Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాతంత్రోద్యమ సమయంలో విదేశీ వస్తు బహిష్కరణ నినాదం ఆ పోరాటానికి ఎంతటి ఊపును, ఉత్సాహాన్నీ ఇచ్చిందనే విషయాన్ని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ కాలంలో మహాత్ముడి పిలుపుతో విదేశీ వస్త్రాలను వీధుల్లో గుట్టలుగా పోసి కాల్చిన వైనాన్నీ అనేక సినిమాల్లో చూశాం. ఇతర దేశాల నుంచి దిగుమతైన వస్త్రాల స్థానంలో స్వదేశంలో తయారైన ఖాదీ వస్త్రాలనే ధరించాలనే గాంధీ గారి పిలుపు యావత్ దేశాన్నే ఊపేసింది. ఆ దెబ్బతో మన రాట్నం..మన చరఖా.. మన మగ్గం ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. అదీ ఆనాటి స్ఫూర్తి. కానీ నేటి మోడీ సర్కార్ ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ చేనేత వృత్తినే నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నది. మాటల్లో 'స్వదేశీ' మంత్రాన్ని జపించే కమలనాథులు ఆచరణలో మాత్రం చేనేత ఉత్పత్తులు, వస్త్రాలపై ఐదు శాతం జీఎస్టీని బాదటం ద్వారా నేత కార్మికులపై తీవ్ర భారాలను మోపుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక వేళ ఈ అంశం అటు రాజకీయ వర్గాల్లోనూ.. ఇటు సాధారణ ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాం శమవుతుండటం తాజా పరిణామం. అక్కడ ఇది ఓ ప్రధాన ప్రచారాస్త్రమైంది. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతోపాటు చేనేతపై జీఎస్టీ వేసిన ఘనత మోడీకే దక్కుతుందనే విమర్శలు వెల్లువెత్తాయి. అధికార టీఆర్ఎస్ నుంచి చేనేత శాఖ మంత్రి కేటీఆర్... ప్రధానికి స్వదస్తూరితో కూడిన లేఖాస్త్రాన్ని సంధించారు. ఆన్లైన్ పిటిషన్ కూడా మోడీకి ఆయన సమర్పించారు. మరికొందరు మంత్రులు, ఎమ్మెల్సీలు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపును అనుసరించారు. ఈ పోస్టు కార్డుల ఉద్యమం ఎంతవరకు సత్ఫలితాన్నిస్తుంది..? ఇందులో రాజకీయపరమైన అంశాలు దాగున్నాయా..? లేదా..? అనే విషయాలను, వాటిలో సహేతుకతను మనం కాసేపు పక్కనపెడితే... అసలు వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను మోపటం ద్వారా చేనేత కార్మికులపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందని చెప్పటానికి వెనుకా ముందూ ఆడాల్సిన పనే లేదు. రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్‌తోపాటు హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్, పాత బస్తీలో వేలాది మంది చేనేత మగ్గంపై ఆధారపడి బతుకుతున్నారు. కరోనాతో ఉపాధి కుదేలై... నేతన్నలు ఉరిపోసుకుంటున్న వేళ మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంలా రంగులు, రసాయనాలు, ఇతర ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగి వృత్తిని ఇంకా దెబ్బతీయటమనేది మరింత ఆవేదనాభరితం. ఇది చాలదన్నట్టు పులి మీద పుట్రలా కేంద్రం చేనేతపై వేసిన ఐదు శాతం జీఎస్టీ అనేది వృత్తితోపాటు వృత్తిదారులనూ కనుమరుగు చేసేదిగా ఉంది.
ఒకే దేశం.. ఒకే పన్ను అనేది పైకి ముద్దులొలికే నినాదంగా ఉన్నా... తరచి చూస్తే ఇందులో దాగున్న 'కార్పొరేట్' రాజకీయం మనకు గోచరిస్తుంది. కాంగ్రెస్ తీసుకొచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలను రాకెట్ వేగంతో అమలు చేయటంలో మోడీ సఫలీకృతులయ్యారు. అందులో భాగమే చేనేతపై జీఎస్టీ కుట్ర. అత్యంత అద్భుత నైపుణ్యంగల నేత కళాకారులు మన సొంతం. అలాంటి కళాకారులతోపాటు వారి వృత్తి... స్వదేశీ, విదేశీ వస్త్ర కంపెనీలు, వ్యాపారులకు అడ్డంకిగా ఉన్నాయి. మరోవైపు చేనేత రిజర్వేషన్ చట్టం (18 రకాల వస్త్రాలను మగ్గంపైన్నే నేయాలనే నిబంధనలతో కూడింది) వారి వ్యాపార సామ్రాజ్యానికి అప్పుడప్పుడూ ఆటంకం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వృత్తిని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా చంపేయటం ద్వారా బడా బడా వస్త్ర కంపెనీలకు మార్కెట్ మొత్తాన్ని అప్పగించొచ్చు నన్నది బీజేపీ సర్కార్ కుతంత్రం. ఇదే చేనేతపై ఐదు శాతం జీఎస్టీ వేయటం వెనకున్న మతలబు. ఈ మతలబే ఇప్పుడు చేనేతకు మరణశాసనం లిఖిస్తోంది.
కేంద్రంలోని బీజేపీ సర్కారు లిఖిస్తోన్న ఈ మరణ శాసన చర్యలపై రణ భేరీ మోగించకపోతే దేశంలోనూ, రాష్ట్రంలోనూ సామాజిక, ఆర్థిక సమస్యలు తలెత్తటం ఖాయం. ఎందుకంటే ఇప్పటికీ దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న ఏకైక రంగం చేనేతే కాబట్టి. మన రాష్ట్రంలోనూ సిరిసిల్లలాంటి కేంద్రాల్లో ప్రతీ ఇంటికీ ఒక చేనేత లేదా మరమగ్గం ఉండటాన్నిబట్టి ఆ వృత్తి ఎంతమందికి బతుకునిస్తుందో అర్థం చేసుకోవచ్చు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు పంపిణీ చేసే చీరలు ఎంతమంది నేతన్నల కడుపులు నింపుతున్నాయో చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో ఒక్క మునుగోడు ఉప ఎన్నిక సందర్భంలోనో.. లేదంటే జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు ఏడు) నాడోగాక ఆ వృత్తి గురించి, నేతన్నల స్థితిగతుల గురించి అనునిత్యం మాట్లాడటం, పోట్లాడటం ద్వారా దాన్నొక రాజకీయ అజెండాగా ముందుకు తేవాలి. అప్పుడు జీఎస్టీ భారాలు, రంగులు, రసాయనాల ధరలతోపాటు ఇతర అన్ని సమస్యలనూ పరిష్కరించు కోవచ్చు. చేనేతను రక్షించుకోవటానికి అదే ఏకైక మార్గం.