Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''రారోయి మాఇంటికీ మామా మాటున్నది, మంచి మాటున్నది. ఆకలైతే సన్న బియ్యం కూడున్నది. ఆపైన రొయ్యపొట్టు చారున్నది.'' అరవై ఏండ్ల క్రితం దొంగరాముడు సినిమాలో వచ్చిన ఓ జానపద గీతం ఇప్పటికీ వీనుల విందు చేస్తుంది. వినటానికే కాదు, తినటానికీ నోరూరే ఆహారం గురించీ ప్రస్తావన చేస్తుంది. అలాంటి ఇలాంటి ఆహారం కాదు, మాంసాహారం గురించే... మొన్నామధ్య ఆరెస్సెస్ చీఫ్ భగవత్ మాట్లాడిన మాటలు విన్నప్పుడు గత చరిత్రలోకి వెళ్ళాల్సివచ్చింది. అప్పుడు పాటలు కూడా గుర్తుకొచ్చాయి. మాంసాహారం మానవ జాతి పరిణామంలో భాగంగా అలవడ్డదే తప్ప అది మతానికి సంబంధించినది కాదు. అధికారంలో ఉన్న పార్టీ, దాని మాతృసంస్థ ప్రతిసారీ ఆహారపు అలవాట్ల మీద మత విద్వేషాలను సృష్టించాలనుకోవడం, హింసకు పాల్పడటం మనం చూస్తున్నాము. మాంసాహారం తీసుకోవడం వల్ల హింసా లక్షణాలు పెరుగుతాయని, హింసకు పాల్పడతారని ఆయన చెప్పటం కొత్తేమీకాదు గానీ నిండా అశాస్త్రీయత నింపుకొని ఉన్నది మాత్రం వాస్తవం. హింస అనేది ఆధిపత్యంలోంచి వస్తుంది. ఆధిపత్యం దోచుకోవడం కోసం వస్తుంది. చరిత్ర ఆధారంగా ఉన్న అసలైన వాస్తవం ఇది.
ప్రపంచ చరిత్రలో చూసినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడయి లక్షలాది జనులను చంపిన హిట్లర్ శాకాహారియే. అంతెందుకూ... అహింసను బోధించిన మన మహాత్మాగాంధీని హతమార్చిన హింసోన్మాది గాడ్సే కూడా వీళ్లలాంటి శాకాహారే కదా! నోబుల్శాంతి బహుమతి గ్రహీతలందరూ శాఖాహారులేమీ కాదు. అంతెందుకు, నిత్యం మనం పూజించే సహనశీలుడూ, గుణ సంపన్నుడూ శ్రీరామచంద్రుడూ మాంసాహారే! ఇలా ఎన్నయినా చెప్పుకుపోవచ్చు. వీటి వల్ల తేలే అంశమేమంటే ఆహారానికీ హింసకూ, హింసా ప్రవృత్తికీ సంబంధమే లేదనేది. వీరి ఆరాధ్యుడైన మనువు కూడా 'ప్రజాపతి యావత్ ప్రపంచాన్ని జీవాత్మ పోషణ కోసమే సృష్టించాడు. ఈ చరా చర జగత్తంతా జీవాత్మకు ఆహారమే' అని అంటాడు.
