Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వార్తా ఛానళ్లలో విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. ఒక మతాన్నో, కులాన్నో కించపరిచే విద్వేష ప్రచారం అనేక రకాలుగా ఉండవచ్చు. కానీ, దృశ్యమాధ్యమాల ద్వారా జరిగే విషప్రచారం అత్యంత దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇందులో ఏలాంటి సందేహం అక్కరలేదు. నిరక్షరాస్యులతో సహా ప్రజానీకం చూసే టీవీ కార్యక్రమాల్లో విద్వేష ప్రచారం అత్యంత ప్రమాదకరమైందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటివలన లౌకివాదం, ప్రజాస్వామ్యం మీద దాడి పెచ్చరిల్లుతుందనీ వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ వాస్తవాలను ఎట్టకేలకు దేశ అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది. విద్వేష ప్రసంగాలతో జరిగిన ఘర్షణలకు సంబంధించి గతేడాది దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని 'మౌన ప్రేక్షకుడిలా' వ్యవహరిస్తున్నారంటూ ఆక్షేపించింది. ఇలాంటి వాటిని నియంత్రించాలని కానీ, వాటిని అరికట్టే చట్టం తీసుకువచ్చే ఆలోచన కానీ ఉందా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
విద్వేషాలతో టీవీ చానళ్ల రేటింగులు పెరగొచ్చు. లాభాలు రావచ్చు. అందుకోసం సమాజంపై 'మత' విషాన్ని చిమ్ముతామంటే మీలా చూస్తూ కూర్చోలేం అంటూ న్యాయస్థానం ఘాటుగానే హెచ్చరించింది. ప్రభుత్వం చట్టం తీసుకొచ్చేలోపు తామే కొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తామని కూడా న్యాయమూర్తులు పేర్కొన్నారంటే ఇది ఈ ప్రభుత్వ పనితీరును ఎత్తిచూపడం కాదా? అయినా 'దున్నపోతు మీద వానపడినట్టు' ఈ ప్రభుత్వానికి ఇసుమంతైనా చలనం లేకపాయే! విద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే చర్యలు, మైనారిటీలపై దాడులతో దేశం మొత్తాన్ని తన కాషాయ రథచక్రాల కింద నలిపేసేంత దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చిన బీజేపీకి సుప్రీంకోర్టు తాజా నిర్ణయం గొడ్డలిపెట్టులాంటిది.
ఈ విద్వేష, విభజన వ్యాఖ్యలు ఈ దేశానికి కొత్తకాదు కానీ, వాటికి పాల్పడేవారికి రాజ్యమే అండగా నిలవడం, వెన్నుతట్టడం ఈ ప్రభుత్వ హయాంలోనే చూస్తున్నాం. హిందూ దేశ స్థాపనే లక్ష్యంగా దేశంలో ఒక మతవర్గాన్ని సంపూర్ణంగా నిర్మూలించాలని పిలుపునిచ్చినవారిపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరింస్తోంది. ఇది వారి నైజానికి నిదర్శనం. ఊచకోతలకు, మారణహౌమానికీ పిలుపునిచ్చిన వారి ప్రసంగాల వీడియోలు ప్రపంచవ్యాప్తమై, దేశాన్ని అప్రదిష్టపాలు చేశాయి. ఇలాంటివి దేశ భవిష్యత్తుపట్ల భయాన్ని కలిగిస్తున్నాయి. 'పరుల'ను ఈ దేశంలో లేకుండా చేయాలంటే చంపడమే ఏకైక మార్గమంటూ అందుకు ఎంతమందిని కూడగట్టాలో లెక్కలు కట్టారు ఓ 'సాధ్వి' మణి. ఆ వ్యాఖ్యలు టీవీ ఛానళ్లలో ఎంతో దుమారాన్ని సృష్టించాయి. మహమ్మద్ ప్రవక్తను తూలనాడే వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను ఎంత దిగజార్చాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దేశంలో లౌకిక, ప్రజాస్వామిక విలువలకు మతోన్మాద ప్రమాదం పొంచి ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏంకావాలి? ఇవన్ని సామాన్యులకు ఆవేదన కలిగిస్తున్నాయి కానీ, పాలకులకు మాత్రం చీమ కుట్టినట్టైనా లేదు. స్టాండప్ కమేడియన్ మునావర్ ఫారూఖీ నోరు తెరవకముందే, అతని మనసులో ఏమున్నదో కనిపెట్టి కేసులు పెట్టగల దిట్టలకు, వారి పరివారపు ప్రసంగాల్లో, చర్యలల్లో ఏ విషమూ కనిపించకపోవడం విచిత్రం!
టీవీ చానళ్లలో ఎవరితోనైనా ముఖాముఖి కార్యక్రమాలకు, బృంద చర్చలకు ఒక నిర్దిష్ట పద్ధతి, యాంకర్ల పాత్ర వంటి వాటిపై ఆలోచించవలసిన అవసరాన్ని న్యాయమూర్తులు గుర్తుచేశారు. వ్యవస్థాపరమైన నిరోధక చర్యలు కొరవడితే ఈ విద్వేష ప్రచారాలు ఇలానే కొనసాగుతూనే ఉంటాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇవి వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించడమే కాక, జాతి సమైక్యతను కూడా దెబ్బ తీస్తయనడంలో సందేహం లేదు. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి జీవగర్రల్లాంటివి. వాటిని గాలికి వదిలేసిన కొన్ని పత్రికలు, ప్రధానంగా టీవీ చానళ్ల లాంటివి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఊడిగం చేసే స్థాయికి దిగజారాయి. అదే గోదీ మీడియా. అధికార పార్టీ చేసే విద్వేష ప్రచారాన్ని దశదిశలా వ్యాపింప చేసే కర్తవ్యాన్ని ఈ మాధ్యమాలు భుజాన వేసుకున్నాయి. పెట్టుబడుల విషపుత్రికలుగా మారిన కొన్ని మీడియా సంస్థలు స్వచ్ఛంద బానిసత్వానికి పాల్పడుతుండటం ఓ నిష్టుర సత్యం. అసలు కర్తవ్యాన్ని పక్కకు తోసేసి ప్రభుత్వానికి ఊడిగం చేయడానికి మీడియా సిద్ధపడడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమే. విద్వేషపూరిత ప్రసంగాలు చోటు చేసుకోకుండా అడ్డుకోవడం ప్రభుత్వ విద్యుక్తధర్మమని కోర్టు సూచించింది. ప్రధాన టీవీ ఛానళ్లలో ఇంకా ఇటువంటి విధ్వంసకర పోకడ కొనసాగుతోందని, ఇవన్ని చూస్తుంటే దేశం ఎటువైపు వెళ్తోందోనని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిందంటే దేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి.