Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పీల్చే ముందు ఒకసారి గాలిని కూడా తనిఖీ చెయ్... లేదా ఈ గాలిలో ఎన్ని రాజకీయాలో, ఎన్ని అరాచకీయాలో...'' అంటాడు అలిశెట్టి ప్రభాకర్. కానీ, దీనికి స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థయిన ఎన్నికల సంఘం (ఈసీఐ) కూడా మినహాయింపు కాదా? అన్నది ఇప్పుడు అందరి మెదళ్లనూ తొలుస్తున్న సమస్య! తన ''నైతిక ప్రవర్తనా నియమావళి (మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)కి ఎన్నికల సంఘం ప్రతిపాదిస్తున్న సవరణలే ఈ సందేహానికి కారణం. రాజకీయపార్టీలు తమ మ్యానిఫెస్టోల్లో ఇచ్చిన హామీల అమలుకు ఆర్థికవనరులను ఎలా సమీకరిస్తాయో, అవి రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితులను ఎలా ప్రభావితం చేస్తాయో తమకు వివరణ ఇవ్వాలన్నదే ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదిస్తున్న తాజా సవరణ. ఈ సవరణపైకి సాధారణంగానే కనిపిస్తున్నా సారాంశంలో దీని ప్రయోజనమేమిటన్నది ఇప్పుడు తరచి చూడాలి.
రాజ్యాంగం నిర్దేశిస్తున్న ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికలను స్వేచ్ఛగా, సక్రమంగా, న్యాయబద్ధంగా జరపడం మాత్రమే ఎన్నికల సంఘం పని. ఆ పనినే సక్రమంగా నిర్వహించలేకపోతున్న ఎన్నికల సంఘం ఇప్పుడు కొత్త బాధ్యతలు నెత్తికెత్తుకుని సాధించగలదా? అంతటి యంత్రాంగం, నైపుణ్యాలు ఎన్నికల సంఘానికున్నాయా? అన్నవి జవాబులేని ప్రశ్నలు! అయినప్పటికీ ఈ సవరణకు ఎందుకింత ఉత్సాహపడుతోంది? నిన్నటిదాకా అది తమ పనికాదని చెప్పిన ఎలక్షన్ కమిషన్, ప్రధాని సహా పాలకపక్ష నేతలంతా ఉచితాలపై అనుచిత వ్యాఖ్యానాలు చేస్తూ రాష్ట్రాల హక్కులపై, పేదల సంక్షేమంపై దాడులకు తెగబడుతున్న వేళ... ఉన్నట్టుండి ఈ సవరణకు ఉరుకులాడటం ఆశ్చర్యానికే కాదు, పలు అనుమానాలకూ, ఆందోళనలకూ గురిచేస్తుంది. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తినే సందేహాస్పదంగావిస్తోంది.
నిజానికి ఎన్నికల నిర్వాహణే తప్ప, ఎన్నికల్లో రాజకీయ పార్టీలు వాగ్దానం చేసే సంక్షేమ పథకాలను, విధాన నిర్ణయాలను నియంత్రించడం ఎన్నికల సంఘం పనికాదు. ఇది ఎన్నికల సంఘమే స్వయంగా అంగీకరించిన సత్యం. ఉచితాలపై పాలకపార్టీ నేతలు కొందరు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకు ఏం చెప్పింది? ఎన్నికల మ్యానిఫెస్టోల్లో హామీలు, విధాన నిర్ణయాలను ప్రకటించడం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కు అని చెప్పింది. దీనిని నియంత్రించలేమనీ, కాదని అందుకు పూనుకుంటే అది మా పరిధులను అతిక్రమించడమే అవుతుందనీ లిఖితపూర్వకంగా స్పష్టం చేసింది. ఇది వాస్తవం కూడా. కానీ ఇప్పుడు అదే ఎన్నికల కమిషన్ అందుకు విరుద్ధంగా ఈ వివాదాస్పద వైఖరి తీసుకోవడం దేనిని సూచిస్తోంది? ఏలినవారి వత్తిళ్లకు తలొంచు తోందా? అదే నిజమైతే దీని స్వయం ప్రతిపత్తికీ, నిస్పక్షపాతానికీ అర్థమేమిటి? రాజకీయ పార్టీల నైతికత సంగతి తరువాత, ముందు ఎన్నికల సంఘం నైతికత మాటేమిటి? అన్న ప్రశ్నలు తలెత్తక మానవు.
ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఉన్న అంశాలే అనేకం అమలుకు నోచుకోవడం లేదు. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్నీ, మద్యం ప్రభావాన్నీ ఎన్నికల సంఘం నియంత్రించలేక పోతోంది. ఎన్నికల్లో కుల మత విభజనలనూ, విద్వేషాలనూ అడ్డుకోలేక పోతోంది. ఎన్నికల్లో నేర స్వభావం గల నేతలనూ నివారించలేకపోతోంది. తన నియంత్రణలోని అతిక్రమణలనే అడ్డుకోలేని ఎన్నికల సంఘం, తన పరిధికి మించిన రాజకీయ జోక్యానికి ప్రయత్నించడం అవాంఛనీయం, రాజ్యాంగ విరుద్ధం. నిజంగా తెల్చాలనుకుంటే ఉచితాలకన్నా ఎన్నికల ప్రక్రియను భ్రష్టుపట్టిస్తున్న ఎలక్ట్రోరల్ బాండ్ల వంటి కీలకమైన అంశాలనేకం ఉన్నాయి. వాటన్నిటినీ వదిలేసి ఏలినవారి ఆలోచనలకు ఊడిగం చేయడానికి వ్యవస్థలు దిగజారితే అంతకన్నా విషాదమేముంటుంది?
చూస్తుంటే ఉచితాలైనా, అనుచితాలైనా ఇస్తే గిస్తే తామే ఇవ్వాలి, వాటిని ఆశగా చూపి గెలిస్తే తామే గెలవాలి తప్ప, రాష్ట్రాలను మాత్రం వాటి జోలికి పోకుండా ఆర్థిక నియంత్రణలో బంధించా లన్నట్టుగా ఉంది కేంద్ర పాలకుల తీరు. లేదు నిజంగానే ఉచితాలు ఆర్థికాభివృద్ధిని కుంటు పరుస్తాయని భావిస్తే ఆ విషయాన్ని నేరుగా ప్రజలకు చెప్పి, ఎన్నికల బరిలో తేల్చుకోవాలి. అంతేగాని, వ్యవస్థలను లోబరుచుకుని దొడ్డిదారిన తమ ప్రయోజనాలను సాధిస్తామంటే అది ఎలా సమంజస మవుతుందీ, దీనికి వంతపాడితే వ్యవస్థల స్వతంత్రతకు విలువేముంటుంది? ఇప్పటికే తన పరిధిని దాటి ఈ అంశంలో తలదూర్చి న్యాయవ్యవస్థ తన ఔన్నత్యాన్ని ప్రశ్నార్థకం చేసుకుంది. ఇప్పుడు వంతు ఎన్నికల సంఘానిదయింది. నిజానికి ఇందులోని ఉచితానుచితాలు తేలాల్సింది ప్రజాక్షేత్రంలోనే. తేల్చుకోవాల్సింది ప్రజలే. అలిశెట్టి ప్రభాకరే చెప్పినట్టు... ''అయిందేండ్ల కోసారి అసెంబ్లీలోకి మొసళ్లూ పార్లమెంటులోకి తిమింగలాలూ ప్రవేశంచడం పెద్ద విశేషం కాదు.. జనమే ఓట్ల జలాశయాలై వాటిని బతికించడం విషాదం..?'' కాబట్టి మార్పు రావాల్సింది ప్రజల్లో. మార్పు తేవాల్సింది ప్రజలు. వీలైతే సమాజంలో ఆ చైతన్యానికి పాటుపడాలే తప్ప, దీనినొక అవకాశంగా తీసుకుని ఏలికలకు వంతపాడటం వ్యవస్థలకు తగని పని.