Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిదాన్నీ శాసించగలనన్న అహంకారి అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చమురు ఉత్పత్తిని తగ్గించాలన్న ప్రతిపాదన నుంచి ఒపెక్ (చమురు ఎగుమతి దేశాల సంస్థ)ను నివారించాలని గత కొద్ది నెలలుగా నయానా భయానా చూసిన అమెరికాకు చుక్కెదురైంది. ఇంధనాన్ని అస్త్రంగా చేసుకొని రష్యాను దెబ్బతీయాలన్న ఎత్తుగడ ఎదురుతన్నింది. నవంబరు నుంచి రోజుకు 20లక్షల పీపాల చమురు ఉత్పత్తిని తగ్గించాలని పదమూడు దేశాల ఒపెక్+ (ఒపెక్‌తో సమన్వయం చేసుకుంటున్న రష్యాతో సహా పదకొండు దేశాల ప్రతినిధులు) అక్టోబరు ఐదున వియన్నాలో జరిపిన సమావేశ నిర్ణయం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికి వారం రోజుల ముందు పీపా ధర 84 డాలర్లకు తగ్గగా ఈ నిర్ణయం తీసుకోవటం ఖాయమనే ఊహాగానాల నేపధ్యంలో క్రమంగా పెరుగుతూ గురువారం ఇది రాస్తున్న సమయానికి 94 డాలర్లకు అటూ ఇటూగా ఉంది. క్రిస్మస్ నాటికి వంద డాలర్లకు చేరవచ్చని కొందరి అంచనా. రోజుకు 421లక్షల పీపాల చమురు ఉత్పత్తి చేయాలని గతంలో ఒపెక్+ నిర్ణయించగా 387 లక్షల పీపాలు మాత్రమే ఆగస్టు 19న వెలికి తీశారు. అందువలన 20లక్షలు తగ్గింపని చెప్పినా అంత ఉండకపోవచ్చని కొందరి ఆశ.
రష్యా నుంచి ఇంధన కొనుగోలు పూర్తిగా నిలిపివేయటం వెంటనే జరిగేది కాదు గనుక డిసెంబరు ఐదునుంచి విడతల వారీ ఆంక్షలను మరింత పెంచాలని అమెరికా కూటమి నిర్ణయించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా తాము చెప్పిన ధరలకు మించి ఎవరైనా కొనుగోలు చేస్తే తమ కొరడా దెబ్బలు తినాల్సి వస్తుందని భారత్‌తో సహా ఇంధన దిగుమతి దేశాలకు ఆ కూటమి హుకుం జారీ చేసింది. ఆ ఫర్మానాను ఆమోదించి, అమలు జరిపే దేశాలకు తామసలు ఇంధనాన్ని అమ్మేది లేదని రష్యా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ వివాదంతో తమకెలాంటి సంబంధం లేదని, రష్యా మీద విధించిన ఆంక్షలు అమలు జరిగితే తమ ఉత్పత్తి ధరలూ తగ్గే అవకాశంతో పాటు రేపు సదరు అస్త్రాన్ని తమ మీద కూడా ప్రయోగిస్తే దిక్కేమిటని చమురు ఎగుమతి దేశాలు ప్రశ్నిస్తున్నాయి. చమురు ధరలను తగ్గించి తమ దేశంలో జనాన్ని సంతృప్తి పరచి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బైడెన్ సర్కార్ తన అత్యవసర నిల్వల నుంచి పదే పదే ముడి చమురును మార్కెట్లోకి వదలటం కూడా ఒపెక్ దేశాలకు ఆగ్రహం తెప్పించింది. అందుకే అమెరికా, ఇతర పశ్చిమ దేశాల బెదిరింపులను ఖాతరు చేసేది లేదని స్పష్టం చేశాయి.
