Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది. పిచ్చి ముదిరి పాకాన పడితే అది పీక్ స్టేజీకెళ్లి ఎదుటోళ్లకు పిచ్చెక్కిస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రహసనంలో బీజేపోళ్ల పిచ్చి ఇదే మాదిరిగా పీక్ స్టేజీకెళుతున్నది. దొంగే... దొంగ దొంగా అని అరిచినట్టుగా ఆ పార్టీ నేతలు ఇప్పుడు ప్రేలుతున్న ప్రేలాపనలు వారి అజ్ఞానాన్ని బట్టబయలు చేస్తున్నాయి. కరోనా సమయంలో ప్రపంచం మొత్తం శాస్త్రీయ వైద్యాన్ని నమ్ముకుని బతికి బట్టకట్టేందుకు ప్రయత్నిస్తే, మన ఢిల్లీ పీఠాధిపతులు మాత్రం... చప్పట్లు కొట్టండి, పళ్లాలు బాదండి, కొవ్వొత్తులు వెలిగించండంటూ చెప్పి జనాల్ని అసలు విషయం నుంచి ఏమార్చేందుకు ప్రయత్నించి అభాసుపాలయ్యారు. ఫలితంగా దేశంలో శవాలు గుట్టలుగా తేలాయి. రాష్ట్రంలో అదే పీఠాధిపతుల వారసులైన కమలం పార్టీ అధ్యక్షుల వారు ఇప్పుడదే రీతిలో రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేసి... కొంగొత్త పోకడలకు తెరతీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ను ఏర్పాటు చేయటం వెనుక క్షుద్ర శక్తులు దాగున్నాయనీ, ఒక తాంత్రికుడి సూచనల మేరకే సీఎం బీఆర్ఎస్ను ఏర్పాటు చేస్తున్నారంటూ ప్రవచించటం ద్వారా ఆయన తనదైన ట్రేడ్ మార్క్‌ను ప్రదర్శింపజూశారు.
ఇక్కడే అసలు సిసలు రాజకీయం దాగుంది. అదే అధ్యక్షుల వారి పార్టీ దేశం మొత్తం మీద దివాళా కోరు తిరోగమన భావాలను అవలంభిస్తూ భారతాన్ని వందల ఏండ్లపాటు వెనక్కి తీసుకెళుతున్నదని పలు అంతర్జాతీయ సర్వే సంస్థలు మొత్తుకుంటున్నాయి. పురాణాల కాలంలోనే మనం ప్లాస్టిక్ సర్జరీలు చేశాం.. రైట్ సోదరుల కంటే ముందే పుష్పక విమానాన్ని కనుగొన్నాం..ఆవు మూత్రమే సర్వరోగ నివారిణి.. అప్పడాలు తింటే కరోనా దరి చేరదని చెప్పటం ద్వారా మంత్రాలకు చింతకాయలు రాలుతాయనే విధంగా జనాన్ని మభ్య పెట్టేందుకు కమలనాథులు శతవిధాలా ప్రయత్నించిన సంగతి మనకు తెలిసిందే. ఆ ప్రయత్నాల ప్రహసనం గత ఎనిమిదేండ్ల నుంచి కొనసాగతున్నది.. మున్ముందూ కొనసాగుతుందనటంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. ఆ ప్రహసనాల్లో భాగంగానే ఇక్కడ బీజేపీ 'బండి...'ని లాగుతున్న అధ్యక్షుల వారు క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలంటూ వ్యాఖ్యానించటాన్ని మనం అర్థం చేసుకోవాలి.
అసలు అటు జాతీయ స్థాయిలోగానీ, ఇటు రాష్ట్ర స్థాయిలోగానీ ఇలాంటి రాజకీయ 'మంత్ర తంత్రాలను...' 'ఫ్లవర్' బారులు ఎందుకు ప్రయోగిస్తున్నారనేదే ఇప్పుడు అత్యంత కీలకాంశం. ఏ మాటల వెనుక ఏ అర్థాలు దాగున్నాయో తెలుసుకోనంత వరకూ జనం మళ్లీ మళ్లీ మోసపోతారంటూ ఒక మహానుభావుడు హెచ్చరించిన విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. వాస్తవానికి ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభ, సంక్లిష్ట పరిస్థితులను దేశం ఎదుర్కొంటోంది. పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతుండటంతో వాటి ప్రభావం సరుకు రవాణాపై తీవ్రంగా పడింది. ఫలితంగా నిత్యావసరాల ధరలు చుక్కలను చూస్తున్నాయి. వంట గ్యాస్ ధర సామాన్య, మధ్య తరగతి బతుకుల్లో మంటలు రేపుతున్నది. జీడీపీ, రూపాయి విలువ అథ:పాతాళానికి చేరాయి. విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. నిరుద్యోగం, దరిద్రం, ఆకలి విలయతాండవం చేస్తున్నాయి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ గాలికి కొట్టుకుని పోయింది. ఒక్క రైల్వే శాఖలోనే 16 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయంటూ ఘనత వహించిన కేంద్ర ప్రభుత్వమే లెక్కలు చెప్పింది. వీటిలో ఒక్క పోస్టునూ భర్తీ చేయకపోగా.. సైన్యంలో సైతం అగ్నిపథ్‌ను తీసుకొచ్చి అగ్నికి ఆజ్యం పోసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ మోడీజీ ఊదరగొడుతున్న వేళ... గొప్పగా చెప్పుకుంటున్న వందేమాతర్ రైళ్లు బర్రెలు గుద్దితేనే పప్పు పప్పవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ కమలం పార్టీకి చెప్పుకోవటానికి ఒక్కటంటే ఒక్క మంచి ముచ్చట లేదు. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలంటే ఏదో ఒక కుట్రనూ, కుతంత్రాన్నీ పన్నాలి. ఆ కుతంత్రంలోంచి పుట్టినవే బండి వారి తాంత్రిక విద్యలు, క్షుద్రపూజల వ్యాఖ్యలు.
అయితే ఇలా అర్థంపర్థం లేకుండా తొండి మాటలు మాట్లాడే నాయకాగ్రేసరులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. సాయుధ పోరాటానికి ఊపిరిలూదిన తెలంగాణ గడ్డ మీద... మంత్రించిన నిమ్మకాయలు, నల్ల పిల్లుల్లాంటి మూఢ నమ్మకాలకు స్థానం ఉండబోదు. బత్తాయిలు అధికారంలో ఉన్న యూపీలాంటి రాష్ట్రాల్లో భూత వైద్యాన్ని ఒక కోర్సుగా ప్రవేశపెడితే పెట్టొచ్చుగాక... కానీ అలాంటి టక్కుటమారా గజకర్ణ గోకర్ణ విద్యలు చైతన్యవంతమైన తెలంగాణలో సాగబోవు. పశువుల కాపర్లతో సైతం బందూకులు పట్టించిన ఈ గడ్డలో ఓ భాగమైన మునుగోడులో అలాంటి ఆటలు ఆడితే నడ్డి విరగటం ఖాయం. ఎందుకంటే అది విప్లవ భావాల అడ్డా.