Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డబ్బు దండెత్తి విలువల్ని ధ్వంసిస్తుంటే ప్రజా ప్రతినిధులు సంతలో పశువులవుతున్నారు. ధనస్వామ్యం ప్రజల ఎంపికను పరిహసిస్తుంటే ప్రజాస్వామ్యం దిక్కులేనిదై బిక్కుబిక్కుమంటోంది. ఈ దేశానికి ఇదేమీ కొత్త విషయం కాకపోయినా, ఇంతటి బరితెగింపు ముందెన్నడూ ఎరుగనిది. ప్రస్తుతం మనుగోడు ఉప ఎన్నికల ప్రహసనంలో అడుగడుగునా చోటుచేసుకుంటున్న ఈ వికృత రాజకీయ క్రీడకు మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటన ఓ పరాకాష్ట.
నలుగురు గులాబీ ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలు ఎరవేసి కొనుగోలు చేయజూసిన కమలం పెద్దల కుట్రలను పోలీసులు ఛేదించారు. ఇది రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయనడానికి, కమలనాథుల నీచమైన దిగజారుడు తనానికి ఓ తాజా ఉదాహరణ. బీజేపీ తరుపున ఈ బేరసారాలు జరిపిన రామచంద్ర భారతి, సింహయాజి స్వామిజీలతో పాటు హైదరాబాద్‌కు చెందిన హౌటల్ యజమాని నందకుమార్‌లు పోలీసు లకు రెడ్‌హ్యండెడ్‌గా దొరికిపోయారు. అయితే పట్టుబడ్డ నిందితులెవరికీ తమ పార్టీతో సంబంధం లేదనీ, ఈ కట్టుకథ ప్రగతి భవన్ ప్రాయోజితమని బీజేపీ నేతలు వాదిస్తున్నా... ఇవన్నీ వట్టి బుకాయింపులేనని సదరు సాధుపుంగవుల చిత్రమాలికలు రుజువు చేస్తున్నాయి. వారు బీజేపీ అగ్రనేతలతో అత్యంత సన్నిహితంగా ఉన్న 'చిత్ర రాజాలు (పొటోలు)' అసలు సంగతిని ఎత్తిచూపు తున్నాయి. అయినా బీజేపీ హయాంలో స్వామిజీల రాజకీయ ప్రాబల్యం, ఇలాంటి వ్యవహారాల్లో డీల్మేకర్స్గా వారి నిర్వాకం తెలియనిదెవరికి?
అయినప్పటికీ వీరి బుకాయింపుల పర్వం కొనసాగుతూనే ఉండటం విచిత్రం! ఏకంగా ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయుడు యాదగిరిగుట్టలో తడిబట్ట స్నానాలు, గుడి ముందు ప్రమాణాలు చేస్తుండగానే, సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూసిన ఆడియో టేపులు అంతకు మించి హల్చల్ చేస్తున్నాయి. ఈ టేపుల్లోని సంభాషణలు సంచలనం సృష్టిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో, రామచంద్రభారతీ, నందకుమార్‌లు జరిపిన ఈ సంభాషణలు ఇది బీజేపీ అత్యున్నత స్థాయిలో చేసిన ఆపరేషన్ అని స్పష్టం చేస్తున్నాయి. వీరి సంభాషణలో పి.ఎల్. సంతోష్ పేరు వినిపించడం, నెం 2, నెం 1ల ప్రస్థావన రావడం దీనిని రుజువు చేస్తోంది. పి.ఎల్. సంతోష్ బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాగా, సదరు నెం 2, నెం1ల గురించి చెప్పాల్సిన పనేలేదు!