వియన్నా ఒపెక్+ సమావేశ నిర్ణయాల పర్యవసానాల గురించి పండితులు ఇప్పుడు తర్జన భర్జన పడుతుండగా పరిస్థితిని ఎదుర్కొనేందుకు పాలకులు సన్నద్ధమవు తున్నారు. తన ఎన్నికల ప్రచారంలో సౌదీ అరేబియాను ఒక అంటరాని దేశంగా వర్ణించిన అమెరికా అధినేత జో బైడెన్ దిగివచ్చాడు. అంతేనా, జూలై నెలలో సౌదీ వెళ్లి రాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను కౌగిలించుకొని ఉత్తినే, ఎన్నికల్లో అనేకం అంటాం, అదంతా జుమ్లా, పట్టించుకోవద్దు సోదరా అన్నట్లుగా తీపి మాటలు మాట్లాడి వచ్చే రోజుల్లో చమురు ఉత్పత్తిని పెంచుతారని అశిస్తున్నా అంటూ మన్‌కీ బాత్ వెల్లడించాడు. ఎక్కడన్నా బావేగాని చమురు బావి దగ్గర కాదంటూ ఒపెక్ సారధి, అమెరికా తరువాత రెండవ పెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న సౌదీ అరేబియా చేతలతో బదులిచ్చింది. ఈ చర్యతో తాము చైనా, రష్యాలకు దగ్గర అన్న సందేశమిచ్చింది. రెండవది 2008లో తలెత్తిన మాంద్యం కారణంగా అప్పుడు 150 నుంచి 30డాలర్లకు చమురు ధర పడిపోయి నష్టపడటం ఇంకా కళ్ల ముందే కనిపిస్తున్నందున తమ జాగ్రత్తలు తాము తీసుకుంటున్నట్లు చమురు దేశాలు చెబుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన తరువాత 125డాలర్ల వరకు పెరిగిన ధర తరువాత గణనీయంగా తగ్గింది.
ఓపెక్+ రష్యాతో చేతులు కలపటంతో పాటు ప్రపంచ ఆర్థికాన్ని దెబ్బతీస్తున్నదని అమెరికా ఆరోపిస్తోంది. ధరల పెంపు, ఉత్పత్తి నియంత్రణకు ఒక కూటమిగా మారుతున్న చమురు దేశాలు పోటీ తత్వాన్ని దెబ్బతీస్తున్నందున వాటిమీద దావాలు వేసేందుకు వీలుకల్పించే నోపెక్ చట్టాన్ని రూపొందిస్తామని కూడా అమెరికా బెదిరింపులకు దిగింది. వైట్‌హౌస్ వత్తిడిలో భాగంగా సౌదీకి ఆయుధాలు, విమాన విడిభాగాల సరఫరా నిలిపివేయాలని అధికారపక్షానికి చెందిన ఎంపీ రో ఖన్నా వంటి వారు బెదిరింపులకు దిగుతున్నారు. సౌదీ పట్ల కఠినంగా ఉండాలని, మనకు వారి అవసరం కంటే వారికే మన అవసరం ఎక్కువ అంటూ బీరాలు పలుకుతున్నాడు.
ఎవరి ప్రయోజనాన్ని వారు చూసుకుంటున్నందున ఇంథన రంగంలో ఇప్పటికే భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన తాము నష్టపడి, ఒకరి పక్షంలో ఎందుకుండాలని ఒపెక్ దేశాలు అంటున్నాయి. ''ఐరోపాలో వారి స్వంత కథ వారిది, రష్యాకు దాని కథ దానికి ఉంది, మేము ఏదో ఒక దేశం వైపు ఉండలేమని'' ఐక్య అరబ్ ఎమిరేట్స్ ఇంథనశాఖ మంత్రి మజరౌఇ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. తమను దెబ్బతీసేందుకు పూనుకున్న నాటో కూటమిని దెబ్బతీసేందుకు ప్రతిగా రష్యా గాస్ సరఫరాలకు కోత పెట్టినందున ఐరోపా దేశాలు గిజగిజలాడుతున్నాయి. ఇప్పటికే మాంద్య ముప్పు ముంగిట ఉన్న ధనిక దేశాలు, చమురు దేశాల నిర్ణయంతో మరిన్ని తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.