Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉక్రెయిన్ సంక్షోభం శుక్రవారంనాడు మరో మలుపు తిరిగింది. తాము ఆడింది - ఆడించింది ఆట, పాడింది - పాడించింది పాట అనే రోజులు కావివి. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్న సామెత మాదిరి పశ్చిమ దేశాలు అనుకున్నది ఒకటి జరుగుతున్నది మరొకటి. పూర్వం ఎప్పుడో రష్యా ప్రాంతంగా ఉండి, సోవియట్ ఏర్పడిన తరువాత పాలనా సౌలభ్యం కొరకు ఉక్రెయిన్ రిపబ్లిక్కులోకి బదలాయించిన క్రిమియా ప్రాంతాన్ని సోవియట్ విచ్చిన్నం తరువాత కూడా అలాగే కొనసాగించారు. ఎప్పుడైతే ఉక్రెయిన్ పాలకులు అమెరికా పెత్తనంలోని నాటోతో చేతులు కలిపి తమ భద్రతకు ముప్పు తలపెట్టారో దాన్ని గమనించిన పుతిన్ 2014లో ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం క్రిమియాను రష్యాలో విలీనం చేశాడు. ఇప్పుడు శుక్రవారంనాడు విలీనమైన నాలుగు దేశాలు అలాంటివి కాదు. అవి ఉక్రెయిన్‌లో మెజారిటీ రష్యన్ భాష మాట్లాడే ప్రాంతాలు. తమ పట్ల చూపుతున్న వివక్ష మీద తిరుగుబాటు చేసిన లుహానస్క్, డాంటెస్క్ ప్రాంతాలు కాగా వాటిని ఫిబ్రవరిలోనే వేరే దేశాలుగా పుతిన్ గుర్తించాడు. సైనిక చర్య తరువాత ఖేర్సన్, జపోరిఝియా అనే ప్రాంతాలు కూడా వాటితో జత కలవటంతో శుక్రవారం నాడు వాటిని కూడా స్వతంత్ర దేశాలుగా గుర్తించాడు. మాస్కోలో సాయంత్రం మూడు గంటలకు(మన దగ్గర 5.30) జరిగిన ఒక కార్యక్రమంలో ఈ నాలుగు స్వతంత్ర దేశాలు రష్యాలో విలీన ఒప్పందంపై సంతకాలు చేశాయి. సెప్టెంబరు 23 నుంచి 27 వతేదీ వరకు ఈ ప్రాంతాల్లో విలీనం గురించి జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 93 నుంచి 99శాతం వరకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు.
ఈ పరిణామాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనెస్కీ, అతగాడికి వెన్నుదన్నుగా ఉండి అగ్నికి ఆజ్యం పోస్తున్న పశ్చిమ దేశాలు గుండెలు బాదుకుంటూ అన్యాయం అక్రమం అంటూ చూశారా పుతిన్ ఎంతకు తెగించాడో అని ప్రపంచముందుకు వచ్చాయి. విలీనాన్ని ఖండిస్తూ ఐరాస భద్రతా మండలిలో తీర్మానం, ఓటింగ్ జరగనుంది. తీర్మానాన్ని మెజారిటీ ఆమోదించినా రష్యాకు దాన్ని తోసిపుచ్చే వీటో అధికారం ఉంది గనుక జరిగేదేమీ ఉండదు. ప్రపంచంలో అనేక దేశాల్లోని కొన్ని ప్రాంతాలు వేర్పాటును కోరుకోవటం ఇదే మొదలు కాదు, పశ్చిమ దేశాల ద్వంద్వ ప్రమాణాల గురించీ తెలిసిందే. తూర్పు జర్మనీని పశ్చిమ జర్మనీలో విలీనం చేసుకోవటం మనకళ్ల ముందే జరిగింది.అందరూ అంగీకరించిన రెండు కొరియాల విలీనాన్ని అడ్డుకుంటున్నది ఎవరో తెలిసిందే. ఐరోపాలో మరో దేశం యుగోస్లావియా. దాన్ని విచ్చిన్నం చేసేదాకా నాటో కూటమి నిదురపోలేదు. వేర్పాటును ప్రకటించుకున్న క్రోషియా, స్లోవేనియాలను వెంటనే జర్మనీ గుర్తించింది. బోస్నియా-హెర్జిగోవినా ప్రాంతం వేర్పాటు గురించి ప్రజాభిప్రాయసేకరణ జరిపారు. తరువాత అది వేరే దేశంగా మారింది. సెర్బియా, మాసిడోనియా, మాంటినిగ్రోలుగా విడిపోయింది.