ఇదంతా సంతోష్ పర్యవేక్షణలోనే జరుగుతుందనీ, చివరకు నెం 2 సమక్షంలోనే ఈ డీల్ ఫైనల్ అవుతుందనీ, అవసరమైతే నెం1 కూడా మాట్లాడుతారనే మాటలు ఈ ఆడియో టేపుల్లో మనం విని తరించవచ్చు. ''మీరు కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో ఉంటారనీ, ఎవరికీ భయపడాల్సిన పనిలేదనే'' హామీలు కూడా ఈ సంభాషణల్లో గమనించవచ్చు. ఇక ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల నుండి కూడా మీకు ఏ ముప్పు ఉండదనే భరోసాలు సరేసరి. సెంట్రల్ ఏజెన్సీల దుర్విని యోగాన్ని ఈ విధంగానైనా ఒప్పుకున్నారన్న మాట! ''పి.ఎల్. సంతోష్ ఇక్కడికి వస్తారా?'' అన్న రోహిత్‌రెడ్డి ప్రశ్నకు ''ఎక్కువ మంది ఉంటే తప్పకుండా వస్తారనే'' రామచంద్ర భారతి సమాధానం ఈ ఆపరేషన్ కేవలం నలుగురికే పరిమితమైనది కాదని కూడా తెలియజేస్తోంది. అంతిమంగా ఇవన్నీ సూచిస్తున్నదేమిటి..? కమలనాథుల కంపు రాజకీయాలనే కదా..! అందుకే ''పురిటి నొప్పులు పడుతున్న నిండు గర్భిణీపై అత్యాచారం జరిపే కామాంధుడి కన్నా వికారంగా కనిపిస్తోంది నాకీ దేశపు వర్తమానం'' అన్న అలిశెట్టి ప్రభాకర్ వ్యాఖ్యలు ఇక్కడ గుర్తుకు రాక మానవు.
ఇంత జరిగినా ఇప్పటికీ ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ బుకాయింపుల పర్వమే కొనసాగిస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య ఆరోపణలూ - ప్రత్యారోపణలూ, సవాళ్లూ - ప్రతి సవాళ్లూ అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. టీఆర్ఎస్ ఏమో ఇదీ బీజేపీ ఆపరేషన్ అంటోంది. బీజేపీ ఏమో ఇది టీఆర్ఎస్ డ్రామా అంటోంది. మరి ఏది నిజం? ఇందులో నిజానిజాల మాటెలా ఉన్నా, ఈ ఇరువురికీ ఈ తరహా వ్యవహారాల్లో మినహాయింపు లేదన్నది మాత్రం కాదనలేని నిజం! అయితే ఇందులో బీజేపీది అందెవేసిన చేయి. ఇప్పుడు దేశంలో వారి ప్రభుత్వాల్లో ప్రజలెన్నుకున్న వాటి కంటే, తాము కొనుక్కున్న వారితో ఏర్పాటు చేసుకున్నవే ఎక్కువ! ప్రజలు తిరస్కరించిన ప్రతిచోటా వారు చేసింది ఇదే! మొన్నటి కర్నాటక నుండి నిన్నటి మహారాష్ట్ర వరకు అనేక ప్రభుత్వాలు ఇందుకు రుజువులు. కోట్లాది రూపాయల నగదు, కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు ఎర వేయడం, కాదంటే ఈడీ, సీబీఐలను చూపి బెదిరించడంలో వారి ''నైపుణ్యాలు'' ఎనిమిదేండ్లుగా ఈ దేశం చూస్తూనే ఉంది. తాజా మనుగోడు ఎన్నిక కూడా వీరి ఈ అపార నైపుణ్యానికి నిదర్శనమే..! ఈ మనుగోడుకు ముందే ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ను వీడుతున్నారనే భావనలు కల్పించడం, ఇక రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్న భ్రమల్లో తెలంగాణ ప్రజల్ని ముంచెత్తడం వీరి ఈ తాజా పథక సారాంశం! అది కాస్తా బెడిసికొట్టడంతో ''దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించడండి'' అంటూ తడిబట్ట స్నానాలూ, గుడి ముందు ప్రమాణాలూ చేస్తున్నారు. సీబీఐ ఎవరి పంజరంలోని చిలుకో తెలియనిదెవరికి?! ఈ తతంగమంతా ఎవరిని నమ్మించడానికి?