Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఓ మహాత్మా... ఓ మహర్షి...' అంటూ గాంధీజీని స్మరించుకుంటూ సత్యా సత్యాల గురించి గీతాలాపన చేశాడు మహాకవి శ్రీశ్రీ. మహాత్మ అంటే గొప్ప ఆత్మకలవాడని అర్థం. ఆత్మ అంటే మనసు. ఒక నిబద్ధమైన, దృఢమైన మంచి మనస్సుకలవాడనీ చెప్పుకోవచ్చు. మహాత్మాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా నాయకుడిగా ఆయన చేసిన సేవలు, ఆచరణ, పాటించిన విలువలు మొదలైనవి స్మరించుకోవటమే కాక... ఇప్పటికీ మనం అనుసరించాల్సిన ఆచరణ, విలువలకీ, నేటి నాయకులు నెలకొల్పుతున్న విలువలకీ ఉన్న పోలికలను అర్థం చేసుకోవాలి. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పట్టుదలతో నిలబడి, ఆచరించి మనదేశంలో అశేష ప్రజానికాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గాంధీ. ఇక్కడే కాదు ప్రపంచ ప్రజల్లో నూతన ప్రభావాన్ని చూపిన ఆలోచనా పరుడు, ఆచరణశీలి. 20వ శతాబ్దంలో మానవాళిని ప్రభావితం చేసిన నాయకుల్లో ఒక్కడిగా మహాత్మాగాంధీ నిలుస్తాడు. సత్యాగ్రహం, అహింస అనే ఆయుధాలతో మన స్వాతంత్య్ర పోరాటంలో నిలిచినవాడు. ప్రజలందరినీ ఏకతాటిపై నిలిపిన మహానాయకుడు. మనం అంగీకరించలేని అంశాలు, ఆలోచనలు కొన్ని ఉన్నప్పటికీ జన హృదయాలను గెలిచిన నేత గాంధీజీ. ముఖ్యంగా మానవీయ విలువలను, సహనాన్ని, మత సామరస్యాన్ని, స్వేచ్ఛ స్వాతంత్య్రాలను, శాంతిని కోరుకుని, వాటి కోసం జీవితాన్ని అర్పించిన త్యాగధనుడు. ఆయన కోరుకున్న ఆశయాలు నెరవేరకపోగా పూర్తి వ్యతిరేకమైన ఆలోచనలు, ఆచరణలు రాజ్యమేలుతున్న వేళ గాంధీ స్మరణ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.
గాంధీ చేతిలో భగవద్గీత హస్తభూషణమై నిలిచినా, ఆధ్యాత్మిక పరాయణత్వం కలిగి ఉన్నా తను చేయాల్సిన పనులను, కర్తవ్యాలను కర్మకు వొదిలివేయలేదతడు. ఆచరించినది బోధించి, బోధించినదే ఆచరించిన నిజాయితీ పరుడు కావడం చేతనే అంతమందికి ప్రేరణ ఇవ్వగలిగాడు. తన నిరాడంబర జీవన విధానంతో సామాన్య ప్రజలను ఆకర్షించుకోగలిగాడు. కోట్లాది ప్రజల మద్దతు, అనుసరణ అతనికుంది కాబట్టే బలమైన సామ్రాజ్యవాదము సైతం బెదిరిపోక తప్పింది కాదు. ఆనాటి చారిత్రక పరిస్థితి, సందర్భం ప్రజల చేత గాంధీలాంటి ఒక మహానాయకుణ్ణి సృష్టించుకోగలిగాయి. అందుకే ఆనాటి చారిత్రక క్రమాన్ని అర్థం చేసుకోవటం ద్వారానే ఆయన వ్యక్తిత్వాన్ని ఆచరణను అవగాహన చేసుకోగలుగుతాము.
