Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందేహం లేదు
ఇది అబద్ధాల కాలం
అంబానీల కాలం
అదానీల కాలం
మోడీ షాల కాలం...!
కనీసం పొట్ట నింపే వేతనాలులేక, వ్యవసాయం గిట్టుబాటుకాక, దేశంలో అసంఖ్యాకులైన ప్రజలు అన్నార్తులై అలమటిస్తున్నారు... అయినా ''దేశం సుభిక్షంగా ఉంద''ని ఏలినవారు వల్లిస్తుంటే ఇది అబద్ధాల కాలం గాక మరేమవుతుంది? నూటానలబై కోట్ల భారతీయులను కాదని, దేశమంటే తామిద్దరూ, తమకిద్దరూ అన్న చందంగా ఉంది ఏలినవారి తీరు! అలాంటప్పుడిది అదానీ అంబానీల కాలం, ''మోడీ షా''ల కాలం కాక ఇంకెవరిదవుతుంది?
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించిన అదానీ, ఏప్రిల్ కల్లా మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానానికి చేరారు. ఇప్పుడు ఏకంగా జెఫ్ బెజోస్, బెర్నార్డ్ అర్నాల్ట్‌ను కూడా అధిగమించి రెండో స్థానం ఆక్రమించాడు. ఇక రిలయన్స్ ఇండిస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కూడా ఈ జాబితాలో 8వ స్థానంలో ఉన్నారు. వీరద్దరి ఆస్తులు కలిపి దేశంలోని అగ్రశ్రేణి కుబేరుల మొత్తం ఆస్తుల్లో 59శాతం ఉన్నట్లు తేలింది. 141కోట్ల జనాభా గల దేశంలో ఇలా సంపదంతా కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతమైపోతే, మిగిలిన జనాభాకు మిగిలేదేముంటుంది? ఆకలి చావులు... ఆర్థిక భారాలు తప్ప!
అసలే అనేక సమస్యల్లో కొట్టుమిట్లాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ, కోవిడ్ నేపథ్యంలో మరింతగా చితికిపోయింది. లక్షలాది పరిశ్రమలు మూతపడి, చిరువ్యాపారాలు అతలాకుతలమై, వ్యవసాయం అగమ్యగోచరమై కోట్లాది మంది ప్రజానీకం ఉపాధిలేక పెను సంక్షోభంలో కూరుకుపోయారు. కోవిడ్ ఆంక్షలు తొలగి బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్న సామాన్య జనావళిని, ఇప్పుడు ఏలినవారు మోపుతున్న ఆర్థిక భారాలు అడుగు ముందుకేయనీయడం లేదు. పేదరికం అనే ఊబిలో రొజుకింత లోపలికి కూరుకుపోతున్నారు. దేశంలోని 99శాతం ప్రజలది ఇదే దుస్థితి. కాగా, మిగిలిన ఒక శాతంగా ఉన్న ఈ అదానీ, అంబానీల వంటి శతకోటీశ్వరుల కథ మాత్రం వేరు..! ఇంతటి కోవిడ్ కల్లోలంలోనూ వారు కోటానుకోట్లకు పడగలెత్తడమే కాదు, ప్రపంచంలోనే ప్రధమశ్రేణి కుబేరులుగా అవతరించారు.
దీనిని బట్టి మన ''దేశభక్తుల'' సర్కార్ ఎవరి ప్రయోజనం కోసం 'పని' చేస్తుందో బోధపడటం లేదూ..! ప్రజలను, వారి ప్రయోజనాల్ని పక్కన పెట్టి... దేశాన్ని తమ ఆశ్రితులకు దోచిపెట్టేందుకు బరితెగించిన ఈ కుటిల పాలకులే తిరిగి దేశభక్తి జపం చేయడం ఒక వంచన. లేదంటే భూమిని బంగారంగా మార్చే రైతన్నల మట్టిపాదాలకు అడ్డుగా శీలలు నాటిందెవరు? సాగుకు దూరం చేస్తున్నదెవరు? దేశరక్షణకు సైనికులు కావాలనుకున్న యువతరం స్వప్నాలను చిదిమి ''అగ్నిపథ్''కు సమిధలుగా మార్చింది ఎవరు? పాడిపంటలతో విలసిల్లాల్సిన పల్లెలని వాణిజ్య ఒప్పందాల మాటున ఎడారులుగా మార్చే మహాకుట్రకు తెరదీసింది ఎవరు? ఎవరి కోసం? ఈ దేశ స్వావలంబనకు మూలాధారమైన ప్రభుత్వరంగాన్ని అంగడి సరుకుగా మార్చింది ఎవరు? ఎవరికోసం? ఇక్కడి అడవులూ పర్వతాలూ పొలాలూ గనులూ నదులూ సముద్రాలతో సహా సమస్త వనరులనూ కొల్లగొడుతున్నదెవరు? వాటిని అభివృద్ధి పేరిట అప్పగిస్తున్నదెవరికి? చెట్లను నరికివేస్తున్నదెవరు? ఊళ్ళను కబళిస్తున్నదెవరు?
భారతదేశమంటే ఆ ఇద్దరు కార్పొరేట్ మిత్రులేనన్న రీతిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వినాశకర విధానాల వల్ల అదానీ అంబానీల ఆస్తులు ఆకాశానికెగబాకుతుంటే, అసంఖ్యాకులైన శ్రామిక ప్రజల జీవితాలు పాతాళానికి దిగజారుతున్నాయి. నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆప్తమిత్రుడిగా పేరుగాంచిన అదానీ ఆస్తులు అమాంతం పెరిగింది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతేనన్నది జగమెరిగిన సత్యం. అది కూడా అప్పనంగా ప్రజల సొమ్మును ఆరగించడం ద్వారానే ఆర్జించాడన్నది అంతకంటే నిజం. అయితే... ఇప్పుడు నిజం ఓ మూలన నక్కి చొద్యం చూస్తున్న కాలమిది...! అబద్ధాల మీడియా మోడీషాల పెంపుడు జంతువైన కాలం..!! వాస్తవాలను దాచిపెట్టి, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో బ్రిటన్ను తలదన్నేసి భారత్ ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఊదరగొడుతున్న కాలం..!!!
ఆర్థిక వ్యవస్థ మొత్తం పరిమాణంలో భారత్ బ్రిటన్ను అధిగమించినా... ప్రజల ఆర్థిక పరిస్థితిలో మార్పు లేనప్పుడు ఆ వద్ధి వల్ల ప్రయోజనమేమిటి? ఏడాదిలో బ్రిటన్ తలసరి ఆదాయం 45వేల డాలర్లుండగా... భారత తలసరి ఆదాయం 2వేల డాలర్లు మాత్రమే. అదేసమయంలో జీడీపీలో అదానీ, అంబానీల వాటా కొన్ని దేశాల జాతీయ సగటును మించిపోయిందంటే, దేశంలో సామాన్యుల జీడీపీ ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవొచ్చు. దీనీకి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలే. ప్రజల సంపదను మొత్తం కొల్లగొట్టి కార్పొరేట్ మిత్రులకు పంచిపెడుతున్నందునే ఈ పరిస్థితి. మౌలిక సదుపాయాలను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధానంగా పోర్టులను, విమానశ్రయాలను, భారీ పరిశ్రమలను కారుచౌకగా ఈ కార్పొరేట్లకు కట్టబెడుతున్నందునే ఈ దుస్థితి. దేశమంటే మనుషులన్నారు గురజాడ. కానీ, దేశమంటే అదానీ అంబానిలే అంటున్నారు మోడీ షా..! ఏది నిజం..?