Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామంటూ . సంగారెడ్డి జిల్లాలోని ఓ మోడల్ స్కూల్ విద్యార్థి సిద్ధార్థ రాసిన లేఖను తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం... ఆ పాఠశాలలో చదువుతున్న దాదాపు 600మంది విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాలని సంబంధిత అధికారులకు నోటీసులు జారీచేసింది. మానవజీవితాన్ని మరింత సౌఖ్యమూ, సౌకర్యవంతమూ చేసేలా పారిశ్రామికాభివృద్ధి ఉండాలి. ఇందుకు విరుద్ధంగా పుంఖానుపుంఖంగా వెలిసే పరిశ్రమల వల్ల ఉపయోగం ఏమిటి? ఈ మౌలిక ప్రశ్నని వందేండ్ల కిందటనే 'రంగభూమి' నవలలో సూరదాస్ పాత్ర ద్వారా ప్రేమ్‌చంద్ లేవనెత్తారు. తన ఊళ్ళో పెట్టే ఫ్యాక్టరీకోసం తన స్థలాన్ని ఇచ్చేది లేదని చివరిశ్వాస వరకు పోరాడాడు. ఇవాళ కూడా తమ చదువును దుర్భరం చేసే పరిశ్రమల పట్ల విద్యార్థులు ఆగ్రహౌదగ్రులయ్యారు కాబట్టే వారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
హైదరాబాద్ నివాసయోగ్యానికి అనుకూలం కాని స్థితికి చేరుతోందని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ హెచ్చరిస్తోంది. దేశంలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై తర్వాత అత్యధిక కాలుష్యం ఉన్న నాలుగో నగరంగా హైదరాబాద్‌ను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ప్రకటించింది. భాగ్యనగరంలో కాలుష్యానికి పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5 ధూళికణాలే ప్రధాన కారణం. నగరంలోని కాలుష్యంలో మూడింట ఒకటో వంతు వాహనాల వల్లేనన్నది జగమెరిగిన సత్యం. వీటికి తోడు, నిర్మాణ వ్యర్థాలు, చెత్తను బహిరంగ ప్రాంతాల్లో మంట పెడుతుండడం కాలుష్యాన్ని మరింత పెంచేస్తున్నాయి. 2021 నాటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం హైదరాబాద్‌లో పీఎం 2.5, 2021లో 39.4 మైక్రో గ్రాములుగానే ఉంది. కానీ, ఏడాది తిరిగే సరికి 70.4 మైక్రో గ్రాములకు పెరిగిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఈ ప్రమాదకర కణాలు గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి, రక్తంలో కలుస్తాయి. దీర్ఘకాలంలో కేన్సర్ సహా ఎన్నో సమస్యలను తెచ్చిపెడతా యని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాలుష్య నివారణకై ప్రభుత్వాలు ఆచరణ యోగ్యం కాని విధానాలతో ప్రయోగాలు చేస్తూ సమస్యను రోజురోజుకు జటిలం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను పట్టిపీడిస్తున్న ఈ మహమ్మారి ప్రాణాంతకంగా మారుతుంది. శారీరక వ్యాధులు, మానసిక రుగ్మతల రూపంలో జన జీవితాల్ని భయకంపితం చేస్తోంది. నివాస, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతా లనే కాదు, విద్యా సంస్థలు, వైద్యశాలలతో సహా అనేక రంగాలను ఈ మహమ్మారి ఇబ్బందుల పాలు చేస్తున్నది.
గ్రేటర్లో కాలుష్య కారక పరిశ్రమలు వదులుతోన్న ఘన, ద్రవ, వాయువులతో మహానగర పర్యావరణం పొగచూరుతోంది. వాతావరణ కాలుష్యానికి, మానవ ఆరోగ్యానికి పొగబెడుతోన్న పారిశ్రామిక కాలుష్యం కట్టడిలో పీసీబీ, పరిశ్రమల శాఖలు దారుణంగా విఫలమవుతున్నాయి. ఆసియాఖండంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న టాప్-10 నగరాల్లో భారత్‌లోనే 8 ఉన్నాయని ప్రపంచవాయు నాణ్యత సూచీ వెల్లడించింది. అదే సమయంలో ఆసియాలో ఉత్తమ వాయు నాణ్యత గల టాప్-10 నగరాల్లో రాజమహేంద్రవరం మాత్రమే భారత్‌లో ఉందని పేర్కొంది.
ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుండే గ్రామాలకు నేడు పరిశ్రమలే ప్రధాన కాలుష్య కారకాలుగా మారాయి. ఏండ్ల తరబడిగా పరిశ్రమలు వెదజల్లే వాయు, రసాయనిక కాలుష్యంతో ప్రజలకు అంతు చిక్కని వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అభివృద్ధి అనే ముసుగులో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం దీనికి తోడవుతున్నది. ప్రాణాంతకమైన రసాయన వ్యర్థాలు భూమి మీద పచ్చటి పంట పొలాలను, చెరువులను, కుంటలను, గాలిని కలుషితం చేస్తున్నా, ప్రజల ఉసురు తీస్తున్నా పరిశ్రమల యజమాన్యాలు చేస్తున్న ఆకృత్యాలు మాత్రం బయటి ప్రపంచానికి కనబడటంలేదు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉండి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా పేరు గడించాల్సిందిపోయి, నేడు ఈ ప్రాంతమంత కాలుష్యంతో రెంటికి చెడ్డ రేవడిగా మారిపోతుండం విషాదకరం. పరిశ్రమలు కాలుష్యాన్ని బయటికి వదలకుండా ఈటీపీలను ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనలు ఉన్నా, ఎక్కడా అమలు కావటంలేదు. రసాయన పరిశ్రమలను ఎక్కడ పెట్టాలనే నిబంధనలు గాలికి వదిలేయడంతో ప్రాణాంతకమైన పరిశ్రమలు ఎక్కడ పడితే అక్కడ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడు తున్నాయి. వాటిపై నిఘా పెట్టాల్సిన అధికారులు పరిశ్రమల యజమా న్యాలు విసిరే చిల్లరకు కక్కుర్తిపడటంతో యథేచ్ఛగా వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారింది. హైకోర్టు జోక్యంతో ఇప్పటికైనా ఈ పరిస్థితి బాగుపడుతుందని ఆశిద్దాం.