Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కళ్ళకున్న గంతలు విప్పేసిన న్యాయదేవత, ఆకాశంవంక చూసింది / నిర్మానుష్యంగా ఉన్న నింగి నేత్రానందంతో వెదుకులాడుతోంది. అయినా... పావురాళ్లను బంధిస్తున్న రాబందుల కాలం అంతమవ్వడం అంత సులువేం కాదు!'' అంటాడు కవి కెంగార మోహన్. అప్పుడప్పుడూ గంతలు విప్పుకుంటాయి. తప్పదు. అన్యాయాలకూ కాలం చెల్లక తప్పదు. ఆశల ఆకాశం నిలబడాలి కదా! ఎక్కడో ఒక చిగురు మొలకేస్తూనే ఉంటుంది. మిణుకు మిణుకుమంటూ ఒక తార వెలుగు చిమ్ముతూనే ఉంటది. అంతదాకా గుండెధైర్యం పిడికిళ్లెత్తుతూనే ఉండాలి. ఏదో ఒకనాడు న్యాయం గెలుస్తుంది. కొన్ని తీర్పులు ఆ నమ్మకాల్ని కలిగిస్తాయి. నిరంతర వేదనాంతరంగాన్ని ఓదారుస్తాయి అంతే! సంతోషాలు ఇలా వెలిగాయో లేదో కారుమేఘాలు కమ్ముతూనే ఉంటాయి.
నిన్న బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ ఇచ్చిన తీర్పు అనేక మంది ప్రజాస్వామిక, ప్రగతి శీల భావకులకు సంతోషాన్ని కలిగించింది. ఒక్కపూట గడవక ముందే సత్యం గొంతుపై తిరిగి సంకెళ్లు బిగుసుకొనిపోయాయి. ఏడు సంవత్సరాలుగా విచారణ జరిపిన హైకోర్టు అన్నీ శోధించి, పరిశీలించి ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఒక్కగంటలోనే ఆ తీర్పు సరైనదికాదని కొట్టేయటంలో న్యాయన్యాయాలు ఏ రాజ్యపు ఆలోచనలకు జన్మిస్తున్నాయో అర్థం కాని విషయం. గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది హక్కుల కోసం, ఆదివాసీల కోసం ఉద్యమించే మేధావులు, కార్యకర్తలను అన్యాయంగా నిర్బంధించి లేనిపోని ఆరోపణలతో కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తూవున్నది. అందులో భాగంగానే 2013లో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ఉపయోగించి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాను అరెస్టు చేసింది ప్రభుత్వం. 2017లో ట్రయిల్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. తీర్పును సవాలు చేస్తూ ఆయన పిటీషన్ వేసారు. ఏడేండ్ల నుండీ సాయిబాబా కఠిన కారాగారాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాల విచారణ తర్వాత ఆయనపై అభియోగాలు నిరాధారమైనవని తేల్చి, వెంటనే విడుదల చేయాలని కోర్టు తీర్పు చెప్పింది. సాయిబాబాతో పాటు మరో ఐదుగురినీ నిర్దోషులని పేర్కొంది. ఆ ఐదుగురిలో ఉన్న ఒకరు పరోతే ఈ సంవత్సరం ఆగస్టులో అనారోగ్యంతో జైళ్లోనే మరణించారు. గతంలో ఒరిస్సా ఆదివాసీ హక్కుల నేత తొంభైయేండ్ల స్టాన్స్వామీ ఇవే ఆరోపణలపై నిర్బంధించబడి జైళ్లోనే అనారోగ్యంతో మరణించారు.
ఇక సాయిబాబా తొంభైశాతం అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తి. ఒక సహాయకుడు లేకుండా నిత్యజీవనం కొనసాగించలేనివాడు. అనేక అనారోగ్యాలతో బాధపడుతున్న అధ్యాపకుడు. వారి అనారోగ్య కారణాల దృష్ట్యా మానవతా దృక్పథంతో వ్యవహరించి విడుదల చేయాలని, కనీసం బెయిల్ మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు, సామాజికులు మేధావులు కోరారు. దేశంలోనే కాదు, విదేశాల నుండీ విజ్ఞప్తులొచ్చాయి. అయినా ససేమిరా అన్నారు. వాళ్లేమి హత్యలు చేయలేదు. అత్యాచారాలు చేయలేదు. ఏ కుట్రలూ పన్నలేదు! అయినా నిర్బంధించారు. తప్పుడు కేసులు పెట్టారు. ఆరోపణలేవీ నిజం కావని తేలిపోయింది. అయినా ప్రభుత్వం వారిని వెంటాడుతూనే ఉంది. హత్యలు, అత్యాచారాలు చేసారని కోర్టులు నిర్ధారణ చేసిన నేరస్తులనేమో ప్రభుత్వాలు చాలా ఔదార్యంతో విడుదల చేస్తాయి. మేధావులను, ప్రజాస్వామిక ఉద్యమకారులనేమో ఆర్బన్ నక్సలైట్లని, సంఘ విద్రోహులని, ఉగ్రవాదులని ఆరోపణలు చేసి అన్యాయంగా నిర్బంధిస్తారు. ఇదీ నేటి పాలకుల కుట్రపూరిత నీతి.
యూఏపీఏ చట్టం పూర్తిగా ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నది. ప్రభుత్వాలు తమకు వ్యతిరేకమనుకున్న వాళ్లపై ఈ చట్టాన్ని ప్రయోగించి దుర్వినియోగానికి పాల్పడుతున్నది. ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అమాయక గిరిజనులపై ఎటువంటి ఆధారాలు లేకుండా నిర్బంధించి కేసులు పెట్టారు. జర్నలిస్టులపై, సామాజిక కార్యకర్తలపై, ఉద్యమకారులపై ఇలాంటి కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారు. గత రెండేండ్లలో ఈ చట్టాన్ని ఉపయోగించి ఐదువేల మందిని నిర్బంధించారు. అందులో కేవలం 139 మందిపైనే నేరం రుజువయింది. మిగతా వాళ్లంతా నిర్దోషులని తేలింది. తమను ప్రశ్నించే వారిని సహించలేని ప్రభుత్వం ఈ రకమైన చర్యలకు పాల్పడుతోంది. ఇది ప్రజలకున్న రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. సాయిబాబా ను విడుదల చేయాలని కోర్టు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామిక వాదులందరూ ఆహ్వానించారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం తీర్పుపై స్టే విధించాలని సుప్రీం కోర్టును కోరింది. సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి ఒక్కగంటలోనే తీర్పును రద్దుచేసింది. కోర్టులకు, తీర్పులకు మధ్య ఎన్ని వ్యత్యాసాలు న్నాయో, ఎన్ని భేదాలున్నాయో దీనిని బట్టి తెలుస్తుంది. అందుకే కొన్ని కోర్టు తీర్పులు ఓదార్పులు మాత్రమే. న్యాయం కోసం చేసే పోరాటం మాత్రం కొనసాగాల్సిందే.