గాంధీజీ ప్రస్తావనరాగానే శాంతి అహింసల గురించి చెప్పుకుంటాం. హింస, అశాంతిని అసలు ఎవరు కోరుకుంటారు! ఇది గాంధీ ఆచరణలోనే విస్పష్టమవుతుంది. 'వందేమాతరం' అని శాంతియుతంగానే నినదించాం. కానీ లాఠీలు, తూటాలూ పేల్చింది ఎవరు? విదేశీ వస్తు బహిష్కరణ, విదేశీ విద్య బహిష్కరణ, ప్రభుత్వ పన్నులు చెల్లించేందుకు నిరాకరణ, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా పిలుపు... ఇవన్నీ గాంధీ మార్గంలోనే ఇచ్చిన పోరాట పిలుపులు. వీటన్నింటిలోనూ హింస, అణచివేత కొనసాగించింది నాటి రాజ్యం. అంటే హింస ఎప్పుడూ రాజ్యం నుండే ఉంటుంది. ఏ ఆధిపత్యమైనా, అధికారమైనా, ఘర్షణ, హింస లేకుండా సమసిపోదనేది కనపడుతున్న సత్యం. సామరస్యంతో, పరస్పర అవగాహనతో పీడనలు, దోపిడీ తొలగిపోవు అనే అంశం గాంధీ ఆచరణలోంచి అవగాహన చేసుకోవాల్సిన విషయం. దక్షిణాఫ్రికాలో వివక్షతను స్వయంగా ఎదుర్కొన్న ఆయన మన సమాజంలోని దళిత సమూహాలు ఎదుర్కొంటున్న అంటరాని తనంపై తీవ్రంగా ఆలోచించి, మానసిక పరివర్తనకు సంస్కరణలకు ఎంత పూనుకుని పనిచేసినప్పటికీ ఆ వివక్షతలను రూపుమాపలేకపోయాడు. అది నేటికీ కొనసాగుతూనే ఉంది.
అయితే విభిన్న మతాల సహజీవన సమ్మేళనంగా ఉన్న భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవటంలో గాంధీ కృతకృత్యుడయ్యాడు. అందుకే మత సహనాన్ని ఉద్బోధించాడు. మతపరమైన విద్వేషాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. మతాలకతీతంగా ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించేందుకు తీవ్రంగా శ్రమించారు. దాని కారణంగానే మతోన్మాది నాధూరామ్ గాడ్సే మహాత్మున్ని అంతమొందించాడు. ఇప్పుడు, మనమంతా జాతి పితగా పిలిచే గాంధీ హంతకుడి వారసులు అధికారంలో కొనసాగుతూ గాడ్సేను దేశభక్తుడుగా ప్రచారం చేస్తున్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయమే కాదు, భయంకర పరిణామం కూడా. అందుకనే మన దేశంలో మత విద్వేష హింస పెచ్చరిల్లుతున్నది. గాంధీ దేశ ప్రజల మధ్య ఐక్యతను కోరుకుంటే నేడు విభజన జరుగుతున్నది. రఘుపతి రామున్ని నిత్యం స్మరించే ఆధ్యాత్మిక సహనజీవిని, జైశ్రీరామ్ నినాదపు మతతత్వ విద్వేషం బలితీసుకుంది. మతం ఎప్పుడూ వైయక్తికమైనదే. దాన్ని రాజకీయాలలోకి తెస్తే విద్వేషం చిమ్మి విధ్వంసం సృష్టిస్తుంది. ఈ వర్తమాన పరిణామాలను గమనించి గాంధీ బోధనలను మననం చేయాల్సిన సందర్భం ఇది. స్త్రీ అర్థరాత్రి ఒంటరిగా తిరగగలిగితేనే అది నిజమైన స్వాతంత్య్రమన్న గాంధీ మాటలు తిరగబడ్డాయి. ప్రతిరోజు మహిళలపై పగటిపూటే అఘాయిత్యాలకు ఆధిపత్య గణాలు పాల్పడుతుంటే, పాలకులు మౌనంగా దౌర్జన్యాలను వీక్షిస్తుంటే, ఓ మహాత్మా! నీ విలువలు, బోధలు ఏమయ్యాయీ దేశంలో అని ఆవేదన చెందాల్సి వస్తోంది.