Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమ పార్లమెంటు భవనాన్ని తామే తగులబెట్టుకొని నెపాన్ని కమ్యూనిస్టుల మీద నెట్టిన హిట్లర్ ఆ సాకుతో అణచివేతకు పూనుకున్న సంగతి తెలిసిందే. అదే చరిత్రను అమెరికా, జర్మనీతో సహా ఇతర ఐరోపా సామ్రాజ్య వాదులు, వారికి వంతపాడుతున్న ఇతర నాటో దేశాలు మరో రూపంలో ఉక్రెయిన్‌లో పునరావృతం కావించేందుకు కుట్ర చేస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ జనం మీద తామే ''డర్టీ బాంబు''లు వేసి ఆ నెపాన్ని తమ మీద నెట్టేందుకు ఉక్రెయిన్ పూనుకున్నదని మంగళవారంనాడు భద్రతా మండలికి రష్యా ఫిర్యాదు చేసింది. తమ దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నట్లు ప్రకటించింది. గత ఎనిమిది నెలలుగా రష్యా ప్రత్యేక సైనిక చర్యను అమెరికా, ఇతర నాటో దేశాల మద్దతుతో ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌కు మొత్తం మీద తీవ్ర నష్టమే తప్ప పుతిన్ దళాలను వెనక్కు గొట్టిందేమీ లేదు. 2014లో కోల్పోయిన క్రిమియాను కూడా స్వాధీనం చేసుకుంటామని ప్రగల్భాలు పలికిన జెలెనెస్కీకి చెంపపెట్టుగా మరో నాలుగు ప్రాంతాలు స్వాతంత్య్రం ప్రకటించుకోవటమే గాక ఒప్పందం చేసుకొని రష్యాలో విలీనం గావటం పశ్చిమ దేశాలకు ఊహించని పరిణామం. దీంతో ఈ డర్టీ బాంబుదాడులకు పూనుకున్నట్లు కనిపిస్తోంది.
వ్యూహాత్మకంగా రష్యా ఖాళీ చేసిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకొని పుతిన్ సేనలను వెనక్కు కొట్టినట్లు కొద్ది వారాల క్రితం హడావుడి చేసిన జెలెనెస్కీ అవి మినహా తరువాత మిగిలిన ప్రాంతాల్లో ఒక్క అంగుళాన్ని కూడా వెనక్కు తెచ్చుకోలేదు. ఎంత కాలం ఉక్రెయిన్ నిర్వాసిత జనాన్ని భరించాలన్న ఆలోచనతో పాటు, ఈ సంక్షోభం తెచ్చిన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ఇంథన సంక్షోభం, పరిశ్రమల మూత, మాంద్యం వంటి కొత్త సమస్యలతో ఐరోపా దేశాలు సతమతమవుతున్నాయి. ఇల్లుకాలుతుంటే బొగ్గులేరుకొనేందుకు చూసేవారి మాదిరి ఈ పరిణామాల నుంచి నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది పొందాలని చూసిన అమెరికా అధికారపక్షమైన డెమోక్రాట్లకు ఎదురుదెబ్బలు తగలనున్నట్లు వార్తలు ఒక వైపు. మరోవైపు ఈ ఎన్నికల్లో తాము ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీ సాధిస్తే ఉక్రెయిన్‌కు చేస్తున్న సాయాన్ని నిలిపివేస్తామని ప్రతిపక్ష రిపబ్లికన్లు ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అమెరికా సాయం తగ్గుతుందని ఇంకోవైపు వార్తలు. దీంతో ఐరోపా, అమెరికా, ఇతర ప్రపంచ దేశాల ప్రజల దృష్టి మళ్లించేందుకు, రష్యా మీద సరికొత్త ప్రచార దాడికి, వత్తిడిని పెంచేందుకు కొత్త ఎత్తుగడలకు తెరతీశారని చెప్పవచ్చు. వాటిలో భాగమే డర్టీ బాంబులు. అణువిద్యుత్ కేంద్రాలు, ఇతర అణు సంస్థల నుంచి వచ్చే అణువ్యర్ధ పదార్దాలు కూడా అణుధూళిని వెదజల్లుతాయి. పేలుడు పదార్దాలకు వాటిని జత చేసి రూపొందించే వాటిని డర్టీ బాంబులుగా పిలుస్తున్నారు. ఉగ్రవాదశక్తులు ఇలాంటి బాంబులను రూపొందించి దాడులు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అణు బాంబుల మాదిరి ఇవి పేలుళ్లను సృష్టించవుగానీ వీటిని వేసిన ప్రాంతాల్లో వాటి నుంచి వెలువడి వ్యాపించే అణు ధూళి ప్రాణాలను తీయటంతో పాటు తీవ్ర ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. ఆ ధూళి సోకిన ప్రాంతాలను శుద్ది చేయటం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. జనాన్ని భయపెట్టేందుకు ఉగ్రవాదశక్తులు వీటిని ఆయుధాలుగా చేసుకుంటున్నట్లు చెబుతున్నా, గతంలో ఇరాక్, మరికొన్ని దేశాలు కూడా వీటిని రూపొందించినట్లు విమర్శలున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఉక్రెయిన్ చేరింది.
తమ అణు విద్యుత్ కేంద్రంపై దాడిచేసి తగుల బెట్టినట్లు సైనిక చర్య ప్రారంభించిన తొలి వారాల్లో ఉక్రెయిన్ ప్రపంచాన్ని నమ్మించేందుకు చూసిన సంగతి తెలిసిందే. అదంతా వట్టిదే అని తేలింది. తాజాగా జెలెనెస్కీ, పశ్చిమ దేశాలు మరొక కట్టుకథను ముందుకు తెచ్చాయి. తాజాగా రష్యా ఆధీనంలోకి వచ్చిన జఫరోజియా అణువిద్యుత్ కేంద్రాన్ని, కకోవా అనే డామ్‌ను పేల్చేందుకు పుతిన్ సేనలు పూనుకున్నట్లు ప్రచారం ప్రారంభించారు. వాటికి జరిగే నష్టం, తద్వారా జనానికి కలిగే ఇబ్బందులకు రష్యాను బోనులో నిలిపేందుకే ఈ దుష్ట ఆలోచన. నిజానికి వాటి మీద అమెరికా పంపిన క్షిపణులను ఉక్రెయిన్ మిలిటరీ సంధిస్తుండగా రష్యా మిలిటరీ అడ్డుకొని నిర్వీర్యం చేస్తున్నది. జఫరోజియా అణువిద్యుత్ కేంద్రంపై సెప్టెంబరు ఒకటి నుంచి అక్టోబరు 17వరకు 39 సార్లు దాడులు చేసినట్లు రష్యా చెబుతున్నది. క్రిమియా వంతెన పేల్చివేతకు జరిపిన పేలుడు వెనుక ఉక్రెయిన్ హస్తం ఉంది. ఇప్పుడు డర్టీ బాంబులతో మరింతగా రెచ్చగొట్టేందుకు, తన ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న స్వజనాన్ని మరింతగా భయపెట్టేందుకు పశ్చిమ దేశాల సలహాలతో జెలెనెస్కీ ఆడుతున్న ఈ ప్రమాదకర క్రీడ ఏ పరిణామాలకు దారి తీస్తుందో చెప్పలేం. ఇలాంటి ప్రభుత్వ ఉగ్రవాద చర్యలను ప్రపంచం తీవ్రంగా ఖండించాలి, నిరసించాలి.