Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్నాటకలో హిజాబ్ వివాదానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం రెండు భిన్నమైన అభిప్రాయాలను వెలువరించడం దురదృష్టకరం. సంస్కృతీ సాంప్రదాయాలు, స్వేచ్ఛతో పాటు బాలికల చదువుతో ముడిపడిన ఈ వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోవడం విస్మయకరం. హిజాబ్ ధరించడం అనేది వ్యక్తి స్వేచ్ఛలో భాగమనే వాదన ఒకవైపు... సమానత్వం, లౌకికతత్వం వరిల్లాల్సిన పాఠశాలల్లో మత చిహ్నాలను అనుమతిస్తే దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయన్న వాదన మరొక వైపు. రెండు విరుద్ధమైన వాదనలతో జఠిలమైన సమస్యగా ఒక అంశం మారినప్పుడు దానికి స్పష్టతనిచ్చి పరిష్కారం చూపాల్సిన బాధ్యత న్యాయస్థానాలది. ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో కేసు భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వ విస్తృత ధర్మాసనం వద్దకు చేరింది.
సమానత్వానికి, వ్యక్తి స్వేచ్ఛకు పట్టం కడుతూనే సమాజంలో అణగారిన ప్రజలకు, మైనార్టీలకు సహేతుకమైన సడలింపులు, మినహాయింపులు తప్పనిసరి అని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. ప్రపంచంలో వేరే ఏ దేశానికి లేని 'భిన్నత్వంలో ఏకత్వం' అనే విశిష్ట లక్షణం భారత్‌కు ఉంది. వైవిధ్యమైన సంస్కృతీ సాంప్రదాయాలకు, ఆచారాలకు, భాషలకు, వస్త్రధారణలకు మన దేశం నెలవుగా ఉంది. నుదుట తిలక ధారణ కొందరికి ప్రాణంతో సమానం. మరికొందరికి హిజాబ్ అంతే ముఖ్యం. ఇంకొందరికి కృపాణం తప్పనిసరి. అడుగడుగునా వైవిధ్యం తొణికిసలాడే ఇలాంటి అరుదైన సమాజం మనది. భిన్నత్వంలోనూ సోదరభావంతో ఐక్యంగా మెలుగుతున్న సమాజాన్ని స్వార్థ రాజకీయాల కోసం మతోన్మాదులు వైషమ్యాలు తీసుకొచ్చి ఘర్షణలు రాజేస్తుంటారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ పుట్టుకతోనే 'విద్వేషాన్ని' నింపుకొని వచ్చాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చిననాటి నాటి నుంచి ఆ విద్వేష విషాన్ని చిమ్ముతూ ప్రజలను మతపరంగా, ప్రాంతాల వారీగా, భాషా పరంగా విభిజిస్తూ తన పబ్బం గడుపుకునేందుకు కుట్రలు సాగిస్తోనే ఉంది. 'హిజాబ్' కేంద్రంగా కర్నాటకలో రాజేసిన మత ఘర్షణలకు కూడా ఈ విచ్ఛిన్న రాజకీయాలే కారణం. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం హిజాబ్‌పై నిషేధం విధించి మత ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది. కర్నాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించేవాళ్లు, వ్యతిరేకించేవాళ్లుగా సమాజం రెండుగా చీలిపోయిన దశలో సర్వోన్నత న్యాయస్థానమైనా సముచిత తీర్పును ఇస్తుందని ఆశిస్తాం. కానీ ద్విసభ్య ధర్మాసనం రెండుగా చీలిపోవడం ఆశ్చర్యకరం.
విదార్థుల యూనిఫాం (ఏకరూప దుస్తులు)తో పాటు హిజాబ్ ధరించవచ్చు అనే వాదనను జస్టిస్ హేమంత్ గుప్తా తిరస్కరించారు. మతపర చిహ్నాలను అనుమతిస్తే... అది లౌకికతత్వాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ ఆంక్షలు ఒక హిజాబ్ విషయంలోనే ఎందుకనే ప్రశ్న ఇక్కడ ఉదయించడం సహజర. మరోవైపు ఒక సంస్థ గేటు వద్దే హిజాబ్ తొలగించాలని కోరడమంటే అది వారి గోప్యత, హుందాతనాన్ని దెబ్బతీయడమేనని జస్టిస్ సుధాంశు ధులియా తీర్పు వెలువరించారు. వాస్తవానికి హిజాబ్ ధరించినా, ధరించకపోయినా యూనిఫాంకు వచ్చే నష్టమేమీ లేదు. అలాంటప్పుడు హిజాబ్ ధరించరాదని చెప్పడం వివక్ష చూపడం కాదా? ఇలా హిజాబ్ ధరించరాదని చెప్పడం బాలికల చదువుకు ఆటంకాలు సృష్టించడం కాదా? జస్టిస్ దులియా సరిగ్గా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తూ కర్నాటక విధించిన నిషేధాన్ని తప్పుబట్టారు. క్రమశిక్షణ అనేది వ్యక్తి స్వేచ్ఛను దెబ్బతీసేలా ఉండరాదని స్పష్టీకరించడం హర్షణీయం. ఒక బాలిక హిజాబ్ ధరిస్తే అది శాంతిభద్రతలకు భంగం కలిగిస్తుందని చెప్పడం పట్ల కూడా ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి సంప్రదాయాలకు 'సహేతుక చోటు' కల్పించడం పరిణితి చెందిన సమాజానికి చిహ్నంగా అభిప్రాయపడ్డారు. విద్యాభ్యాసం కోసం బాలుర కంటే బాలికలే ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని వస్తారని, అలాంటి వాళ్లకు ఆంక్షలు విధించడం సరికాదని ఆయన నొక్కి చెప్పారు. పరస్పర విరుద్ధమైన తీర్పు వెలువడటంలో రాజకీయ ప్రభావాలను కూడా కొట్టిపారేయలేం. ఏదేమైనా మైనార్టీల మహిళలకు ప్రత్యేకించి విద్యాభ్యాసం విషయంలో ఆంక్షలు ఏ రూపంలో విధించినా... వాటి వల్ల వారికి కానీ, దేశానికి కానీ ఏ విధంగానూ ప్రయోజనకరం కాబోదు.