ఐరాస తీర్మానం ప్రకారం పాలస్తీనాను విభజించి ఇజ్రాయల్‌ను ఏర్పాటు చేశారు. ఏడున్నర దశాబ్దాల తరువాత చూస్తే ఆసలు పాలస్తీనా దేశమే లేదు. తమకు రక్షణకు హామీ ఉండాలంటే పాలస్తీనాలోని కొన్ని ప్రాంతాలు తమకు కావాలంటూ ఇజ్రాయల్ ఆక్రమించింది, తూర్పు జెరూసలెం పట్టణం కూడా తమదే అంటున్నది. పాలస్తీనా ప్రాంతాల్లో తమ జనాలకు నివాసాలు ఏర్పాటు చేసి వాటిని శాశ్వతంగా ఆక్రమించేందుకు పూనుకున్నా పశ్చిమ దేశాలకు పట్టలేదు.
నాటోను విస్తరించేది లేదని గతంలో రష్యాకు ఇచ్చిన హామీని నాటో, అమెరికా ఉల్లంఘించటమే తాజా పరిణామాలకు అసలు కారణం. తమ భద్రతకు హామీ కావాలని వివిధ వేదికల మీద, పలువిధాలుగా పుతిన్ చేసిన వినతిని పట్టించుకున్నవారు లేరు. అలాంటి హమీ ఉంటే ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి, సమగ్రతకు తాము హామీ ఇస్తామని ఎంత చెప్పినా పశ్చిమ దేశాలు పడనివ్వలేదు. ఎప్పుడూ నీరు పారే నదికి ఎప్పుడు, ఎలా వరదలు వస్తాయో, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో తెలియనట్లే అంతర్జాతీయ పరిణామాలు కూడా నిరంతరం ఒకే విధంగా ఉండవు. మనం కోరుకున్నట్లుగా నది పారదు, ఇవీ అంతే. స్వాతంత్య్రం కోరుకున్న ప్రాంతాలను అనేక కారణాలతో అన్ని దేశాలూ గుర్తించలేదు. రష్యాకు పొరుగున ఉన్న జార్జియాలోని అబ్కాజియా, ఒసెట్టి ప్రాంతాలు కోరుకున్న వేర్పాటును రష్యా మరికొన్ని దేశాలు మాత్రమే గుర్తించాయి. ఒకసారి వేరుపడిన దేశాలు ఇరుగుపొరుగున ఉన్న ఏ దేశంతోనైనా కలవవచ్చు, కలిసి విడిపోవచ్చు. ఈ రోజు బ్రిటన్‌గా పిలుస్తున్న దేశం నాలుగు ప్రాంతాలతో కూడిన ఐక్య రాజ్యం, దాని పూర్తి పేరు యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ బ్రిటన్ అండ్ నార్తరన్ ఐర్లండ్. దీన్నుంచి ఉత్తర ఐర్లండ్ విడిపోయి ఐర్లండ్‌తో కలవాలని కోరుకున్న వారు 116 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. మిగిలిన ఇంగ్లండ్, స్కాట్లండ్, వేల్స్ ప్రాంతాల్లో కూడా స్వతంత్ర దేశాలుగా ఏర్పడాలని కోరుకుంటున్నవారు ఉన్నారు. అలాంటి బ్రిటన్ ఐరోపా సమాఖ్యలో కలసింది, తరువాత విడిపోవటం తన హక్కంటూ పరిహారం చెల్లించి మరీ వెలుపలికి వచ్చింది. అనేక దేశాలను ఆక్రమించిన, స్వాతంత్య్రాన్ని వ్యతిరేకించిన అమెరికా ఇప్పుడు వేలుపెట్టని దేశం లేదు. అలాంటిది విడ్డూరంగాకపోతే ఉక్రెయిన్‌లో జరుగుతున్నదాని గురించి గుండెలు బాదుకోవటం ఏమిటి? పశ్చిమ దేశాలు నేర్పిన విద్యను పుతిన్ తిరిగి వారికి బోధిస్తున్నాడు అంతే!