Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారి సంస్కృతి అది. మంత్రదండంతో 'ఎంట్రీ' ఇస్తే కాంగ్రెస్ పునరుజ్జీవనం పొందే ప్రశ్నే ఉదయించదని ఇంద్ర జాలికుల వంశోద్ధారకుడు అశోక్‌గెహ్లాట్‌కు అర్థమయి ఉండాలి. ఈ మూడు రోజుల పరిణామాలు పరిశీలించిన వారికి కొన్ని శేష ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. జైపూర్‌లో రాహుల్‌గాంధీ గెలిచాడా? అశోక్ గెహ్లాట్ గెలిచాడా? అనే దాని కంటే కాంగ్రెస్ ఓడిపోయిందనడం సరిగ్గా ఉంటుంది. భజనకు, వ్యక్తిపూజకు అలవాటుపడ్డ ఏ పార్టీలోనైనా పరిణామాలు ఇలానే ఉంటాయని కాంగ్రెస్ రుజువు చేసింది. కేంద్రంలో పగ్గాలు చేతిలో ఉన్నప్పుడు ''సీల్డ్ కవర్''లకున్న విలువ, 'ఏకవాక్య తీర్మానాల'కు దొరికిన ఆమోదం ఇప్పుడు వెంటనే అధికారంలోకొస్తారో, లేదో తెలియని అగమ్యగోచర పరిస్థితుల్లో దొరకదని జైపూర్‌లో స్పష్టమైంది కదా!
ఆ రాష్ట్రంలో పాలన ప్రజారంజకంగా ఉందా లేదా అనే దానికంటే, ముఠాల్ని కంట్రోల్ చేయగలిగాడని, మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో ఒక శతకోటీశ్వరుడు 'జీ' టీవీ అధినేతను మట్టికరిపించాడని, 'పైలట్'ని వెనకసీట్లకే పరిమితం చేయగలిగాడనేవే గెహ్లాట్‌కి అర్హతలుగా ప్రచారం జరిగింది. అవన్నీ కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు. అడగడానికి మనమెవరం? అధినాయకత్వంపై తన ముఠాని ఎగదోశాడన్న అపకీర్తి మూటకట్టుకున్న వ్యక్తి పార్టీలో క్రమశిక్షణ ఏం తెస్తాడని ప్రత్యర్థులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఏది ఏమైనా, ''విన్యాసాలు చేయగలిగే శక్తి'' ఆయన 'హస్తలాఘవం' ఎంతున్నా గెహ్లాట్‌ను రాజస్థాన్‌కే పరిమితం చేశాయి. బహుశా చేయొచ్చు. మోడీ బృందం చేసే ప్రధాన విమర్శ కాంగ్రెస్‌లో ''కుటుంబ పాలన'' అనేది. వాస్తవానికి స్వాతంత్య్రానంతరం 16మంది ఏఐసీసీ అధ్యక్షులుంటే దానిలో ఐదుగురే గాంధీ-నెహ్రూ కుటుంబీకులన్న నిజాన్ని కూడా ప్రజలకు తెలియనంతగా బీజేపీ నేతలు విమర్శిస్తుంటారు. దాన్ని పూర్వపక్షం చేసే అవకాశాన్ని కాంగ్రెస్ ప్రస్తుతానికి కోల్పోయింది. ఇంకెవరినైనా రాష్ట్రానుభవం కలిగిన నేతను రంగంలోకి దింపుతారా? శశిథరూర్‌కి లైన్ క్లియర్ చేస్తారా? గెహ్లాట్‌కే మళ్లీ అవకాశం ఇస్తారా? ''ఎవరూ లేరు కాబట్టి నేనే రంగంలోకి'' దూకుతానని యువనేతే వస్తారా? వంటివి ఈ నాలుగు రోజులూ వేచిచూడాల్సినవే!
