Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదివారం రాష్ట్రంలో బతుకమ్మ పండుగను ఘనగా నిర్వహించారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్ నుంచి పంచాయతీ కార్యాలయాల వరకూ ఆటపాటలతో హోరెత్తాయి. అదే ఆదివారం భారత్ ఆసీస్ క్రికెట్ జట్ల మధ్య కొనసాగిన టీ 20 మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. అటు బతుకమ్మ.. ఇటు టీ 20... వెరసి సండేను రంజుగా మార్చేశాయి. ఇంతటి ఆహ్లాద, ఉత్సాహభరిత వాతావరణంలో ఉప్పల్ స్టేడియంలో ప్రదర్శితమైన ఓ ఫ్లెక్సీ 'బంగారు తెలంగాణ కాదు.. బతుకు తెలంగాణ...' అనే విషయాన్ని, దానికున్న ప్రాధాన్యతను మనకు నొక్కి చెప్పింది. తమకు పే స్కేల్‌ను అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్న ఓ వీఆర్ఏ... సంబంధిత ఫ్లెక్సీని ప్రదర్శించటం విషయ తీవ్రతకు అద్దం పడుతున్నది.
ఉప్పల్ స్టేడియంలో ప్రదర్శితమైంది కేవలం ఒకే ఒక ఫ్లెక్సీ. కానీ రాష్ట్రంలో ప్రదర్శితం కాకుండా ఉన్న 'సమస్యల' ఫ్లెక్సీలు కోకొల్లలు. వాటిని పరిశీలించి, పరిష్కరించాల్సిన సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. కనీస వేతనాలు అమలు చేయకపోవటం, నెలల తరబడి జీతాలను పెండింగ్‌లో ఉంచటం, బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వకపోవటం తదితర సమస్యలు ఈ కోవలోనివే. దీంతో తెలంగాణలో పెద్ద పండుగైన దసరాకు వివిధ తరగతుల ప్రజానీకం, పలు రంగాలకు చెందిన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా సోమవారం కనీస వేతనాల జీవోలను అమలు చేయండి మహాప్రభో అంటూ కేంద్ర కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఇక్కడి షెడ్యూల్డ్ ఎంప్లాయి మెంట్స్‌లో ప్రతీ ఐదేండ్లకోసారి సవరించాల్సిన వేతనాలను సవరించటం లేదన్నది అక్కడికొచ్చిన కార్మికుల ఆవేదన. అది కూడా రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటిదాకా వాటిని సవరించకపోవటాన్నిబట్టి సర్కారు ఎవరి పక్షాన నిలబడుతున్నదనే విషయాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అదే సోమవారం జీహెచ్ఎమ్సీలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమకు కనీస వేతనం రూ.24 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ వద్ద భారీ ధర్నా నిర్వహించింది కూడా 'బతుకు తెలంగాణ' కోసమే. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే కార్మికులు సైతం తమ పనికి అసలు గుర్తింపే ఉండటం లేదంటూ సోమవారమే రోడ్డెక్కారు. పదేండ్ల సర్వీసు ఉన్న ప్రతీ ఒక్కరినీ పర్మినెంట్ చేస్తామంటూ ప్రభుత్వాధినేత వారికిచ్చిన హామీ నీటి మూటగానే మిగిలిపోయింది. దీంతోపాటు కనీస వేతనాలివ్వకపోవటం, ఆ ఇచ్చే అరకొరా వేతనాలను కూడా నెలల తరబడి పెండింగ్‌లో ఉంచటంతో ఒళ్లు మండిన కార్మికులు సంక్షేమ భవన్ వద్ద ఆందోళనకు దిగటమనేది వారిపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తేటతెల్లం చేస్తున్నది.
ఇవి రెండూ తాజా ఉదాహరణలైతే ఇటీవలే హైదరాబాద్ నగరంతోపాటు ప్రభుత్వాన్నీ ఉక్కిరిబిక్కిరి చేసిన మరికొన్ని ఆందోళనలూ ఆయా తరగతుల బతుకు 'పోరాటానికి' సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి సచివాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ బొమ్మ వరకూ బైఠాయించిన వీఆర్ఏలు పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. సింగరేణి కార్మికులు సైతం తమ డిమాండ్ల సాధన కోసం 19 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దాన్ని నివారించటంలో విఫలమైన ప్రభుత్వం... వారి సమస్యల పరిష్కారానికి ఎలాంటి ప్రయత్నమూ చేయకపోవటం శోచనీయం. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే వేతనాన్ని రూ.రెండు వేల మేర పెంచుతామంటూ గత బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు కాకపోవటంతో ఆ కార్మికులు సైతం ఆందోళనబాట పట్టారు. ఏండ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ కోసం సదరు లెక్చరర్లు కండ్లు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ పాలకులు వివిధ రంగాల్లోని కార్మికులు, సిబ్బంది పట్ల అనుసరిస్తున్న విధానాలకు తార్కాణాలు. వారి వర్గ స్వభావానికి నిలువెత్తు సాక్ష్యాలు.
తెలంగాణ వస్తే... అసలు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వ్యవస్థే ఉండబోదంటూ ఎనిమిదేండ్ల కిందట ఉద్యమ సమయంలో సెలవిచ్చిన నాయకాగ్రేసరులు... ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు. వివిధ శాఖలు, రంగా ల్లోని కార్మికులు, ఉద్యోగులు, సిబ్బందికి ఇచ్చిన హామీలు, జీవోలను అమలు చేయకుండా తాత్సారం చేయటం అత్యంత బాధ్యతారాహిత్యం. పూల పండుగ బతుకమ్మలతో సంబురాలు కొనసాగుతున్న ప్రస్తుతం తరుణంలో ఇకనైనా చిన్నా చితకా ఉద్యోగులు, శ్రమ జీవుల బతుకులతో అధినేతలు బంతాట ఆడకుండా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసినప్పుడే దసరా సీజన్ అసలైన సరదాలను తెస్తుంది. ఈ విషయాన్ని ఏలిన వారు గుర్తించాలి.