Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైతీ! కోటీ పదమూడు లక్షల జనాభాతో ఉత్తర - దక్షిణ(లాటిన్) అమెరికా ఖండాలకు మధ్యలో ఉన్న కరీబియన్ దీవుల దేశాల్లో ఒకటి. ప్రపంచాన్ని చాపగా చుట్టి తన చంకలో పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా పాలకవర్గ దుష్ట క్రీడకు దశాబ్దాలుగా బలవుతున్న దేశం. అమెరికా తొత్తుగా ఉన్న ప్రధాని ఏరియల్ హెన్రీ అధికారం నుంచి వైదొలగాలని దేశంలోని అనేక ప్రాంతాల్లో లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు. సగం మందికి పైగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనం, చెలరేగుతున్న గూండాల గుంపులు, ఇంథనలేమి, ద్రవ్యోల్బణం, దారిద్య్రం, ఆకలి, కలరాలతో సతమౌతున్న జనం. అన్నింటా విఫలమైన పాలకులకు నిరసన తెలుసుతూ ఆగస్టు 22 నుంచి ఆందోళనలు చేస్తున్నారు. గూండాలను అదుపులో పెట్టలేని ప్రధాని జనాన్ని అణచివేసేందుకు విదేశీ మిలిటరీ జోక్యం చేసుకోవాలని కోరటంతో మరింతగా భగ్గుమన్నారు. తమ జాతిపిత, స్వతంత్ర హైతీ తొలి పాలకుడైన జీన్ జాక్విస్ డెసాలిన్ను 216 సంవత్సరాల క్రితం హత్య చేసిన అక్టోబరు 17వ తేదీన దేశమంతటా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ''ఆక్రమణ ముగిసింది-నూతన స్వాతంత్య్రం వర్థిల్లాలి'' అనే బానర్లు, పతాకాలతో ప్రధానితో పాటు అమెరికా, ఇతర ఆక్రమణదార్లకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఆ ఒక్క రోజునే కాదు తమ డిమాండ్ తీరే వరకు నిరసన కొనసాగించాలని ప్రభుత్వాన్ని వ్యతిరేకించే శక్తులు పిలుపునిచ్చాయి. ఈ పరిణామం ఏ పర్యవసానాలకు దారి తీస్తుందో వెంటనే చెప్పలేం గానీ ''డెసాలిన్స్ వారసుల పార్టీ'' నేత మోషే జీన్ చార్లెస్ దేశంలో విప్లవ సాధనకు తరుణం అసన్నమైందని ప్రకటించాడు.
ఆఫ్రికా నుంచి తీసుకువచ్చిన బానిసల కుటుంబంలో పుట్టిన డెసాలిన్స్ ఫ్రెంచి వలసగా ఉన్న హైతీలో స్వాతంత్య్రం కోసం ఉద్యమించాడు. ఫ్రెంచి విప్లవ భావాలతో ప్రభావితుడై 1791లో వేలాది మంది తోటి బానిసలను సమీకరించి సాయుధులను గావించాడు. మరోపక్క స్పెయిన్ వలన పాలన మీద పోరాడుతున్న ఇతర బానిసలతో కూడా జత కట్టాడు. ఇదే తరుణంలో ఫ్రెంచి విప్లవం జరగటంతో 1794లో హైతీకి స్వాతంత్రం ఇస్తున్న ఫ్రాన్స్ ప్రకటించింది. తరువాత అక్కడి పాలకులు మాట తప్పి తిరిగి హైతీని ఆక్రమించటంతో మరోసారి డెసాలిన్స్ పోరుబాట పట్టి 1804 జనవరి ఒకటిన స్వాతంత్య్ర ప్రకటన చేశాడు. తరువాత అధికారాన్ని స్వీకరించి బానిసత్వాన్ని రద్దు చేశాడు. బానిస యజమానులు, సామ్రాజ్యవాదులు కుట్ర చేసి 1806 అక్టోబరు 17న డెసాలిన్న్ను హత్య చేశారు. అప్పటి నుంచి హైతీ స్వాతంత్య్ర, అమెరికా దురాక్రమణ వ్యతిరేక శక్తులకు ప్రేరణగా నిలిచి ఇప్పటికీ ఉత్తేజమిస్తూనే ఉన్నాడు.
