Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెవులు చిల్లులు పడేలా ఆర్తనాదాలు... అడుగడుగునా శవాలు... అప్పటిదాకా ఆనందాన్ని పంచిన మైదానం ఒక్కసారిగా రక్తసిక్తమైంది. కీడ్రాప్రాంగణం యుద్ధభూమిని తలపించింది. ఉత్కంఠగా సాగిన ఆట చివరికి మృత్యు ఘోష వినిపించింది. అభిమానం వెర్రితలలు వేసి క్రీడోన్మాదాన్ని వెళ్ళగక్కింది. ఆటగాళ్లపై వీరాభిమానం శృతిమించి దురాభిమానంగా మారితే, ఇలాంటి విషాదాలే చోటుచేసుకుంటాయి. తాము అభిమానించే జుట్టు గెలవాలని కోరుకోవడాన్ని తప్పుపట్టలేం. ప్రత్యర్థులు ఎల్లకాలం వెనుక వరుసలోనే ఉండాలని కోరుకోవడం ఎంత వరకు సమంజసం? ఇది క్రీడా స్ఫూర్తికే విరుద్ధం కదా! కొన్ని సందర్భాల్లో అభిమానులు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరమే కాదు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మొన్న శనివారం అర్థరాత్రి ఇండోనేషియాలో ఫుట్బాల్ మైదానంలో చోటుచేసుకున్న సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎన్నో కుటుంబాలను రోడ్డుపాలు చేసింది. ప్రపంచ క్రీడాచరిత్రలోనే అత్యంత విచారకర సంఘటనగా నిలిచింది.
ఆటలో గెలుపోటములు సహజం. అదే లేకపోతే పోటీ అన్నదానికి అర్థమే ఉండదు. ఒకరు ఓడితేనే .. మరొకరు గెలిచేది. ఆటగాళ్లైనా, అభిమానులైనా గెలుపోటములను సమానంగానే తీసుకోవాలి. అందుకు విరుద్ధంగా అభిమానులు రెచ్చిపోవడంతో క్రీడారంగం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. తాము అభిమానించే జట్టు పరాజయాన్ని తట్టుకోలేని ఆవేశాలతో కొందరు సృష్టించిన బీభత్సం ఏకంగా వందలాది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. ఇండోనేషియా ఫుట్బాల్ లీగ్లో శనివారం రాత్రి చిరకాల ప్రత్యర్థులైన పెర్సీ బారు, అరేమా జట్టు మధ్య జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క గోల్ తేడాతో 'అరేమా' పరాజయంపాలైంది. సొంత స్టేడియంలో ఆ ఓటమిని అంగీకరించలేని అభిమానులలో వీరావేశం కట్టలు తెంచుకుంది. అదే ప్రత్యర్థి జట్టుపై భౌతికదాడులకు తెగబడేలా చేసింది.
చిరకాల దాయాదుల మధ్య ఘర్షణ... యుద్ధవాతావరణాన్ని సృష్టించింది. పరిస్థితి చక్కదిద్దడానికి పోలీసుల ప్రయత్నాలన్నీ విఫలమే అయ్యాయి. లాఠీచార్జీలు, బాష్పవాయువులు, చివరి కాల్పులకు పాల్పడ్డారు. ప్రాణభయంతో జనం పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగి వందల సంఖ్యలో గాయపడ్డారు. అక్కడికక్కడే ముప్పైకి పైగా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో నాలుగు వందల మంది ఆస్పత్రి పాలయ్యారు. వారిలో తొంభైఒక్క మంది చికిత్స పొందుతూ తనువుచాలించారు. ఇక స్టేడియం బయట కూడా ఆందోళనలు మిన్నంటాయి. దాదాపు రెండు డజన్ల వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. పోలీసులు సైతం చేతులెత్తేశారు.
ఈ దుర్ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో... పరిస్థితులు అదుపులోకి వచ్చేవరకు ఫుట్ బాల్ స్టేడియంలో ఎలాంటి మ్యాచ్లు నిర్వహించ రాదని ఆదేశించారు. అంతే కాకుండా సమగ్ర దర్యాప్తుకు హూకుం జారీ చేశారు. కేవలం తాము అభిమానించే జట్టు పరాజయం పాలైందనే ఆక్రోశంతో కొందరు అభిమానులు సృష్టించిన దారుణమిది. సంఘటనను అందరూ ఖండిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖండనలు ఇవ్వడం, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీలు ఇవ్వడం ఆ తర్వాత మరిచిపోవడం షరా మాములే. ఇలాంటి సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. అయినా క్రీడా ప్రపంచం వాటి నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. ఒకవేళ నేర్చుకొని వుంటే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ ఎందుకు చోటుచేసుకుంటాయి?
ఈ విషాద ఘటన పూర్తి బాధ్యత అభిమానులదే అని అనలేము. ఇందులో.. నిర్వాహకుల పాత్రను కూడా తోసి పుచ్చలేం. ప్రస్తుతం ఇండోనేషియాలో జరిగిన ఫుట్బాల్ మైదానంలో కూడా పరిమితికి మించి ప్రేక్షకులను అనుమతించినట్లు ఆరోపణలున్నాయి. ఇది నిర్వహకుల ధనదాహాన్ని బట్టబయలు చేస్తుంది. మొన్నటికి మొన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టికెట్ల అమ్మకాలలో చోటుచేసుంది అదే. ఏదిఏమైనా అభిమానం ఉండడంలో తప్పులేదు. కానీ అది పరిధులు దాటి విశృంఖలం అయితేనే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటాయి. ఈ జాఢ్యం ఒక్క క్రీడారంగానికే పరిమితం అయిందనుకుంటే పోరపాటే. 'ఇందు కలదు అందులేదు' అన్నట్టు అన్నింటా అంటుకునే ఉంది. మన దేశంలో సినిమా హిరోల కోసం, రాజకీయనేతల కోసం ఎగబడటం.. విరగబడటం కొత్తేమి కాదు. అందుకు ఇందిరా గాంధీ మరణానంతరం జరిగిన సిక్కుల ఊచకోత, గోద్రా అనంతర పరిణామాలు... వైఎస్ఆర్, జయలలితల మరణాన్ని జీర్ణించుకోలేని వీరాభిమానులు తమను తాము కాల్చుకొని చనిపోవడం వంటివి అనేక ఉదాహరణలు మనముందున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వెర్రితలలు వేసే దురాభిమానం అనివార్యంగా హింసను ప్రేరేపిస్తుంది. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా అంతిమంగా బలైపోయేది అమాయకులే.