Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''హిజాబ్''.... ముస్లిం మహిళలు తలపై ధరించే ఓ ముసుగు. ఓ మత సాంప్రదాయానికి ప్రతీక. ఇంకా చెప్పాలంటే ఓ ఆంక్షల సంకెల! కానీ అదంతా గతం. వర్తమానంలో అది ఓ ధిక్కారపతాకం..! తిరుగుబాటు సంకేతం..! అది ఇండియా అయినా ఇరాన్ అయినా ప్రపంచ గమనమెప్పుడూ ముందుకే తప్ప వెనక్కి కాదని చెపుతున్న ఓ ప్రగతిశీల ఉద్యమ అల..! మత ఛాందసం మితిమీరితే ఏం జరుగుతుందో ఎత్తి చూపుతున్న హెచ్చరిక...!
నిన్న ఇండియాలో మత విద్వేషాలు రగిలించిన హిజాబ్, నేడు ఇరాన్లో మహౌద్యమమై ఎగసిపడుతోంది. ఒకరూ ఇద్దరూ కాదు, ఇరాన్ వీధుల్లో కొన్ని వందల సమూహాలుగా మహిళలు తమ జుట్టు కత్తిరించుకుంటున్నారు. ముసుగుల్ని గాల్లోకి విసిరేస్తున్నారు. మంటల్లో దగ్దం చేస్తున్నారు. హిజాబ్ ధరించే ప్రసక్తే లేదని నినదిస్తున్నారు. నియంత్రణ హద్దు మీరితే ఆంక్షలు తృణీకరించబడతాయని నిరూపిస్తున్నారు. ఉవ్వెత్తున ఎగసిపడు తున్న ఈ నిరసనల వెల్లువలో టెహ్రాన్ సహా ఇరాన్ నగరాలన్నీ దద్దరిల్లుతున్నాయి. యువతులకు మద్దతుగా యువకులూ గళమెత్తుతున్నారు. పోలీసు కాల్పుల్లో ఏడుగురు నేలకొరిగినా ఈ జ్వాల ఆరటం లేదు. ఎందుకు?
ఇరాన్‌లోని కుర్దిష్ ప్రాంతం సాకేజ్ నగరానికి చెందిన ఇరవైరెండేండ్ల ''మహస అమిని'' టెహ్రాన్ నగరానికి వచ్చిన సందర్భంలో... హిజాబ్ సరిగా ధరించలేదని మోరల్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. డిటెన్షన్ సెంటర్లో వారి దెబ్బలకు తాళలేక ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఆపైన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కానీ ఆమె అప్పటికే అనారోగ్యంతో ఉండటంతో గుండెపోటుకు గురై మరణించిందని ఏలినవారు తమకు అలవాటయిన కథనాలనే వల్లించారు. కానీ జరిగిందేమిటో తెలియజేసే ప్రత్యక్ష సాక్ష్యాలనేకం కండ్లముందుండగా, వీరి కట్టుకథలు నమ్మడానికి ప్రజలేమీ అమాయకులు కాదు కదా?
ఇరాన్లో అమలులో ఉన్న షరియా చట్టాలు ప్రపంచానికి తెలియనివేమీ కావు. 1979లో ఇస్లామిక్ రివల్యూషన్‌తో అధికారంలోకొచ్చిన పచ్చి మత ఛాందసవాదులు మహిళలపై కఠినమైన ఆంక్షలు విధించారు. ఇల్లు దాటి బయటకు వచ్చినప్పుడు జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించాలి. వళ్లు కనిపించకుండా నిలువెల్లా బురఖాలు ధరించాలి. అంతెందుకు... పెళ్లికాని అమ్మాయిలు అబ్బాయిలు కలసి మాట్లాడుకున్నా నేరమే! ఇటువంటి అనేక నిబంధనల అమలు కోసం చట్టాలు తెచ్చారు. ఇది చాలదన్నట్లు వీటి అమలును పర్యవేక్షించేందుకు 2005లో ప్రత్యేకంగా మోరల్ పోలీసు వ్యవస్థనే ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఆడపిల్లల పట్ల ఈ మోరల్ పోలీసుల దారుణాలు కోకొల్లలు. మధ్యలో 2017లో హసన్ రొహాని అధ్యక్షుడయ్యాక వీటిని కొంత సడలించినా, ఇటీవల పచ్చి మత ఛాందసవాది ఇబ్రహీం రైజీ పాలనా పగ్గాలు చేపట్టాక వీరి దాష్టీకాలు పరాకాష్టకు చేరాయి. ఇప్పుడా దాష్టీకాలకే ''మహస అమిని'' బలైపోయింది.
మతమేదైనా దాని మొట్టమొదటి బాధితులు మహిళలే అనడానికి ఇదొక ఉదాహరణ. అందుకే ఈ షరియా చట్టాలపై మహిళల్లో ఎన్నాళ్ళుగానో గూడుకట్టుకున్న అసంతృప్తీ, ఆవేశం ఈ ఘటనతో ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. ఆకాశాన్నంటిన వారి ఆగ్రహజ్వాలల్లో నేడు ఇరాన్ అట్టడుకుతోంది. నిజానికి హిజాబ్ సరిగ్గా ధరించకపోతే విధించే జైలుశిక్ష రెండు నెలలే. కానీ నిరసనగా హిజాబ్‌ను తృణీకరిస్తే మాత్రం పదిసంవత్సరాల కఠిన కారాగార శిక్ష. అయినప్పటికీ లెక్కచేయకుండా ఇరాన్ మహిళలు మూకుమ్మడిగా వాటిని అగ్నికి ఆహుతి చేస్తున్నారంటే వారి ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది పైకి మత వ్యవహారంగా కనిపిస్తున్నప్పటికీ సారాంశంలో అణచివేతపై తిరుగుబాటని గుర్తించాలి. మనదేశంలో కర్నాటకలో తలెత్తిన హిజాబ్ వివాదంలో కూడా ఇదే కనిపిస్తుంది. ఇక్కడ హిజాబ్ ధరించకూడదంటే నిరసనలు వెల్లువెత్తాయి. అక్కడ ధరించి తీరాలంటే నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఇందులో హిజాబ్ ధరించడం సరైనదా లేక ధరించకపోవడం సరైనదా అని కాదు చూడాల్సింది. ఇక్కడైనా, అక్కడైనా ధరించడం, ధరించక పోవడమన్నది వారి ఇష్టం. అది నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికుంటుంది. ఈ స్వేచ్ఛ ఎవరో ఇచ్చే భిక్ష కాదు. అది వారి హక్కు అని గుర్తించాలి. కానీ మత ఛాందసత్వం దీనిని అంగీకరించదు. ఏ మతోన్మాదమైనా ముందు తనవాళ్ళ కళ్ళను పీకి అంధులను చేస్తుంది. తర్వాత ఆలోచనలను కబళించి అవివేకులను చేస్తుంది. అంతిమంగా హృదయాలను ధ్వంసం చేసి క్రూరులుగా మారుస్తుంది.
కాబట్టి... దేశమేదైనా, ప్రజలెవరైనా ఇప్పుడు కోరలు చాస్తున్న ఈ మత ఉన్మాదం నుండి తమ చూపునూ, వివేకాన్నీ, హృదయాన్ని కాపాడుకోవడమే మానవాళి ముందున్న కర్తవ్యం. ఇందుకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఇరాన్ సోదరీమణుల తెగువ అద్వితీయం.