Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత పక్షం రోజుల్లో ఉక్రెయిన్ సంక్షోభంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రజ్రాభిప్రాయ సేకరణలో వెల్లడైన సమ్మతికి అనుగుణంగా నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాలు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకోవటం, దాన్ని పుతిన్ వెంటనే గుర్తించి ఒప్పందం ద్వారా రష్యాలో విలీనం చేయడం తెలిసిందే. దాంతో దిక్కుతోచని పశ్చిమ దేశాలు మరింతగా రెచ్చగొట్టేందుకు తెరలేపాయి. దానిలో భాగమే కెర్చ్ రోడ్డు, రైలు వంతెనల పేల్చివేతకు పాల్పడిన ఉగ్రవాద చర్య. నాలుగు ప్రాంతాల విలీనాన్ని ఖండిస్తూ గురువారం నాటి ఐరాసా సాధారణ అసెంబ్లీ తీర్మానంపై రహస్య ఓటింగ్ జరపాలన్న రష్యా డిమాండ్‌ను తిరస్కరించిన భారత్ చైనా మరో 35దేశాలతో కలసి ఓటింగ్‌ను బహిష్కరించింది. రష్యా, బెలారస్, ఉత్తర కొరియా, సిరియా, నికరాగువా వ్యతిరేకంగా, అమెరికా కూటమితో సహా 143 అనుకూలంగా ఓటు వేశాయి. పాలస్తీనా, క్యూబాలకు మద్దతుగా ప్రతి ఏటా ఐరాస సాధారణ అసెంబ్లీ ఇలాంటి ఓటింగ్‌లనే నిర్వహిస్తుంది. అమెరికా, ఇజ్రాయిల్ మరొకటో రెండు దేశాలో తప్ప అన్ని దేశాలూ అనుకూలంగా ఓటేస్తున్నా జరుగుతున్నదేమీ లేదు. ఇప్పుడు ఈ ఓటింగ్ గతీ అంతే. భద్రతా మండలి తీర్మానాలనే వీటో చేసిన అమెరికా, ఇతర దేశాల ఉదంతాలు తెలిసిందే. ఇది పుతిన్‌పై సాగిస్తున్న ప్రచారదాడిలో భాగం తప్ప మరొకటి కాదు.
రోజులు గడిచే కొద్దీ కొత్త సందేహాలు, సమస్యలు వస్తున్నాయి. తాజా పరిణామాలను ఉక్రెయిన్-రష్యా సంక్షోభ పునరుద్భవంగా కొందరు పేర్కొన్నారు. తమకు వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పించాలని ఉక్రెయిన్ నేత జెలెనెస్కీ పశ్చిమ దేశాలను వేడుకున్నాడు. అలాంటి రక్షణ కల్పించాలంటే నాటో దేశాలు నేరుగా రంగంలోకి దిగినట్లే, అది పరోక్షంగా ఉక్రెయిన్‌కు నాటో తీర్థమిచ్చినట్లే. అందుకే అలాంటి పని చేస్తే సహించేది లేదని, అదే జరిగితే మూడవ ప్రపంచపోరు వస్తుందని పుతిన్ అధికారి ఒకరు హెచ్చరించారు. కెర్చ్ వంతెనల పేల్చివేతకు ప్రతిగా సోమవారం నుంచి ఉక్రెయిన్ మిలిటరీ వ్యవస్థలతో పాటు విద్యుత్ కేంద్రాలు ఇతర కీలక కట్టడాలపై పుతిన్ దళాలు దీర్ఘశ్రేణి క్షిపణుల దాడులు జరుపుతున్నాయి. అనేక పట్టణాలు అంధకారంలోకి జారాయి. రాజధాని కీవ్‌లోని కొన్ని కీలక కేంద్రాలపై క్షిపణిదాడులు జరిగినా జెలెనెస్కీ నివాసం, అధికార కేంద్రా లపై ఇంతవరకు గురిపెట్టలేదు. ఇక ముందు అది జరగదని చెప్పలేం.
ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను మొత్తంగా చూస్తే మానవ నష్టాన్ని పరిమితం చేసేవిగా రష్యా దాడులున్నాయి. ఇక ముందు అలానే ఉంటాయా లేదా అన్నది ఎర్ర గీతలు దాటి రెచ్చగొడుతున్న పశ్చిమ దేశాలు, వాటిలో కీలుబొమ్మగా మారిన ఉక్రెయిన్‌పై ఆధారపడి ఉంది. తనపై విధించిన ఆంక్షల కారణంగా ఐరోపాకు ఇంధన సరఫరా నిలిపివేసిన రష్యాను దెబ్బతీసేందుకు నోర్డ్‌స్ట్రీమ్ పైప్లైన్లను కొన్ని చోట్ల ధ్వంసం చేశారు. రష్యా మహిళా జర్నలిస్టు దర్యా దుగీనాను హత్య చేశారు. కెర్చ్ వంతెనల పేల్చివేతకు చూశారు. రష్యా సరిహద్దు లకు టాంకులు, క్షిపణులను తరలిస్తున్నారు. తొలి రోజుల్లో చర్చలకు సిద్దమన్నట్లు జెలెనెస్కీ కనిపించినా అదంతా ఉత్తిదే అని తేలింది. తదుపరి చర్చలను నిషేధించే ఒక ఫర్మానాను జెలెనెస్కీ విడుదల చేసిన తరువాత అసలు స్వరూపం వెల్లడైంది. తాజాగా ఇప్పటికైనా తాము చర్చలకు సిద్దమని రష్యా ప్రకటించగా జెలెనెస్కీ తిరస్కరించాడు. దేశం శిధిలమైనా, జన జీవితాలు అతలాకుతలమైనా పశ్చిమ దేశాలకు సేవ, కుట్ర నుంచి తగ్గేదేలే అంటున్నాడు. నాటో కూటమి వైఖరి కూడా అంతే. పోరాడు, ముందుకు దూకండి, జనం చస్తే చావనివ్వండి, పరాయి దేశాల పంచల్లో చేరితే చేరనివ్వండి, మీ నాశనమే మాకు లాభాల రక్ష అన్నట్లుగా అస్త్రాలను అందిస్తున్నాయి. ఉక్రెయిన్ను ఎగదోస్తూ లాభాలను దండుకుంటున్నాయి. తొలి నుంచీ రష్యా కోరుతున్నట్లుగా దాని సమగ్రతకు రక్షణ కల్పిస్తూ నాటోను విస్తరించేది లేదు అని చెప్పేందుకు ససేమిరా అంటున్నాయి. అందుకే తమ రక్షణకు అణ్వస్త్రాలతో సహా దేనికైనా వెనుకాడబోమని పుతిన్ చెబుతున్నాడు. నిజంగా వేస్తాడా లేదా అన్నది ఒకటైతే తెగేదాకా లాగేందుకు అమెరికా పూనుకుంది. మరింతగా భయపెట్టి, గతంలో మాదిరి అణుబూచిని చూపి ఐరోపాను తన చక్రబంధం లోనే ఉంచాలని చూస్తున్నది. రష్యా ఇంథన సరఫరాల్లేకుండా చలికాలాన్ని అధిగమించటం ఐరోపాకు కాస్త ఇబ్బందైనా ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటుంది గానీ, పరిశ్రమల మూత, ద్రవ్యోల్బణం వంటి ఆర్థికపరమైన అంశాలతో పుట్టి మునుగుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పుతిన్‌ను తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని పశ్చిమ దేశాలు చూస్తుంటే జెలెనెస్కీ మీద పుతిన్ గురిపెట్టాడు. అన్ని దేశాలకూ ఈ సంక్షోభాన్ని పంచాలని చూస్తున్న అతను లొంగితే ఆ పరాభవం పశ్చిమ దేశాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందుకే పెద్ద ఎత్తున ఆయుధ సరఫరాలు చేస్తున్నాయి. మొదటికే మోసం వస్తే అంటే తమ జీవితాలనే ఈ సంక్షోభం అతలాకుతలం గావిస్తే ఐరోపా ప్రత్యేకించి ఉక్రెయిన్ జనం ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రశ్న.