ఈ చర్యలు కార్మికుల జేబులు నింపేవి, కొనుగోలు శక్తిని పెంచేవి కాదన్నారు. రిపబ్లికన్ పార్టీ పాలనలో 2017 నుంచి 2021 కాలంలో కార్పొరేట్లు, ధనికులకు 1.7లక్షల కోట్ల డాలర్ల మేరకు పన్ను రాయితీలు ఇచ్చారని, కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో ఘోరవైఫల్యం, రెండంకెలకు నిరుద్యోగం పెరుగుదలకు కార్మికులు ఎలా బాధ్యులని నిలదీశారు.
జిందాతిలిస్మాత్ సర్వరోగ నివారిణి అన్నట్లుగా మన దేశంలో ద్రవ్యోల్బణం మొదలు ప్రతి వైఫల్యానికి కరోనా మహమ్మారి, తరువాత ఉక్రెయిన్ సంక్షోభాన్ని సాకుగా చూపుతున్నారు. పాలకులు పెట్టుబడులు పెట్టటం నిలిపివేసి ప్రజల సొమ్మును రాయితీల రూపంలో కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. గతంలో ఒక దశలో జీడీపీలో 39శాతం పెట్టుబడులు పెట్టారు, అలాంటిది పదేండ్ల క్రితం 34శాతానికి తగ్గాయి. గతేడాది 32.5శాతం ఉన్నట్లు చెబుతున్నారు. గత ఎనిమిది సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్ పిఎల్ఐ, ఎన్ఐపి, నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్, పిఎం గతిశక్తి పేరుతో ఎన్నో పధకాలు ప్రకటించారు, కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గించినా, సులభతర వాణిజ్య సూచికను ఎంతో మెరుగుపరిచినట్లు చెప్పినా గతేడాది 32.5శాతమే ఉన్నట్లు చెబుతున్నారు. కరోనాతో నిమిత్తం లేకుండానే పెట్టుబడులు తగ్గినట్లు ఆర్బిఐ గణాంకాలు వెల్లడించాయి. మరోసారి మన ఆర్బిఐ కూడా వడ్డీ రేట్లను పెంచనుందని చెబుతున్నారు. ఇది పరిస్థితిని మరింతగా దిగజార్చుతుంది తప్ప మెరుగుపరిచే అవకాశాలు తక్కువ.