వీరు పవిత్రమైన జ్ఞాన భండాగారమని చెబుతున్న వేదాలలో సైతం, ముఖ్యంగా రుగ్వేదంలో జంతు బలులూ, పౌష్టిక ఆహార విషయాలకు సంబంధించిన ప్రస్తావనలో మాంసాహారానికి సముచిత స్థానం కల్పించబడింది. ఆనాటి దేవతలకు నిర్దిష్ట ఆహార నియమాలు ఉన్నాయి. ఇంద్రుడికి వృషభం అంటే మక్కువనీ, అగ్నిదేవునికి గుర్రాలు, ఎద్దులు, ఆవుల మాంసమంటే ఎనలేని ప్రీతి అని రుగ్వేదంలో వివరించబడింది. 'తైత్తరేయ బ్రాహ్మణం'లో వాస్తవానికి ఆవు మన ఆహారం (అథో అన్నం వారు గోవః) అని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇక మనువు చెప్పిన తినదగిన జంతువుల జాబితాలో ముళ్లపంది, అడవి పంది, ఉడుము, ఖడ్గమృగం, తాబేలు, కుందేలు వంటి వాటితో పాటు ఆవుకూడా ఉన్నది. సమాజ చరిత్రను మనం తెలుసుకున్నట్లయితే జంతువులను వేటాడి, ఆదిమానవులు తమ ఆహారాన్ని సమకూర్చుకున్నారని, ఆయా సామాజిక, భౌగోళిక ప్రత్యేకతల ఆధారంగా ఆహారపు అలవాట్లు, జీవన మనుగడ కొనసాగిందనేది స్పష్టమవుతుంది. ఇకపోతే శారీరక శ్రమ చేసే సమూహాలకు కావలసిన శక్తి మాంసాహారము నుండే సమకూరుతుంది. ఏ పనీ లేక కూర్చొని సంపద పోగేసుకునే వర్గాలకు తిన్నా అరగదు కదా! ఇదో పార్శ్వం. అందుకనే శ్రామికవర్గాలు చాలా వరకు మాంసాహారులుగానే ఉన్నారు.
సాంస్కృతిక పరమైన వైవిధ్యత, భిన్నత్వము ఉండటానికీ హింసాలోచనలకూ ఏవిధమైన సంబంధమూ ఉండదు. వైవిధ్యాలను వైరుధ్యాలుగా చూపి, అందులోనూ మతాలను ఆపాదించి విద్వేషాలను రెచ్చగొట్టటం విచ్ఛిన్న కారుల విషప్రచారం మాత్రమే. సంస్కృతిలో భిన్నత్వం ఉన్నప్పటికీ ఐక్యంగా సామరస్యంగా కొనసాగటం మన సమాజ ప్రత్యేకత. ఇప్పటికీ దేశంలోని ఈశాన్య ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లకూ, ఉత్తర ప్రాంత జనుల అలవాట్లకూ, దక్షిణ ప్రాంత ఆహారానికీ తేడాలున్నాయి. ఆహారమే కాదు, సంప్రదాయాలు, ఆహార్యాలూ, భాషలు అన్నింటిలోనూ వైవిధ్యముంది. ఎక్కువశాతం ప్రజలు మాంసాహారులుగానే ఉన్నారు. అంతమాత్రాన వారందరూ హింసా ప్రవృత్తితో లేరు.
నేడు మన దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య అందరికీ అవసరమైన తిండి అందుబాటులో లేకపోవడం. మొత్తం దేశంలో దాదాపు ముప్పయికోట్ల మంది జనులు మూడుపూటలా తిండి దొరకక ఆకలితో ఉంటున్నారు. ఆదివాసీలు, వివిధ గిరిజన తెగలు, దారిద్య్రంలో మగ్గుతున్న వాళ్ళు, లక్షలాది మంది కడుపు నింపుకోవటానికి ఏదీ దొరక నకనకలాడుతున్నారు. డెబ్బయిఐదేండ్ల స్వాతంత్య్రనంతరం కూడా తిండి, బట్ట, ఇల్లులేని జనం ఒకవైపుండగా, వీటిని అదించాల్సిన బాధ్యతను విస్మరించిన పాలకులు ఈ విధమైన వివాదాలను ముందుకు తేవడం ప్రజలను తప్పుదారి పట్టించడమే. సామాన్య జనం వారి నిజమైన సమస్యలను పరిష్కరించాలని ఎక్కడ నిలదీస్తారోనని ఇలాంటి వైషమ్యాలను సృష్టిస్తారు. వారి పన్నాగాలను పసికట్టి అరికట్టకపోతే మనం అనేక ఇక్కట్లకు గురికాక తప్పదు.