తరువాత జరిగిన అనేక పరిణామాలలో మొదటి ప్రపంచ యుద్ధం నాటికి హైతీ జర్మన్ల ప్రాబల్యంలోకి పోవటంతో రంగంలోకి దిగిన అమెరికా 1915 నుంచి 34వరకు హైతీని ఆక్రమించింది. తరువాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక పేరుతో నిరంతరం జోక్యం చేసుకుంటూనే ఉంది, అక్కడ ఏర్పడిన ప్రభుత్వాలు తన అడుగులకు మడుగులద్దకపోతే కూల్చివేస్తున్నది. దానిలో భాగంగానే 2017లో అధికారానికి వచ్చిన జోవ్నెల్ మోషేను 2021జూలై 7న అంతమొందించారు. ఆ హత్యకు సూత్రధారిగా భావిస్తున్న ఏరియల్ హెన్రీని అదే నెల 20వ తేదీన ప్రధానిగా ప్రతిష్టించారు. అప్పటి నుంచి అక్కడ ఎన్నికలు లేవు, ప్రజాస్వామ్యమూ లేదు. అక్కడి మిలిటరీ, పాలకులు, అమెరికా సిఐఏ సృష్టించిన గూండా గుంపుల్లో మాజీ పోలీసు అధికారి జిమ్మీ చెరిజియర్ నడిపే జి9 గ్రూపు పేరుమోసింది. అలాంటి గుంపులకు అమెరికా, హైతీ ప్రభుత్వం కూడా ఆయుధాలు ఇచ్చి తమ అవసరాలకు వాడుకొనేందుకు రంగంలోకి దింపుతారు. ఇప్పుడు ఆ గుంపు ఒక రేవును ఆక్రమించి చమురు దిగుమతులను అడ్డుకుంటున్నదనే పేరుతో వారి మీద ఆంక్షలను విధించాలని, విదేశీ మిలిటరీ జోక్యం చేసుకోవాలని ప్రధాని హెన్రీ కోరాడు. ఆ మేరకు అమెరికా, మరికొన్ని దేశాలు భద్రతా మండలిలో పెట్టిన తీర్మానాలను రష్యా, చైనా అడ్డుకోవటంతో ఓటింగ్ ఈనెల 21కి వాయిదా పడింది. గూండా గుంపుల పేరుతో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని అణచివేసేందుకే ఆంక్షల ప్రతిపాదనను ముందుకు తెచ్చారని అవి పేర్కొన్నాయి. విదేశీ జోక్య ప్రతిపాదనను తిరస్కరించాయి.
హైతీ అసలు సమస్య అమెరికా, ఐరాస దళాల జోక్యమే. అమెరికా తన వ్యతిరేకులను అణచివేసేందుకు చూస్తే తరువాత వచ్చిన ఐరాస దళాలు కూడా అమెరికా అజెండానే అమలు జరపటం హైతీ విషాదం. ప్రపంచమంతటా కలరా మహమ్మారిని అరికట్టినట్లు ప్రకటించినా హైతీ దానికి మినహాయింపు. ఐరాస దళాలు ఉండగా కలరా వచ్చింది. చికిత్స వ్యర్థాలను ఐరాస సైనికులు ఒక నదిలో కలపటంతో మరింతగా విస్తరించి పదివేల మంది మరణించిన దారుణం జరిగింది. అక్కడి గుంపులను అరికట్టలేదు సరికదా కొత్త వాటిని ప్రోత్సహించారు, అసమ్మతిని అణచివేశారు. అందుకే విదేశీ జోక్య ప్రతిపాదన రాగానే తిరిగి అమెరికాను తమ నెత్తిమీద రుద్దుతున్నట్లుగానే జనం భావించారు. ప్రతిఘటనకు పిలుపునిచ్చారు. అమెరికా ఎన్నికుట్రలకు పాల్పడినా, అణచి వేసినా హైతీలో ఎప్పటికప్పుడు ప్రతిఘటన శక్తులు ఉద్భవిస్తూనే ఉన్నాయి. కరీబియన్ ప్రాంతంలోని ఆ చిన్న దేశం ఇస్తున్న పెద్ద సందేశం అందే.