రాహుల్‌గాంధీ ట్వీట్ ఈ సందర్భంగా చెప్పుకోవల్సిందే. ''కాంగ్రెస్ అధ్యక్ష పదవి కేవలం ఒక నిర్మాణ పదవేకాదు, అది సైద్ధాంతిక పదవి కూడా! ఎవరు ఏఐసీసీ అధ్యక్షుడైనా ఆయన భారతదేశమనే కొన్ని ఆలోచనలకు, కొన్ని నమ్మకాలకు, కొన్ని కలలకు ప్రతిరూపం!'' ఆహా! ఎంత 'అద్భుతమైన' మాట! మా తాతలు నేతులు తాగారు.. కావాలంటే మా మూతులు వాసన చూసుకోండన్నట్లు లేదా?! అక్షరాల రాహుల్ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ స్వప్నించిన భారత మది. నిజానికి వందేండ్ల జాతీయోద్యమ స్వప్నమది. సామాన్యుడి చుట్టూ అల్లిన పందిరది. ఆధునిక దేవాలయాలుగా భాక్రానంగల్, హీరాకుడ్ వంటి డామ్‌లకు, భిలారు, బొకారో వంటి కర్మాగారాలకు నామకరణం చేసి స్వప్నించిన ముత్తాత కాలపు ''ఆలోచనలవి''. నాయనమ్మ కాలంలో పొడచూపి తండ్రికాలంలో పునాది పడ్డ విధానాలు పి.వి. కాలంలో విచ్చలవిడై 2004-2014 మధ్య పరాకాష్టకు చేరాయి.
''ఆధునిక దేవాలయాల'' కూల్చివేతకు పలుగులు, పారలతో రంగంలోకి దిగింది కాంగ్రెస్. ప్రయివేటీకరణకు గేట్లెత్తిందీ కాంగ్రెస్సే. నర్సింహన్ కమిటీ, మల్హోత్రా కమిటీ, జానకి రామన్ కమిటీల పేర దేశ ఆర్థిక వెన్నెముకైన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల విధ్వంసానికి పూనుకున్నది కాంగ్రెస్. ఇటీవల పి.వి. స్మృత్యర్థం మోడీ మాట్లాడుతూ పి.వి. చూపిన దారిలోనే తాము నడుస్తున్నామన్న విషయం గమనార్హం. గోతికాడి నక్కలా కూర్చున్న బీజేపీ గురించి ఇటు కాంగ్రెస్ ఉన్నత శిఖరం ఎక్కాలనుకునే గెహ్లాట్ కైనా, అటు ముఖ్యమంత్రి పీఠం ఆశిస్తున్న సచిన్ పైలట్ కైనా ఖాతరే లేదు. కాంగ్రెస్‌లో జాతీయోద్యమ కాలం నాటి సిద్ధాంతం ఆవిరైపోయి చాలాకాలం అయింది.
ఆర్థిక విధానాలు కాంగ్రెస్‌ను బీజేపీ సరసన నిలబెట్టడమే కాదు, దక్షిణాదిన పోటీ చేయాలనుకున్న రాహుల్‌గాంధీ కనీసం నాయనమ్మలా ఏ చిక్కమగుళూర్ (కర్నాటక)నో ఎంచుకోకుండా కేరళలో పోటీ చేసి సీపీఐని ఓడించారు. తాజా 150 రోజుల పాదయాత్రలో 19రోజులు కేరళలో నడిచి కేవలం రెండే రోజులు యూపీలో నడక సాగించనున్నాడు. సీట్ల రీత్యా కీలకమైంది యూపీ. వివిధ రూపాల్లో మతోన్మాద విషం చిమ్ముతున్నది యోగీ సర్కార్. వింధ్య పర్వతాల ఆవల కాషాయ మబ్బులు కమ్ముకున్న నేలలో తమ కార్యకర్తలను ఉత్సాహపరిచి కార్యరంగంలోకి దింపాలన్న తెలివిడిలేదా? ఆ రకంగా యుద్ధక్షేత్రాన్ని వదిలేసిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వానికున్న ఆలోచనేంటి? ఆ మార్గాన్ని ఎంచుకున్న తర్వాత గుళ్ళూ, గోపురాలు తిరుగుతూ రాహుల్‌గాంధీ తాను జంధ్యం వేసుకున్న బ్రాహ్మడినని డిక్లేర్ చేసుకున్నా మోడీకి ప్రత్యామ్నాయం కాలేరు కదా! బీజేపీకి ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేసేందుకు ప్రయత్నించకుండా షార్ట్కట్లు వెతికితే నిరుపయోగం!